టాటా సంస్థలపై నిరుద్యోగుల ఆశలు
ఏపీ ముఖ్యమంత్రి టాటా కంపెనీ వారితో జరిపిన చర్చలు నిరుద్యోగుల్లో ఆశలు చిగురించేలా చేశాయి. టీసీఎస్ ను విశాఖలో ఏర్పాటు చేసేందుకు సీఎంకు టాటా వారు హామీ ఇచ్చారు.
Byline : G.P Venkateswarlu
Update: 2024-11-12 10:19 GMT
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హామీ ఇచ్చారు. ఈ హామీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోల్లో ఎన్నో ఆశలు చిగురించేలా చేశాయి. ఏపీలో సుమారు 7.18 లక్షల మంది గ్రాడ్యుయేట్ నిరుద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వం వద్ద లెక్కలు ఉన్నాయి. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు నిరుద్యోగులను పరిశీలిస్తే సుమారు 12 లక్షల మంది ఉన్నట్లు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
స్కిల్‌ను గుర్తించేందుకు సర్వే
సాంకేతిక విద్యను అభ్యశించిన వారు ఏ రంగంలో రాణించగలరో తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక సర్వే చేపట్టింది. ముందుగా మంగళగిరి నియోజకవర్గంలో రెండు నెలల క్రితం సర్వే ప్రారంభించారు. ఈ సర్వే పూర్తి కాగానే అన్ని జిల్లాలోనూ సర్వేను పూర్తి చేస్తారు. ఏ రంగంలో ఎంత మందికి ఆసక్తి ఉందో గమనించిన తరువాత వారికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి ఉద్యోగం చూపించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సర్వే ప్రభుత్వం వారే నిర్వహిస్తున్నారు. అధికారం చేపట్టిన కొత్తల్లోనే ముఖ్యమంత్రి ఈ విషయంలో ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నారు.
పెట్టుబడుల కోసం మొదటి నుంచీ ప్రయత్నం
నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ఏపీలో పెట్టుబడులు పెట్టే సంస్థలు ఏవైతే బాగుంటాయో ఆలోచించి అటువంటి వారిని ఆహ్వానించే పనిలో ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం కూడా ఆ ప్రయత్నం చేసింది. అయితే సక్సెస్ కాలేక పోయింది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూడా అప్పుడు ప్రయత్నించి విఫలమయ్యారు. అంటే పదేళ్ల కాలంలో ఎంతో నిరుద్యోగం పెరిగింది. ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఎక్కువగా ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడి ఉంటున్నాయి. ఇంజనీరింగ్ వారికి ప్రభుత్వం సరైన ఉద్యోగావకాశాలు కల్పించలేకపోతున్నది. ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించి వారు అడిగిన మేరకు వారిని సంతృప్తి పరిచే విధంగా ప్రభుత్వం వారికి హామీ ఇవ్వలేకపోవడం, అవి మాటల వరకు పరిమితం కావడం తిరోగమనానికి కారణం. ప్రస్తుతం ఏపీలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం నిరుద్యోగాన్ని తగ్గించడంలో ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే.
ప్రభుత్వ ఉద్యోగాలు లేవు
పదేళ్లుగా విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు లేవనే చెప్పాలి. ఎమర్సెన్సీ సర్వీసుల్లో మాత్రం ఉద్యోగుల నియామకం పూర్తి చేస్తున్నారు. ప్రధానంగా వైద్య శాఖలో ఉద్యోగాల భర్తీజరిగింది. అధికారుల కోసం నిర్వహించే ఏపీపీఎస్‌సీ పరీక్షలు కూడా జరగలేదు. పేరుకు తప్ప ఏపీపీఎస్‌సీ ఎందుకూ పనికి రాకుండా పోతోందని, ప్రభుత్వం మారగానే నిబంధనల్లో మార్పులు వస్తున్నాయని, ఒకరు ఇంటర్వూలు వద్దంటే మరొకరు ఉండాల్సిందేననే నిబంధనలు ఏమిటనే ప్రశ్న నిరుద్యోగులు వేస్తున్నారు. గ్రూప్–1 కానీ, గ్రూప్–2 కానీ సకాలంలో ప్రతి సంవత్సరం పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభ దశలో రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారో ప్రకటించి ఉద్యోగ ఖాళీలు ఎన్ని ఉన్నాయో ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ నిరుద్యోగులు ఎంతమంది? ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయనే విషయం ఒక్కసారి కూడా వెల్లడించలేదు. నిరుద్యోగులు ఖచ్చితంగా ఇంత మంది ఉన్నారని చెప్పేందుకు గతంలో ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయం ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. ఎంప్లాయ్‌మెంట్ ద్వారా ఉద్యోగాలకు ఇంటర్వూలు రావడం ఆగిపోయి సుమారు 25 సంవత్సరాలైంది.
సాంకేతిక విద్యను పూర్తి చేసిన ఏపీ నిరుద్యోగులు ఎంతో మంది వేరే రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు చేస్తున్నారు. వేరే దేశాల్లోనూ చాలా మంది ఉన్నారు. ప్రధానంగా దేశంలోని ముంబై, పూనే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లోని కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఏపీలో ఎటువంటి అవకాశం వచ్చినా తిరిగి ఏపీకి వచ్చేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. ఎంతో మంది ఏపీ వారు పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణంగా ఉన్నప్పటికీ వారి సేవలు ఏపీకి అందకపోవడం కొంత బాధగానే ఉందని ప్రజలు అంటున్నారు.
ప్రైవేట్ కంపెనీలపై ఆశలు
ప్రైవేట్ కంపెనీలపై నిరుద్యోగుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని, పెట్టుబడులు పెట్టే వారికి స్వర్గదామం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానిస్తున్నారు. మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఇటీవల అమెరికాలో పర్యటించి అక్కడి పారిశ్రామిక వేత్తలను ఏపీలో పెట్టుబడుల కోసం ఆహ్వానించారు. కొన్ని కంపెనీలు ముందుకొచ్చినా ప్రత్యేకించి టాటా సంస్థలు ముందుకు రావడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొన్ని వందల సంఖ్యలో దేశ, విదేశాల్లో టాటా సంస్థలు ఉన్నాయి. టాటా వారివి ఒకే రకమైన సంస్థలు చాలా దేశాల్లో ఉన్నాయి. ప్రధానంగా టాటా మోటార్స్, టీసీఎస్, పవర్ ప్రాజెక్ట్స్, టాటా కెమికల్స్, కన్యూమర్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, మేనేజ్ మెంట్ ట్రైనింగ్ సెంటర్స్, ఏఐజీ అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూప్, జనరల్ ఇన్సూరెన్స్, కాఫీ కమ్యునికేషన్స్, ది ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (డిఎఇడబ్లు్యఓఓ), టాటా ఈఎల్‌ఎక్స్‌ఎస్‌ఐ లిమిటెడ్ (ప్రొవైడర్ ఆఫ్ డిజైన్ టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ), టాటా ఎస్‌ఐఏ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్, ఇండియన్ మల్టీనేషనల్ హోం అప్లయన్సెస్, ఇండియన్ హోటల్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ క్రాప్, టాటా టెక్నాలజీస్, టైటాన్ కంపెనీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ (రీసెర్చ్, పోస్టు గ్రాడ్యుయేషన్), టాటా ప్రాజెక్ట్స్ ఇలా ఎన్నో సంస్థలా టాటా గ్రూపులో ఉన్నాయి. ఈ ప్రధాన మైన సంస్థల్లో ఏవి ఏపీలో ఏర్పాటు చేసినా వేల మంది నిరుద్యోగులకు అవకాశాలు కల్పించిన వారవుతారు. ఇప్పటికే రెండు సార్లు టాటా గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రశేఖరన్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారు. టీసీఎస్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నామని, ఏపీలో 20 టాటా హోటల్స్ పెడతామని, రూ. 40వేల కోట్ల పెట్టుబడితో టాటా సోలార్, విండ్ ప్రవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని చంద్రశేఖరన్ హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి ట్విటర్ వేదికగా వెల్లడించారు. మంచి వాతావరణంలో మా ఇద్దరి భేటీ జరిగిందని సీఎం వెల్లడించారు.
స్వయం ఉపాధికి అవకాశాలు కలిల్పించాలి
నిరుద్యోగులకు స్వయం ఉపాధి పొందేందుకు అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అఖిలభారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిఎస్ లెనిన్ బాబు అన్నారు. ఆయన ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ పరిశ్రమలు ఏపీకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ సంస్థలు వస్తాయో, రావో తెలియని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయన్నారు. నిరుద్యోగ సమస్యను రూపు మాపేందుకు ప్రభుత్వం వద్ద ఒక ప్రణాళిక లేదన్నారు. ఏ కేటగిరీ నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారో ముందు ఒక స్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వాలని, ఆర్థికంగా వెనుకబడిన వారితో కలుపుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, అర్హులైన ఇతరులకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. స్వయం ఉపాధి వైపు నిరుద్యోగులను మళ్లించాలంటే వారికి కావాల్సిన పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం, బ్యాంకుల ద్వారా సబ్సిడీపై అందించాలన్నారు. యువజన, సాంస్కృతిక, పర్యాటక శాఖలకు ఈ ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ. 322 కోట్లు మాత్రమేనని, ఇవి ఏ మూలకు వస్తాయని ఆయన ప్రశ్నించారు.