చెప్పిన వారినే నియమించుకోండి

నేను చెప్పిన వాళ్లను ఓఎస్‌డీలుగా, పీఎస్‌లుగా పెట్టుకోండి. మంత్రులకు స్ట్రిక్ట్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ జారీ చేసిన లోకేష్‌.

Byline :  The Federal
Update: 2024-06-30 09:25 GMT

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌ అటు ఇటీవల కొలువు దీరిన మంత్రి వర్గంపై పట్టు సాధించేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. తన కనుసన్నుల్లో మంత్రి వర్గం పని చేసే దిశగా రిమోట్‌ కంట్రోల్‌ను తన వద్ద ఉంచుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారనే చర్చ ఇప్పుడు ఆ పార్టీలో జరుగుతోంది. అందులో భాగంగా మంత్రులు ఎవరికి వారు సొంతంగా ఓఎస్‌డీలను కానీ, పీఎస్‌లను, పీఏలను, పేషీల్లోని ఉద్యోగులు, ఇతర సిబ్బందని కానీ నియమించుకోవద్దని, తాము సూచించిన వారిని నియమించుకోవాలని ఇప్పటికే ఖచ్చితమైన ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇచ్చినట్లు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా మంత్రులకు శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్షలు నిర్వహించేందుకు, పాలన పరమైన అంశాలపై చిన్న పాటి నిర్ణయాలు తీసుకునేందుకు ఒక పక్కన స్వేచ్చనిస్తూనే మరో వైపు మంత్రుల అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు, ఆయా పేషీల్లో ఏమి జరుగుతుందనే అంశాలను ఎప్పటికప్పుడు మోనటరింగ్‌ చేసి సక్రమ మార్గంలో నడిపించేందుకు ఇలాంటి నిర్ణయం లోకేష్‌ తీసుకుంటున్నట్లు కొంత మంది టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నా.. మంత్రి వర్గాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇస్తున్నారనే విమర్శలు మరి కొంత మంది టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. మరో వైపు తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు దీనిపై అసంతృప్తులు వ్యక్తం చేస్తున్నట్లు కూడా ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి సీనియర్‌ మంత్రుల విషయంలో కూడా తన ఇన్‌స్ట్రక్షన్స్‌ పాటించేలా పట్టుదలతో లోకేష్‌ ఉన్నట్లు టాక్‌ నడుస్తోంది.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. జనసేనతో పాటు బీజేపీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది. అయితే వీరికి మాత్రం మినహాయింపులు ఇచ్చారని, వారికి నచ్చిన వారిని నియమించుకునే అవకాశం ఉందని, టీడీపీ మంత్రులకు మాత్రమే దీనిని వర్తింప చేస్తున్నారనే టాక్‌ కూడా ఉంది.
ప్రస్తుతం మంత్రి వర్గంలో చోటు దక్కించున్న వారిలో ఎక్కువ మంది కొత్త వారు కావడంతో లోకేష్‌ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలనే ఆలోచనలో ఉన్నారు. తొలి సారి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటుగా మంత్రులుగా అవకాశం కల్పించడంతో లోకేష్‌ చెప్పినట్లు విని తమ పదవులను కాపాడుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రుల్లో ఈ రకమైన ధోరణి కనిపిస్తోందనే టాక్‌ ఉంది. టీడీపీలో కీలక నేతగా లోకేష్‌ ఉండటం, ముఖ్యమంత్రి కుమారుడు కావడంతో తమకు నచ్చిన వారిని నియమించుకొని సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకనే ఆలోచనల్లో ఉన్నారు.
గతంలో ఇదే రకమైన దిశా నిర్థేశాలు
గతంలో కూడా ఇదే రకమైన ఇన్‌స్ట్రక్షన్స్‌ జారీ చేశారు. అయితే కొంత మంది దీనిని పాటించగా, మరి కొంత మంది పాటించ లేదు. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు వంటి పలువురు సీనియర్‌ మంత్రులు తమకు నచ్చిన వారిని ఓఎస్‌డీలుగా నియమించుకోవడంతో పాటు ఉతర ఉద్యోగులు, సిబ్బందిని కూడా తమకు నచ్చిన వారిని తమ పేషీల్లో ఏర్పాటు చేసుకున్నారనే టాక్‌ అప్పట్లో వచ్చింది. దీంతో లోకేష్‌ నాడు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అప్పట్లో చర్చ జరిగింది.
ఎమ్మెల్వోల నియామకాలు
మంత్రుల వద్ద పీఆర్వోల నియామకాలు కూడా లోకేష్‌ కనుసన్నుల్లోనే జరిగాయి. పీఆర్వోల పేరుతో కాకుండా మీడియా లైజనింగ్‌ ఆఫీసర్‌(ఎమ్మెల్వో) పేరుతో నియామకాలు చేపట్టారు. అయితే ఈ సారి ఎమ్మెల్వోల నియామకాల ఉంటాయా లేదా అనేది స్పష్టత రావలసి ఉంది.
Tags:    

Similar News