హలో, మీ పంటలు ఎలా ఉన్నాయి?
మా అధికారి వచ్చి జాగ్రత్తలు చెప్పారా? తుపాను వస్తోంది, మీ పంటలు జాగ్రత్త!
By : The Federal
Update: 2025-10-27 13:35 GMT
మొంథా తుపాను ముంచుకువస్తుండడంతో వ్యవసాయ శాఖ రైతుల్ని అప్రమత్తం చేసింది. రైతులు తమ పంటలను కాపాడుకుకునేలా చర్యలు చేపట్టింది.
తుపాను తాకిడి ఉండే ప్రాంతాల్లోని పంటలను గుర్తించి రైతు సేవా కేంద్రాలు (RSKs) సమాచారం ఇచ్చింది. గ్రామాల్లోని వ్యవసాయ విస్తరణ సిబ్బంది రైతులను వ్యక్తిగతంగా కలసి, తుపాను ముందు తీసుకోవాల్సిన పంట సంరక్షణ చర్యలను వివరించాలని ఆదేశించింది.
ప్రతి మూడు గంటలకు ఒకసారి తాజా తుపాను సమాచారం బులెటిన్ల రూపంలో రైతులకు చేరేలా చర్యలు చేపట్టింది. రైతుల నుంచి ప్రత్యక్ష ఫీడ్‌బ్యాక్ తీసుకునేలా ఏర్పాట్లు చేసింది. IVRS సిస్టమ్ ద్వారా రైతుల నుంచి ప్రత్యక్ష ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. ఫీల్డ్ సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ కమిషనర్ బి. రాజశేఖర్ హెచ్చరించారు.
వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశుసంవర్థక శాఖలూ అప్రమత్తం అయ్యాయి. గోదావరి జిల్లాల్లో కాలువల్లో నీటి విడుదలను తగ్గించారు. వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలు గుర్తించి, డ్రైనేజ్ వ్యవస్థలు శుభ్రం చేసే పనులు వేగవంతం చేశారు.
తుపానుకు ముందు రైతులకు పంటల వారీగా సుమారు 69 లక్షల హెచ్చరిక సందేశాలు పంపించామని, సోషల్ మీడియా ద్వారా అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అధికారులు ప్రకటించారు. సుమారు 6.23 లక్షల ఎకరాల్లో వరి పంటలు తుపానుకు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రత్యేకించి కొనసీమ, కాకినాడ జిల్లాల్లో అరటి పంట ఎక్కువగా ఉన్నందున, రైతులు మొక్కలను కట్టెలతో కట్టి బలపరచాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది.