ఏపీ సర్కార్‌‌కు హైకోర్టులో చుక్కెదురు..

వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీని నిలిపేయాలంటూ ఈసీ ఇచ్చిన ఆదేశాలను ఛాలెంజ్ చేస్తూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

Update: 2024-04-03 10:10 GMT
Source: Twitter

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వాలంటీర్ల ద్వారా పెన్షన్లను అందించడాన్ని నిలువరిస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను జగన్ సర్కార్.. హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఈ కేసులో నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం నిమిషాల వ్యవధిలోనే పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. వాలంటీర్లపై వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకునే ఎన్నికల సంఘం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని న్యాయస్థానం వెల్లడించింది. అంతేకాకుండా వాలంటీరు వ్యవస్థలేని ఇతర రాష్ట్రాలు కూడా ఇంటికి వెళ్లే పెన్షన్ అందిస్తున్నాయి కదా అని ఆంధ్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నడుచుకుంటూ ప్రభుత్వ కార్యాలయం దగ్గరకు రాలేని వారికి సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ అందించాలని హైకోర్టు స్పష్టం చేసింది. పెన్షన్ పంపిణీ సజావుగా సాగేలా ఎన్నికల సంఘం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తున్నామని న్యాయస్థానం వెల్లడించింది.

Tags:    

Similar News