క్యాన్సర్, గుండె పోటుపై ఇంటింటా పరీక్షలు
క్యాన్సర్, గుండె పోటుపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. వ్యాధిని గుర్తించేందుకు సార్వత్రిక పరీక్షల కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనుంది.
క్యాన్సర్, గుండె పోటు వలన దేశంలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా మరణాలు రోజురోజుకూ పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో ప్రతి ఏడాదీ 73 వేలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా 40 వేలకు పైగా మృతి చెందుతున్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతుంటే 9 లక్షల మంది మృత్యు బారిన పడుతున్నారు. రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంత్సరంలో రూ.680 కోట్లకు పైగా ఖర్చు చేసింది.
సార్వత్రిక క్యాన్సర్ పరీక్షల కార్యక్రమం
ప్రబలుతున్న క్యాన్సర్ వ్యాధిని అరికట్టడానికి కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మహమ్మారిని అదుపు చేయడానికి ఉద్దేశించిన ‘సార్వత్రిక క్యాన్సర్ పరీక్షల కార్యక్రమాన్ని’ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు త్వరలో ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా క్యాన్సర్ మృతికి ప్రధాన కారకాలైన నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా చేపడతారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఈ పరీక్ష చేయించుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సిహెచ్వోలు), ఎఎన్ఎంలు ప్రతి ఇంటికీ వెళ్లి ఈ మూడు రకాల క్యాన్సర్ పరీక్షలు చేస్తారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ సహాయంతో క్యాన్సర్ పరీక్షల ఫలితాల్ని ప్రభుత్వ బోధానాసుపత్రులు, యన్టీఆర్ వైద్య సేవలో భాగస్వాములైన ఆసుపత్రులకు పంపి అక్కడ చికిత్స పొందే ఏర్పాటు కలగజేస్తారు. క్యాన్సర్ కు గురై చికిత్స కోసం వెళ్లే ప్రతి రోగి వెంట ఆశా కార్యకర్త ఉంటారు. మొదట్లోనే క్యాన్సర్ లక్షణాల్ని గుర్తించడం వల్ల సకాలంలో చికిత్సను అందించడంతో పాటు వ్యాధికి గురైన వారు అతి స్వల్ప ఖర్చుతో కోలుకునే వీలుంటుంది.
స్టెమి (STEMI) (ST-segment elevation myocardial infarction)
గుండె నొప్పి సంకేతం అందిన కీలకమైన మొదటి గంట సమయంలో తగు చర్యలు తీసుకుంటే గుండె పోటు మరణాల్ని నివారించవచ్చన్న శాస్త్ర సాంకేతిక అంశం ఆధారంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర వ్యాప్తంగా స్టెమి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గుండె పోటు వల్ల గుండె కండరాలకు జరిగే నష్టాన్ని తగ్గించి బాధితుల్ని రక్షించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.
238 స్పోక్స్ (healthcare communication platform) (కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు) 37 హబ్ ఆసుపత్రులు, (11 ప్రభుత్వ సర్వజనాసుపత్రులు, 26 యన్టీఆర్ వైద్య సేవా ప్రైవేట్ ఆసుపత్రులు) ద్వారా ఈ కార్యక్రమం అమలుకానుంది. ఈ కార్యక్రమం అమలుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. గుండె నొప్పి వచ్చిన వ్యక్తి ఆ సమాచారాన్ని స్పోక్ ఆసుపత్రికి తెలియజేస్తే అక్కడ ఉన్న వైద్యాధికారి వెంటనే ఇసిజి తీసి మొబైల్ యాప్ ద్వారా హబ్ ఆసుపత్రికి పరిస్థితిని తెలియజేస్తారు. హబ్ ఆసుపత్రిలో ఉండే హృద్రోగ నిపుణుడు నివేదికను పరిశీలించి, గుండెకు రక్త ప్రసరణ సరిగా జరిగేందుకు అవసరం మేరకు టెనెక్టిప్లేజ్ ఇంజక్షన్ చేయడంపై సలహా ఇస్తారు. ఈ ఇంజక్షన్ అనంతరం రోగి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన వెంటనే రోగిని తగు చికిత్సకోసం హబ్ ఆసుపత్రికి పంపడం జరుగుతుంది. ఎంతో కీలకమైన ఈ ఇంజక్షన్ ఖరీదు రూ.45,000. ఈ విధంగా గుండె నొప్పి సంకేతం అందిన వెంటనే బాధితుని గుండెకు రక్త సరఫరాలో అడ్డంకుల్ని తొలగించి చికిత్సకు వీలు కలిగించడం వల్ల ప్రాణ రక్షణ వీలవుతుంది.
ఈ రెండు ప్రధాన కార్యక్రమాల అమలుకు సంబంధించిన వివిధ అంశాల్ని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు సంబంధిత ఉన్నతాధికారులతో మంగళవారం విస్తృతంగా చర్చించారు.