వాలంటీర్ల రికార్డు లేకుండా జీతాలు ఎలా ఇచ్చారు?
ఐదు సంవత్సరాల కాలం ప్రభుత్వంలో గ్రామ, వార్డు వాలంటీర్లు పనిచేశారు. వారి పేరుతో రికార్డులు లేవంటున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మరి జీతాలు ఎలా చెల్లిచారు?
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ బలమైనది. ఈ వ్యవస్థ ప్రస్తుతం పనిచేయటం లేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 5 నెలల కాలం పూర్తయింది. తమకు జీతాలు ఇవ్వడం లేదు. అందుకని పనిచేయడం లేదని వాలంటీర్లు చెబుతున్నారు. ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించిన రికార్డులు ప్రభుత్వం వద్ద లేవని చెబుతోంది. ఈ తప్పు గత ప్రభుత్వం చేసిందా? ప్రస్తుత ప్రభుత్వం కావాలని ఇలా చెబుతోందా? అనేది ప్రస్తుతం వాలంటీర్లను వేధిస్తున్న ప్రశ్న. వాలంటర్ల సేవలను ప్రభుత్వం ప్రస్తుతం వినియోగించుకోక పోవడంతో గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి స్వయంగా వివరాలు ఆయా గ్రామాల వారు తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల సంఖ్యను కూడా ప్రభుత్వం తగ్గించాలనే ఆలోచనలో ఉంది. అయితే ఆ విషయమై ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.
భరోసా ఇవ్వని ప్రభుత్వం
26 జిల్లాల్లో మొత్తం వాలంటీర్లు 6,64,144 మంది ఉన్నారు. వీరిలో ప్రస్తుతం 1,55,588 మంది యాక్టివ్ గా ఉండగా 1,08,586 ఖాళీలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం చెప్పిన ప్రకారం వాలంటీర్లు సుమారు 85 వేల మంది రాజీనామాలు చేశారు. అప్పటికే కొన్ని ఖాళీలు ఉన్నాయి. కేవలం జిల్లా కేంద్రాల్లో 68,250 పోస్టులు ఉండగా ప్రస్తుతం 20,814 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మత్తంగా గ్రామాల్లో వాలంటర్లు 1,95,924 మంది ఉంటే వారిలో 1,08,152 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత వారి ఊసే ఎత్తలేదు. వరదల సందర్భంగా వాలంటీర్లు కొన్నిచోట్ల యాక్టివ్ గా పనిచేస్తే మరికొన్ని చోట్ల చేయలేదు. ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తే మాకు ఏదైనా భరోసా ఉంటుందని, లేదంటే ఎందుకు పనిచేయాలని వారు ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికలకు ముందు ఏమి చెప్పారు...
ఎన్నికలకు ముందు వాలంటీర్ల వ్యవస్థకు ఎటువంటి ఢోకాలేదని, వాలంటీర్ల జీతం ఐదు వేల నుంచి పది వేలు చేస్తామని చెప్పారు. అది నమ్మిన ఎంతోమంది చంద్రబుబు నాయుడుకు బ్రహ్మరథం పట్టారు. ఆ తరువాత కూటమి నేతలు గెలిచారు. మా గురించి పట్టించుకోవడం లేదని వాలంటీర్లు వాపోతున్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఏకంగా వాలంటీర్లు పనిచేసినట్లు ప్రభుత్వంలో రికార్డులు లేవంటున్నారు. ఇదేమిటని వారు తమ బాధను వ్యక్తం చేశారు. విజయవాడకు చెందిన ఒక మహిళా వాలంటీర్ మాట్లాడుతూ తాము వరదల సమయంలో ఎంతో కష్టంతో ప్రతి ఒక్కరి డేటా ప్రభుత్వానికి అందించాము. సచివాలయం వారు మా దగ్గర నుంచి డేటా తీసుకున్నారు. ఇంటింటి సర్వే చేసే సమయంలో సర్వే టీములకు తాము దగ్గరుండి ప్రతి ఇంటినీ చూపించామని చెప్పారు. ఆమె తన పేరు రాయవద్దన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా తమ కుటుంబం గడవాలంటే తాము పనిచేయాలి. గడచిన ఐదేళ్లు వాలంటీర్ పని చేసేందుకు అలవాటు పడ్డాం. ఇప్పుడు మా పద్దతి మార్చుకోవాలి. వేరే పనికోసం వెతుక్కోవాలి. ఇటువంటి పరిస్థితి ఏ ఒక్కరికీ రాకూడదన్నారు.
వీరికోసం ప్రత్యేక వెబ్సైట్
గ్రామ, వార్డు వాలంటీర్ల కోసం ప్రత్యేక వెబ్ సైట్ కూడా ఉంది. అందులో ఒక్కొక్కరి వివరాలు పూర్థి స్థాయిలో ఉన్నాయి. వారి ఆధార్ నెంబర్, సీఎఫ్ఎంఎస్ ఐడీ నెంబరు ఫీడ్ చేస్తే వారికి సబంధించిన వివరాలు వస్తున్నాయి. అలాంటప్పుడు ప్రభుత్వంలో వారి రికార్డు లేదంటే ఎలా? పైగా రాజీనామాలు చేసినప్పుడు వారి రాజీనామా లేఖలు తీసుకున్న ప్రభుత్వం ఆమోదించినట్లు ప్రకటించింది. ఒక పక్క జరగాల్సిన ప్రక్రియ అంతా జరుగుతూనే ఉంది. మరో పక్క వారి రికార్డులు ప్రభుత్వం వద్ద లేవంటున్నారు. ఇదేమి విచిత్రమని వారు ముక్కున వేలేసుకుంటున్నారు. పైగా వీరందరికీ ప్రతి ఏడాది ఉత్తమ వాలంటీర్ ను గుర్తించి అవార్డు కూడా మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చారు.