నా బిడ్డల విషయంలో కూడా అబద్ధాలు చెప్పారు

ఎన్ని అబద్ధాలు చెప్పారో మీకు తెలుసు. విజయసాయిరెడ్డి ఇప్పటికైనా నిజాలు చెప్పాలని వైఎస్‌ షర్మిల అన్నారు.;

Update: 2025-01-25 15:02 GMT

విజయసాయిరెడ్డి తన గురించి తాను చెప్పుకున్న విషయాలకు, విజయసాయిరెడ్డి గురించి వైఎస్‌ షర్మిల చెబుతున్న అంశాలకు పొంతన లేదు. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నడూ అబద్ధాలు చెప్పలేదని విజయసారెడ్డి చెబితే.. విజయసాయిరెడ్డి ఎన్నో అబద్ధాలు చెప్పారని షర్మిల అంటున్నారు. తాను హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తిగా.. వెంకటేశ్వర స్వామిని పూజించే వ్యక్తిగా తాను ఏ నాడూ అబద్ధాలు చెప్ప లేదని, భవిష్యత్‌లో కూడా అబద్ధాలు చెప్పనని విజయసాయిరెడ్డి తన రాజీనామా సందర్భంగా శనివారం ఉదయం ఢిల్లీలో మాట్లాడుతూ చెప్పారు. అయితే షర్మిల మాత్రం వాటిని పూర్తి స్థాయిలో కొట్టిపడేస్తున్నారు. ఎన్నో అబద్ధాలు చెప్పారని విజయసాయిరెడ్డి మీద విమర్శలు చేశారు. ఒక రాజకీయంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా.. చివరకి తన బిడ్డల విషయంలో కూడా మీడియా ముందుకొచ్చి విజయసాయిరెడ్డి అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. అబద్ధాలు చెప్పిన వ్యక్తి విజయసాయిరెడ్డి అయితే అలా చెప్పించిన వారు జగన్‌మోహన్‌రెడ్డి అని మండి పడ్డారు. శనివారం ఆమె మాట్లాడుతూ ఇప్పటికైనా నిజాలు చెప్పాలని విజయసాయిరెడ్డికి సూచించారు. మీరు ఎన్ని అబద్దాలు చెప్పారో అన్నీ మీకు తెలుసు. అన్ని విషయాలు కూడా వైఎస్‌ అవినాష్‌రెడ్డిని, జగన్‌మోహన్‌రెడ్డిని కాపాడటం కోసం చేశారు. వాటినన్నింటినీ చేశారో బయట పెట్టాలి. అప్పుడైనా జనాలు సంతోషిస్తారని ఆమె మాట్లాడారు.

జగన్‌మోహన్‌రెడ్డి ఏ పని ఆదేశిస్తే అది చేయడం.. ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడం విజయసాయిరెడ్డి పని. వ్యక్తిగతంగా.. రాజకీయంగా ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా చేశారంటే.. ఇది చిన్న విషయం కాదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలైనా, వైఎస్‌ఆర్‌ అభిమానులైనా, ఆలోచనలు చేయాలి. జగన్‌ను ఈ రోజు విజయసాయిరెడ్డి వంటి వారే జగన్‌మోహన్‌రెడ్డిని వదిలేస్తున్నారంటే.. ఎందుకు వదిలేస్తున్నారు? జగన్‌మోహన్‌రెడ్డికి దగ్గరగా ఉన్న వాళ్లు, జగన్‌మోహన్‌రెడ్డి కోసం ప్రాణం పెట్టే వాళ్లు ఒక్కొక్కరిగా వీడుతున్నారంటే దానికి కారణం జగన్‌మోహన్‌రెడ్డి నాయకుడిగా విశ్వసనీయత కోల్పోవడమే. నాయకుడిగా జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రజలను, తనను నమ్ముకున్న వారికి కూడా నమ్మకం కలిగించ లేక పోతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే వీరంతా ఆ పార్టీని వీడుతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి తనను తాను కాపాడుకోవడం కోసం విజయసాయిరెడ్డిని బీజేపీ వద్దకు పంపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. జగన్‌మోహన్‌రెడ్డి ఇంత కాలం తన వద్ద విజయసాయిరెడ్డిని ఉంచుకునే బీజేపీ నుంచి అన్ని రకాల సేవలు పొందారు.. తనను తాను కాపాడుకోగలిగారు. అంటూ వ్యాఖ్యలు చేశారు.
Tags:    

Similar News