గోదావరోళ్ల తీయటి మాట 'పూతరేకులు'.. దానికా పేరు ఎలా వచ్చిందో తెలుసా?

తెలుగవాళ్లకు గోదావరి జిల్లాలు అందించిన మహత్తరమయిన స్వీటు పూతరేకులు. ఇంతకీ దాని కాపేరు ఎలా వచ్చిందో తెలుసా.

Update: 2024-01-09 10:47 GMT
(Wikimedia Commons)

సూర్యమోహన్ పరకాల

గడచిపోయిన ఆ రోజులన్నీ తీపి గురుతులుగా మిగిలి పోయాయి. ఆ మధుర స్మృతుల్ని నెమరు వేసుకుంటూ శేష జీవితం గడిపి వేయవచ్చు. ఇవి మధుర స్మృతులు కాబట్టి నేనొక మధురమయిన ఒక మిఠాయి గురించి చెప్పి తీరాలి. అదే పూతరేకులు. కోస్తాంధ్ర వాళ్లు కనిపెట్టి ఒక అద్భుతమయిన స్వీట్ ఇది. దీనికీ పేరు ఎందుకొచ్చిందో తెలుసా. అంతా పూతరేకులు అనడం, ఆవేశం గా దానికి గురించి తెగరాసేయడం చేసకతుంటారు. దానికా పేరు ఎందుకొచ్చిందో చెప్పరు. పూతరేకులు అంటే ఏదేదో చెప్పేస్తారు. గోదావరి జిల్లాల్లో ఇదిస్పెషల్. వ్యాపారం అయింది కాబట్టి ఆత్రేయపురానికి పూతకేకుల బ్రాండ్ నేమ్ వచ్చింది.పూర్వమయితే, ప్రతిఇల్లూ ఆత్రేయపురమే. అందులో మాయిల్లు మరీను.

పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో ఎంతో విలక్షణమైన, ఎన్నో ప్రత్యేకతలు వున్న గ్రామం కవిటం మా వూరు. అది మేము పుట్టి, ‘పెరిగిన వూరు. మా చిన్నతనాలన్నీ అక్కడే గడిచాయి.

ఇప్పుడు 50, 60 ఏళ్ళు గడిచిపోయినా ఆ నాటి జ్ఞాపకాలు ఈ నాటికీ మనసులో పదిలంగా వుండి పోయాయి. అవి మధుర స్మృతులు. అందుచేతనే , వయస్సు 70 దాటుతున్నా ఆ జ్ఞాపకాల్ని తలుచుకుంటే అవి ఇప్పటికీ కళ్ళముందు ప్రత్యక్షమవుతాయి.ఆ రోజులే వేరు. అలాంటివి మళ్ళీ రావు.

నా మనసులో ఈనాటికీ పదిలంగా వుండిపోయిన మా కవిటం అద్భుతమైన తీపి వంటకం గురించిన జ్ఞాపకాల్నిఈ రోజు మీతో పంచుకోవాలి. దాని పేరు “పూత రేకులు”.

ఇది ఈనాటికీ అందరికీ తెలిసిన స్వీట్ అయినప్పటికీ దీని తయారీ ఎంత జటిలమైందో, ఎంత సంక్లిష్ట మైనదో ప్రత్యక్షంగా చూస్తేగానీ అర్ధం కాదు.

మా ఇంట్లో మా పెద్దత్తయ్య దీని తయారీలో సిద్థహస్తురాలు. వీటిని తయారు చేస్తున్నప్పుడు మా సుశీలపిన్ని, బులిచిన్నపిన్నీ పెద్దత్తయ్యకు సహాయం చేసేవాళ్ళు.

ఆ రోజుల్లో ఇళ్ళల్లోనే అంతా పూతరేకుల్ని తయారు చేసుకునేవాళ్ళు, అయినా దీని తయారీకి ఎంతో నైపుణ్యం , ఒడుపూ, చాకచక్యం అవసరం.

ఈ పూతరేకుల తయారీకి కావల్సిన ముడి పదార్థం బియ్యం పిండి. ఎంతో నున్నగా వుండే కుండ. ముందుగా తడి బియ్యాన్ని చాలా మెత్తగా దంచి తగు మోతాదులో నీరు కలిపి పలుచగా వుండేలా చేసి సిద్థంగా వుంచేవారు. ఓ పది పన్నెండు అంగుళాల వెడల్పు , ఒకటిన్నర అడుగుల పొడవు వుండే మంచి మెత్తని సైన్ గుడ్డని తడిపి రెడీగా వుంచు

కునేవారు.

ముందుగా కుండను మండుతున్న పొయ్యి మీద బోర్లా వుంచుతారు. కుండ బాగా వేడి ఎక్కాకా , ఆ వేడి సరిపోతుందని తెలుసుకుని (ఆ విషయం బాగా అనుభవం వున్నవారికే తెలుస్తుంది) బియ్యం పిండి నీళ్ళను గరిటితో బాగా కలియబెట్టి, ముందుగా సిద్థంగా వుంచిన గుడ్డని ఆ బియ్యం పిండి నీళ్ళలో ముంచి కుండమీద ఆ పక్కనుంచి ఈ పక్కకు వేగంగా పూసి తీసేస్తారు.అంతే, చాలా అతి పలుచని ఉల్లి పొర లాంటి కాగితంలా ఒక రేకు తయారవుతుంది. దానిని, పక్కనే వున్నవారు కొబ్బరి ఈనుపుల్లతో పక్కకు తీస్తారు. వెంటనే తీయకపోతే అది గాలికి ఎగిరి పోవచ్చు. ఈ ప్రక్రియ మెరుపు వేగంతో జరిగి పోవాలి.

అలా జరిగితే నిముషానికి 20, 25 రేకులు తయారవుతాయి .

స్వీట్ తయారీకి బెల్లం పొడి లేదా పంచదార పొడి యాలకుల పొడి కలిపి వుంచుతారు. నెయ్యిని గోరు వెచ్చగా వేడి చేసి వుంచుతారు. అరటి ఆకు వెనక కాడని కుంచెలా తయారు చేసి దానిని నెయ్యిలో ముంచి వుంచుతారు.

జీడి పప్పులు, బాదం పప్పులు దోరగా వేయించి పొడిలా వుంచుకుంటారు. ఈలోగా శుభ్రమైన తువ్వాల్ని తడిపి, బాగా నీరు పోయేలా పిండేసి కొంచం తడితడిగా వుంచాలి. అలా కాస్త తడిగా వుంటేనే పూతరేకులు చితికిపోవు.ఆ తడిగుడ్డ మీద పూతరేకుని వేయగానే అది చదునుగా అవుతుంది. అలా రెండుమూడు రేకులు ఒకదానిమీద ఒకటి వేసిన తర్వాత కుంచెతో వాటిమీద నెయ్యి రాసి సిద్థంగా వుంచుకున్న బెల్లం పొడి , మిగతా పొడులు సమానంగా జల్లుతారు.

పూతరేకుల్ని పొందికగా మడత పెట్టడానికి ఎంతో నైపుణ్యం అవసరం. అదొక సున్నితమైన కళ.పూతరేకుల పొడవాటి భాగాల్ని రెండువైపులా మడత పెడతారు.ఆ తర్వాత వెడల్పాటి భాగాల్ని రెండు వైపుల నుంచి అచ్చు చీర అంచులు లోపలికి వుండేలా మడత పెడతారు.

ఈ పూతరేకుల ప్రతి పొరలో ఘుమఘుమలూ , మధురిమలూ దాగివుంటాయి. !పూతరేకుల్ని వర్ణిస్తోంటే నా నోరు వూరిపోతోంది.

ఇది చదువుతోంటే మీకూ అలాగే అనిపిస్తే యమర్జంటుగా వీటిని కొనుక్కుని తినేయండి.

అసలు విషయం చెప్పలేదు కదూ.

బియ్యం పిండి నీళ్ళను కుండ మీద పూస్తారు కాబట్టే వీటికి “పూత రేకులు” అని పేరు వచ్చింది. ఈ రేకులతో స్వీట్ తయారు చేయడం ఏమంత సులభం కాదు.ఏమాత్రం జాగ్రత్తగా లేకపోయినా ఇవి పొడుంపొడుంగా అయిపోతాయి.

Tags:    

Similar News