వైసీపీపై టీడీపీ విమర్శనాస్త్రాలు.. జగనే టార్గెట్..!

వైసీపీ టార్గెట్‌గా టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ వల్ల రాష్ట్రానికి దమ్మిడీ ఆదాయం లేదని, వారి చేతకాని తనం వల్లే నేడు విజయవాడ భారీ వరదలను చవిచూసిందంటూ ఆరోపణలు చేస్తున్నారు.

Update: 2024-09-08 12:24 GMT

వైసీపీ టార్గెట్‌గా టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ వల్ల రాష్ట్రానికి దమ్మిడీ ఆదాయం లేదని, వారి చేతకాని తనం వల్లే నేడు విజయవాడ భారీ వరదలను చవిచూసిందంటూ ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు వరదల్లో చిక్కుకుని నానా అవస్థలు పడుతుంటే తనకేం పట్టనట్లు కూర్చున్న పార్టీ వైసీపీ అని, అంతా అయిపోయిన తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒక 20 నిమిషాలు తచ్చట్లాడి.. ప్రజలకు ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించడం లేదని విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేతలు, శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలకు కనీసం పులిహోర పొట్లాలు కూడా అందించిన వారు వచ్చి ఎనిమిది రోజుల నుంచి సహాయం అందిస్తున్న ప్రభుత్వంపై నిందలు మోపడం విడ్డూరంగా ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత చురకలంటించారు. అంతేకాకుండా మంత్రి నారా లోకేష్ కూడా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే జగన్ మాత్రం బెంగళూరు ప్యాలెస్‌లో రిలాక్స్ అవుతున్నారని, పైగా సిగ్గులేకుండా ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబును విమర్శిస్తున్నారంటూ మండిపడ్డారు నారా లోకేష్.

జగన్.. మీకు హుందాతనం ఉందా..!

ప్రతిపక్ష హోదా కోరుతున్న వైఎస్ జగన్‌కు ఏమాత్రమైన హుందాతనం ఉందా అని నారా లోకేష్ ప్రశ్నించారు. ‘‘బురద రాజకీయానికి వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. పాస్ పోర్ట్ సమస్య ఉండబట్టి ఆయన ఇంకా ఇక్కడ ఉన్నారు. అది లేకుంటే ఎప్పుడో లండన్‌కు ఎగిరిపోయి ఉండేవారు. అది కుదరకనే ప్రజలకు కనిపించకుండా బెంగలూరు ప్యాలెస్‌లో రిలాక్స్ అవుతున్నారు. అలాంటిది 74 ఏళ్ల వయసులో కూడా క్షణం తీరిక లేకుండా ప్రజల కోసం శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. వరద బాధితుల కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఎప్పటికప్పడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల కష్టాలను పరిష్కరించేలా చర్యలు తీసుకున్న చంద్రబాబు అనడానికి మనసు ఎలా వచ్చింది. విపత్తులు వచ్చి ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే సొంత డబ్బుతో కనీసం ఒక్క పులిహోర ప్యాకెట్ అందించిన చరిత్ర మీ పార్టీకి లేదు’’ అని అని విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా వైసీపీ వాళ్లు బటన్ నొక్కి విడుదల చేసే సెల్ఫ్ చెక్కుల కథ కూడా అందరికీ తెలుసంటూ చురకలంటించారు.

విపత్తుకు కారణం వైసీపీనే

‘‘ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు బుడమేరు ఆధునికీకరణకు చంద్రబాబు రూ.464కోట్లు కేటాయించారు. కానీ అధికారంలోకి వచ్చీ రాగానే వైసీపీ సర్కార్ ఆ పనులను అడ్డుకుని.. నేడు ఈ విపత్తుకు ప్రధాన కారణం అయ్యారు. బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం వైఎస్ జగన్. ఇది హ్యూమన్ మేడ్ డిజాస్టర్ కాదు.. జగన్ మేడ్ డిజాస్టర్. అధికారంలోకి వస్తూనే బుడమేరు ఆధునికీకరణ, మరమ్మతుల పనులను నిలిపివేశారు. దాదాపు రూ.500 కోట్ల విలువైన 600 ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారు. 2022లో బుడమేరుకు గండిపడినా వైసీపీ సర్కార్ పట్టించుకోలేదు. ఐదు ఏళ్లలో సరైన నిర్వహణ లేదు. విజయవాడ నగరంలో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులు ఆపేశారు. వైసీపీ పాలన వైఫల్యాలే నేడు ప్రజల పాలిట శాపాలుగా మారాయి. మేము అన్నింటిని అధిగమిస్తాం. చివరి వరద బాధితుడికి కూడా సాయం అందింస్తాం. అప్పటి వరకు విశ్రమించం’’ అని నారా లోకేష్ స్పష్టం చేశారు.

జగన్ బ్యాచ్ దానికే పనికొస్తుంది: అనిత

జగన్ బ్యాచ్‌పై హోం మంత్రి వంగలపూడి అని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో విష ప్రచారం చేయడానికి జగన్ బ్యాచ్ కేరాఫ్‌గా మారిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజలు వరదలతో అష్టకష్టాలు పడుతుంటే జగన్ మాత్రం తన పేటీఎం బ్యాచ్‌తో విషప్రచారం చేయిస్తున్నారు. సొంత డబ్బుతో ఒక్కరికి కూడా ఒక్ పులిహోర ప్యాకెట్ అందించలేదు కానీ బెంగళూరులో కూర్చుని పులిహోర కబుర్లు చెప్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లపై అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిపై దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేస్తాం. అదే విధంగా జగన్ పేటీఎం బ్యాచ్ సోసల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు‌గా గణేష్ మండపాల అనుమతులకు ఒక్క రూపాయి కూడా వసూలు చేయడం లేదు’’ అని స్పష్టం చేశారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సాయం చేయడానికి ముందకు రాని వైసీపీ నేతలంతా కూడా రాత్రింబవళ్లు కష్టపడి ప్రజలకు ఆదుకుంటున్న ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి మాత్రం ఇళ్ల నుంచే తెగ కష్టపడిపోయారంటూ విసుర్లు విసిరారు. ఎన్నికల తర్వాత అదృశ్యమైన వారు సైతం విమర్శలు చేసే అవకాశం అనడంతో వాలిపోయారంటూ ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News