వైసీపీకి ముస్లిం ఎమ్మెల్సీ రాజీనామా

వైసీపీ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల ముంగిట ముచ్చటగా మూడో నేత పార్టీని వీడారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్‌ను పంపారు.

Update: 2024-04-05 13:08 GMT
Source: Twitter

ఎన్నికల ముందు వైసీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఒక షాక్ నుంచి తేరుకోకముందే మరో షాక్ తగులుతూ పార్టీ అధిష్టానాన్ని గందరగోళానికి గురిచేస్తోంది. కిల్లీ కృపారాణి, ఆమంచి రాజీనామాలను జీర్ణం చేసుకోకముందే పార్టీకి మరో కీలక నేత వీడ్కోలు పలికారు. అనంతపురం జిల్లా వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్‌కు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ శాసనమండలి ఛైర్మన్‌కు రాజీనామా లేఖను పంపారు. తన రాజీనామాను ఆమోందించాలని ఆయన కోరారు.

ఇక్బాల్ నేపథ్యం ఇది

పోలీసుగా విధులు నిర్వర్తించిన ఇక్బాల్.. 2019 ఎన్నికల్లో రాజకీయ ప్రవేశం చేసి హిందూపురం సీటు నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున బాలకృష్ణ పోటీ చేయగా ఆ పోరులో బాలయ్యనే విజయం వరించింది. దాంతో ఇక్బాల్‌కు జగన్‌.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దాంతో పాటుగా హిందూపురం పార్టీ ఇన్‌ఛార్జ్‌గా కూడా ఇక్బాల్ కొనసాగారు. ఆ తర్వాత ఇన్‌ఛార్జ్‌గా దీపకను నియమించారు. అంతకుమించి మరే ఇతర విషయంలో ఇక్బాల్‌ను జగన్ పరిగణనలోకి తీసుకోలేదు. తాజాగా పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు.

ఇక్బాల్ నెక్స్ట్ స్టెప్ అటే..

అయితే పార్టీలో తగ్గుతున్న ప్రాధాన్యం కారణంగానే ఇక్బాల్ రాజీనామా చేస్తున్నారని, తనను జగన్ పట్టించుకోవట్లేదన్న అసంతృప్తితోనే ఆయన రాజీనామా లేఖ రాశారని పార్టీ వర్గాలు అంటున్నాయి. 2024 ఎన్నికల్లో మరోసారి హిందూపురం నుంచి పోటీ చేయాలని ఇక్బాల్ ఆశించారని, కానీ టికెట్ దక్కకపోవడంతో పార్టీని వీడారని, దానికి తోడు తనకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోవడం కూడా ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే అతి త్వరలోనే ఇక్బాల్.. కాంగ్రెస్ కండువా కప్పుకోవచ్చని, లేని పక్షంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండే అవకాశం ఉందే తప్ప స్వతంత్ర అభ్యర్థిగా మాత్రం పోటీ చేయరని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఇక్బాల్ భవిష్యత్ కార్యాచరణ ఏంటో తెలియాలంటే వేచి చూడాల్సిందే.



Tags:    

Similar News