ఎనిమిది చదివాడు.. ఏపీలో మంత్రి అయ్యాడు
ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడిన మంత్రుల్లో కొంత మంది ఉన్నత విద్యా వంతులు కాగా మరి కొంత మంది ఇంటర్ వరకే చదవారు.
Byline : The Federal
Update: 2024-06-13 15:11 GMT
ఏ ఉద్యోగానికైనా కనీస విద్యార్హత ఉంటుంది. కానీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రుల వంటి చట్ట సభల్లో శాసనాలు చేసే పోస్టులకు మాత్రం టెన్త్ ఫెయిల్ అయినా పర్వాలేదు.. ఇంటర్ వరకు చదివినా పర్వాలేదు ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కొలువు దీరిన మంత్రులు ఏమి చదవుకున్నారు.. ఎంత వరకు చదువుకున్నారనే అంశాన్ని ఒక సారి పరిశీలిస్తే మెడిసిన్ చదివిన వారు ఒకరు ఉండగా, పిహెచ్‌డీలు చేసి డాక్టరేట్లు సంపాదించిన వారు ఇద్దరు ఉన్నారు. తక్కిన వారిలో ఎక్కువ మంది డిగ్రీలు, పీజీలు, ఎంబిఏలు చేసిన వారు ఉన్నారు. వీరితో పాటు టెన్త్ డిస్కంటిన్యూ చేసిన వారు, అంత కంటే తక్కువ చదివిన వారు కూడా ఉన్నారు.
మంత్రుల అందరిలో కంటే తక్కువ చదవు చదువుకున్నది బీసీ జనార్థనరెడ్డి. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం ఈయన కేవలం 8వ తరగతి మాత్రమే చదవారు. కర్నూలు జిల్లా బనగానపల్లి గవర్నమెంట్ హైస్కూల్ నుంచి ఎస్‌ఎస్‌ఎల్సీ ఇన్‌కంప్లీట్ చేశారు. బొబ్బల చిన్నోళ్ల జనార్థనరెడ్డి.. బీసీ జనార్థనరెడ్డిగా ఫేమస్. ఈయన 2014లో తొలి సారి బనగానపల్లె నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డిపై 17,341 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డి చేతిలో ఓటమి చవిచూసిన జనార్థనరెడ్డి 2024 ఎన్నికల్లో విజయం సాధించి మంత్రి పదవిని దక్కించుకున్నారు.
పిఠాపురం నుంచి తొలిసారి గెలుపొంది మంత్రి పదవిని దక్కించుకున్న జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఇంటర్ వరకు చదువుకున్నారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీషు మీడియం హైస్కూల్ నుంచి టెన్త్ క్లాస్ పాస్ అయినట్లు పేర్కొన్నారు.
అద్దంకి నుంచి నాలుగోసారి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ తాజాగా మంత్రి పదవి దక్కించుకున్నారు. ఈయన కూడా ఇంటర్ వరకే చదువుకున్నారు. ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే డిస్‌కంటిన్యూ చేశారు.
కొలుసు పార్థసారథి కూడా ఇంటర్ వరకు చదువుకున్నట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. హైదరాబాద్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాల నుంచి ఇంటర్ చదివిన పార్థసారథి, హైదరాబాద్‌లోని సీబీఐటీలో బీటెక్ చేరి డిస్‌కంటిన్యూ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈయన మంత్రిగా పని చేశారు.
రెండో సారి మంత్రి అయిన నారా లోకేష్ అమెరికా స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ చదివారు. మరో సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు డిగ్రీ చదివారు. రెండో సారి మంత్రి పదవిని దక్కించుకున్న కొల్లు రవీంద్ర రెండు డిగ్రీలు చేశారు. బీఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసి, తాజాగా చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న నాదెండ్ల మనోహర్ ఎంబీఏ చేశారు. తొలి సారి మంత్రి పదవి దక్కించుకున్న వంగలపూడి అనిత ఎంఏ, ఎంఈడీ చేసి, ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు.
టీడీపీలో సీనియర్ నేత అయినప్పటికీ తొలి సారి మంత్రి పదవిని దక్కించుకున్న పయ్యావుల కేశవ్ డిగ్రీతో పాటు మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా చేశారు. మాజీ ఎమ్మెల్సీ, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన గుమ్మిడి సంధ్యారాణి బీఎస్సీ చేశారు. రేపల్లె నుంచి గెలిచి మంత్రి పదవిని సొంతం చేసుకున్న అనగాని సత్యప్రసాద్ కూడా డిగ్రీ చదివారు.
నిడదవోలు నుంచి గెలిచి మంత్రి పదవిని పొందిన జనసేన నేత కందుల దుర్గేష్ ఆర్థిక శాస్త్రంలో ఎంఏ చదివారు. కర్నూలు నుంచి గెలిచి మంత్రిగా అయిన టీజీ భరత్ యుకేలో ఎంబీఏ చదివారు. పెనుగొండ నుంచి తొలిసారి గెలిచి మంత్రి అయిన ఎస్ సవిత డిగ్రీ చదివారు. రామచంద్రాపురం నుంచి గెలిచి అందరి అంచనాలను తారుమారు చేస్తూ మంత్రి పదవిని దక్కించుకున్న వాసంశెట్టి సుభాష్ బీస్సీ, ఎల్‌ఎల్‌బీ చదువుకున్నారు. విజయనగరం నుంచి గెలిచి మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాస్ కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదివారు. రాయచోటి నుంచి గెలిచి మంత్రిగా పదవిని దక్కించుకున్న మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి బీడీఎస్ చేశారు.
సీనియర్ నేతలైన ఎన్‌ఎండీ ఫరూక్ పియూసీ, ఆనం రామనారాయణరెడ్డి బీకాం, బీఎల్ చదవుకున్నారు. ధర్మవరం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచి మంత్రి పదవిని సొంతం చేసుకున్న నత్యకుమార్ యాదవ్ రాజనీతి శాస్త్రంలో ఎంఏ చదువుకున్నారు.
ఇక కొండపి నుంచి హ్యట్రిక్ విజయం సాధించి మంత్రి పదవిని సొంతం చేసుకున్న డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఎంబీబీఎస్ చదువుకున్నారు. పాలకొల్లు నుంచి గెలిచి మంత్రిగా పదవిని సొంతం చేసుకున్న నిమ్మల రామానాయుడు జాగ్రఫీలో ఎంఫీల్, పిహెచ్‌డీ చేశారు. రెండో సారి మంత్రి పదవిని సొంతం చేసుకున్న పి నారాయణ ఎమ్మెస్సీ, పిహెచ్‌డీ చేశారు. స్టాటిస్టిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించారు.