విశాఖ బీచ్ లోకి దూకేస్తున్న లారీలు, బస్సులు!
2017లో ప్రముఖ కవి దూసి ధర్మారావును మింగేసిన స్కూలు బస్సు. తాజాగా దూసుకెళ్లిన లారీ. ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలంటున్న పర్యాటకులు, నగర వాసులు.;
విశాఖ సాగరతీరాన్ని చూసేసరికి లారీలకు, బసు్సలకు పూనకం వచ్చేస్తున్నట్టుంది. సముద్ర కెరటాలను చూస్తూ అందులోకి దూకేస్తున్నాయి. ఎగసి పడే అలలను ఆస్వాదిసూ్త హాయిగా సేదతీరదామనుకున్న వారిపైకి దూసుకెళ్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.
వైజాగ్ బీచ్ అంటే సహజ సౌందర్యానికి ప్రతిరూపం. అక్కడ కాసేపు గడిపితే ప్రపంచాన్నే మరిచిపోతామనే భావన కలుగుతుంది. కడలి తరంగాల సయ్యాటలను ఎంతో సేపు ఆస్వాదించినా తనివి తీరదు. అందుకే జనం రేయి, పగలు అనే తేడా లేకుండా సాగర తీరంలో గడపడానికి తహతహలాడుతుంటారు. అలాంటి బీచ్‌లో కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రమాదాలు జనాన్ని, పర్యాటకులను భయకంపితులను చేస్తున్నాయి. ఎప్పుడు ఏ రూపంలో ముప్పు ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా నగరంలోని పందిమెట్ట జంక్షన్ నుంచి జీవీఎంసీ చిల్డ్రన్ పార్కుకు నోవోటెల్ హోటల్ మీదుగా బీచ్‌కు వెళ్లే రోడ్డు ప్రమాదాలకు అడ్డాగా మారిపోయింది. ఇప్పటికే 2017 ఏప్రిల్ 30న శ్రీప్రకాష్ విద్యా నికేతన్ కు చెందిన స్కూలు బస్సు డౌన్‌లో అదుపు తప్పి బీచ్ రోడ్డును ఢీకొట్టి పార్కులోకి దూసుకుపోయింది.
ఆ దుర్ఘటనలో పోలీసు అదనపు సూపరింటెండెంట్ దూసి కిషోర్‌కుమార్ తండ్రి ధర్మారావు , కుమారుడు దేవగురు దుర్మరణం పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దూసి ధర్మారావు ప్రముఖ కవి, రచయిత, సాహితీవేత్త కూడా. ఆయన తన కుటుంబ సభ్యులతో బీచ్‌లో ఆహ్లాదం కోసం వచ్చారు. ఆ సమయంలో దూసుకొచ్చిన స్కూలు బస్సు వీరిద్దరినీ మింగేసింది. ధర్మారావు కుమారుడు ఏఎస్పీ కిషోర్ కుమార్, ఆయన కుమార్తె కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.
మంగళవారం నోవోటెల్ జంక్షన్‌లో బీచ్ పార్కులోకి చొచ్చుకెళ్లిన ఇసుక లారీ
అలాగే 2019న ఫిబ్రవరి 7న తెల్లవారుజామున నోవోటెల్ డౌన్‌లో ఒక ఇసుక లారీ పిల్లల పార్కులో సందర్శకులు కూర్చునే గోడను ఢీకొట్టి సముద్ర తీరంలోకి చొచ్చుకు పోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ మరుసటి ఏడాది అంటే.. 2020 ఫిబ్రవరి 11న అదే నోవోటెల్ డౌన్ జంక్షన్‌లో బోర్ వెల్ లారీ బ్రేకులు ఫెయిలై డివైడర్‌ను ఢీకొడుతూ బీచ్‌లోకి వెళ్లిపోయింది. ఆ ఘటనలో కొంతమంది సందర్శకులు గాయపడ్డారు.
2021 జులై 8న ఇసుక లారీ అదే ప్రాంతంలో అదుపు తప్పి బీచ్‌లోకి దూసుకుపోయింది. అప్పట్లోనూ ముగ్గురు గాయాలపాలయ్యారు. తాజాగా ఇప్పుడు మంగళవారం ఉదయం నోవోటెల్ డౌన్‌లోనే ఇసుక లోడుతో వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిలై డివైడర్‌తో పాటు బీచ్ రోడ్డులో ఉన్న గోడను ఢీకొట్టుకుంటూ చిల్డ్రన్ పార్కులోకి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. అద్రుష్టవశాత్తూ ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదాలన్నీ ఒకే ప్రాంతంలో తరచూ జరుగుతుండడంతో బీచ్‌కు వచ్చే సందర్శకులతో పాటు విశాఖ నగర వాసుల్లోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రమాదాలెందుకు జరుగుతున్నాయి?
విశాఖ బీచ్‌లోని నోవోటెల్ రోడ్డులోనే ఎక్కువగా ఈ బస్సు, లారీల ప్రమాదాలు జరుగుతున్నాయి. పందిమెట్ట జంక్షన్ నుంచి నోవోటెల్ మీదుగా బీచ్‌కు వెళ్లే రోడ్డు చాలా పల్లంగా ఉంటుంది. పందిమెట్ట జంక్షన్ ఎంతో ఎత్తులో ఉంటుంది. అందువల్ల ఏ వాహనమైనా అతి జాగ్రత్తగా వెళ్లాల్సిందే. లేదంటే ఆ డౌన్‌లో వాహనాలను అదుపు చేయడం కష్టతరమవుతుంది. లోడుతో వెళ్లే లారీలు బరువు వల్ల అత్యంత అప్రమత్తంగా, నెమ్మదిగా నడపాల్సి ఉంటుంది. డ్రైవరు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, నిర్లక్ష్యంతో నడిపినా ఆ వాహనం పట్టు తప్పి నేరుగా బీచ్ రోడ్డును దాటుకుని తీరంలో వెళ్లిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో పట్టు తప్పుతుందని భావించిన డ్రైవర్లు మరో మార్గం లేక పక్కనే ఉన్న డివైడర్లపైకి ఎక్కించేస్తుంటారు. అయినప్పటికీ డౌన్ కావడంతో ఆగకుండా బీచ్ రోడ్డును ఢీకొడ్తున్నాయి.
2020లో అదుపు తప్పిన బోర్ వెల్ లారీ
స్పీడ్ బ్రేకర్లు ఉన్నా..
ఈ ప్రమాదాల నేపథ్యంలో పోలీసులు ఈ రోడ్డులో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ స్పీడ్ బ్రేకర్లు ఆటోలు, బైక్‌లు, కారు్ల వేగాన్ని మాత్రమే ఒకింత నియంత్రించగలుగుతున్నాయి. కానీ లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలను అదుపు చేయలేకపోతున్నాయి. దీంతో తరచూ ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నోవోటెల్ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు నిత్యక్రుత్యంగా మారడం, కొందరు చనిపోతుండడం, మరికొందరు గాయాల పాలవడం వంటి సంఘటనల నేపథ్యంలో ఆ రోడ్డులో లారీలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించ కూడదన్న డిమాండ్ నగర వాసులతో పాటు పర్యాటకుల నుంచి వినిపిస్తోంది.
నేను హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్‌తో కలిసి వైజాగ్ బీచ్ చూద్దామని వచ్చాం. ఈ రోజు ఉదయం నోవోటెల్ నుంచి వెళ్తుంటే బీచ్ రోడ్డు పార్కులోకి లారీ దూసుకు వచ్చిన ఘటన చూస్తే భయమేసింది. ఆ సమయంలో అక్కడ పర్యాటకులుంటే ఎంతమంది చనిపోయే వారో.. ఊహించుకుంటేనే దడ పుడుతోంది.. అని అరవింద్ అనే ఐటీ ఉద్యోగి ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి*తో చెప్పారు. *విశాఖ బీచ్‌ను చూడటానికి రోజూ ఎక్కడెక్కడ నుంచో వేలాది మంది వస్తుంటారు.
అన్నీ మరచి పోయి ఈ బీచ్‌లో సేదతీరతారు. అనుకోకుండా ఈ లారీలు, బస్సులు దూసుకు వచ్చేసి ప్రాణాలు తీసేస్తున్నాయని తెలిస్తే వైజాగ్ పేరు ప్రతిష్టలు ఏమవుతాయి? ఇప్పటికైనా ఇకపై ఇలాంటి ప్రమాదాలు రిపీట్ కాకుండా అధికారులు, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి అని విశాఖ సీతమ్మధారకు చెందిన కుప్పిలి కుమార్, రాజేశ్వరి పట్నాయక్‌లు కోరారు.