ఇకపై ఎపి ప్రభుత్వ భవనాల్లో సోలార్‌ వెలుగులు

ప్రభుత్వ భవనాల్లో సాధారణ విద్యుత్‌ స్థానంలో సోలార్‌ విద్యుత్‌ను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తోంది.

Update: 2024-08-15 13:53 GMT

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్‌ వినియోగ ఖర్చును తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో సోలార్‌ పవర్‌ యూసేజ్‌ను పెంచనుంది. అందులో భాగంగా తొలుత ప్రభుత్వ కార్యాలయాలపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు ప్రస్తుతం వినియోగిస్తున్న కరెంట్‌కు బదులుగా సోలార్‌ పవర్‌ను ఉపయోగించాలని భావిస్తున్నారు. దీని కోసం గవర్నమెంట్‌ భవనాలకు సోలార్‌ రూప్‌టాప్‌లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు ఈ సోలార్‌ రూఫ్‌ టాప్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 2025వ సంవత్సరం ఆఖరుకల్లా ఈ సోలార్‌ ప్యానళ్లను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అయితే ఒకే సారి కాకుండా ఈ కార్యక్రమాన్ని దశల వారీగా చేపట్టేందుకు అడుగులు వేస్తున్నారు. తొలి దశలో 300 మెగా వాట్ల సోలార్‌ రూప్‌టాప్‌లను అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్‌టిపిసి విద్యుత్‌ వ్యాపర్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఎస్‌వివిఎస్‌) ఆధ్వర్యంలో రూప్‌టాప్‌ ప్యాన్లను ఏర్పాటు చేయనున్నారు. అమర్చిన తర్వాత వాటి నిర్వహణతో పాటు మెయింటెనెన్స్‌ వంటి పనులన్నీ ఎస్‌వివిఎస్‌ ఆధ్వర్యంలోనే సాగనున్నాయి. ఒక్క సారి ఈ ప్యానళ్లను ఏర్పాటు చేస్తే దాదాపు 25 ఏళ్ల పాటు పని చేస్తాయి.
ప్రభుత్వ కార్యాలయాల బిల్లింగ్‌లకు సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటు చేయడం వల్ల పెద్ద ఎత్తున విద్యుత్‌ వినియోగం బిల్లులను తగ్గించుకోవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీటిని ఉపయోగంచడం వల్ల ప్రతి ఏటా రూ. 118.27 కోట్లు చొప్పున బిల్లుల చెల్లింపులు ఆదా చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఇలా 25 ఏళ్లకు సుమారు రూ. 2,957 కోట్లు బిల్లుల చెల్లింపులు ఆదా చేసుకోవచ్చని ప్రభుత్వం ఆంచనా వేస్తోంది. పవర్‌ బిల్లుల చెల్లింపులతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించుకోవచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వం అనుకున్న ప్రకారం 300 మెగా వాట్ల సోలార్‌ ప్యానళ్లను గవర్నమెంట్‌ బిల్డింగ్‌లకు ఏర్పాటు చేయడం వల్ల ఏడాదికి సుమారు 3.41లక్షల మెట్రిక్‌ టన్నులు, 25 ఏళ్లకు దాదాపు 85.25 లక్షల మెట్రిక్‌ టన్నుల ప్రమాదకరమైన కార్బన్‌ ఉద్గారాలను తగ్గించుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వ భవనాలకు సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుకు సంబంధించి విద్యుత్‌ వ్యాపర్‌ నిగమ్‌ లిమిటెడ్‌తో బుధవారం సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, ఎన్‌టీపీసీ సీఎమ్‌డి గూర్‌దీప్‌ సింగ్, ఎన్‌వివిఎస్‌ సీఈఓ రేణు నారంగ్, జన్‌కో సీఎండి కేవిఎన్‌ చక్రధర్‌బాబు పాల్గొన్నారు.
Tags:    

Similar News