పవన్ కల్యాణ్ కు జైకొట్టిన హీరో నానీ, హోరెత్తుతున్న సోషల్ మీడియా!
ఆల్ ది వెరీ బెస్ట్ సర్, అని నటుడు నానీ తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు మద్దతుగా సినీనటులు ప్రచారం చేయడం కొత్తేమీ కాదు. ప్రత్యేకించి తెలుగు నాట సినీనటులు చాలా కాలం నుంచే ఎన్నికల ప్రచారం చేసిన ఘటనలు ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీలకు మద్దతుగా అలనాటి నటుడు, రక్తకన్నీరు ఫేం నాగభూషణం, జనసంఘ్ తరఫున కంచుకంఠం జగ్గయ్య, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా సినీనటుడు కృష్ణ, జమున, జయసుధ, బీజేపీ తరఫున సౌందర్య, వైసీపీకి మద్దతుగా సినీనటుడు ఆలీ, పోసాని లాంటి వారెందరో ప్రచారం చేసిన అనుభవం ఉంది. ఇక ఎన్టీరామారావు నేరుగా పార్టీనే పెట్టి స్వల్పకాలంలో అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు. మరో ప్రముఖ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించారు. ఎక్కువ సీట్లు సంపాయించకపోయినా ఆరోజుల్లో అదో మైలురాయి. ఆ తర్వాత ఇప్పుడు చిరంజీవి తమ్ముడు జనసేన పార్టీని పెట్టి పదేళ్లుగా రాజకీయ పోరాటం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచిన పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి ఒక చోట గెలిచారు. 2024 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో కూటమిగా ఏర్పడి 21 అసెంబ్లీ సీట్లకు పోటీ పడుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న ఆయనకు మద్దతుగా ఇప్పటికే చాలామంది చోటామోటా నటులు ప్రచారం చేస్తున్నారు. ఆయన సోదరులు నాగబాబు పార్టీలో చాలా చురుగ్గా పాల్గొంటుండగా ఆయన అన్న చిరంజీవి తమ తమ్ముణ్ణి గెలిపించమని ఇప్పటికే అప్పీల్ చేశారు. సాయి ధరమ్ తేజ్ పిఠాపురం సహా వివిధ ప్రాంతాలలో ప్రచారం చేస్తున్నారు.