ముక్కి పోయిన బియ్యం ఇచ్చి తినమంటే ఎలా?
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పేదలకు ఇస్తున్న బియ్యం ముక్కిపోయినవి. ముక్క వాసనతో తినేందుకు పనికి రావడం లేదు. పాలకులు ఈ విషయంపై దృష్టి పెట్టలేదు.
ముక్కిపోయాయి, సన్నని తెల్ల పురుగులు, చెక్క పురుగులు, రెక్కల పురుగులు ఉంటున్నాయి. వాసన చూస్తే ఈ బియ్యం ఎలా తినాలి? అనిపిస్తుంది. హాస్టళ్లు, కాలేజీల్లో చదువుకునే విద్యార్థులకు పెట్టె అన్నంలో మజ్జిగ వేస్తే తెల్ల పురుగులు తేలాడతాయి. బియ్యాన్ని ఎంత బాగా చెరిగినా తెల్ల పురుగులు బియ్యం నుంచి వేరు కావు. చెక్క పురుగులు మాత్రం వేరవుతాయి. ప్రభుత్వం ఇచ్చిన బియ్యం తినాలంటే చాలా కష్టంగా ఉంటోంది. బియ్యం ఏళ్ల తరబడి గోడౌన్స్ లో ఉంటాయి. కాబట్టి ముక్కిపోతున్నాయి. ముక్కిపోకుండా ప్రభుత్వం వాడే మందుల వల్ల బియ్యం సుద్దగా మారుతున్నాయి. రుచి ఉండవు. సప్పగా ఉంటున్నాయి. అందుకే తినలేకపోతున్నామని వినియోగ దారులు చెబుతున్నారు. కేవలం 25 శాతం మంది మాత్రమే ప్రభుత్వం ఇస్తున్న చౌక బియ్యాన్ని వాడుతున్నారు. మిగిలిన వారు అమ్ముకుంటున్నారు. డీలర్లు రూ. 5 నుంచి 7ల వరకు రేషన్ కార్డు దారుల నుంచి కొనుగోలు చేసి బయట పది నుంచి 14 రూపాయల వరకు అమ్ముతున్నారు.
రాష్ట్రంలో 1,48,43,671 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో 4,81,370 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం పేదల కోసం నెలకు 20,87,12,728 కేజీల రేషన్ బియ్యం పంపిణీ చేస్తోంది. ఈలెక్కన చూస్తే రాష్ట్రంలో పేదరికం లేని సమాజం అవతరిస్తుంది. ఎందుకంటే ప్రతి సభ్యునికి 5కేజీల వంతున ప్రభుత్వం నెలకు బియ్యం ఇస్తుంది. ఐదు కేజీల బియ్యం కనీసం 12 రోజులు ఒక్క మనిషి ఆహారంగా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఐదుగ్గురు ఉన్న కుటుంబానికి 25 కేజీల బియ్యం ఇస్తే కనీసం 15 రోజులు హ్యాపీగా భోజనం చేసేందుకు వీలు కలుగుతుంది. ఇటువంటి పరిస్థితిని వదులుకుని రేషన్ బియ్యం కొనే వారు ఎందుకు అమ్ముకుంటున్నారనేది ఒక్కరోజైనా ఆలోచించారా?
చౌకబియ్యం కొనుగోలు చేస్తున్న వారు ఒకరని ఏమీ లేదు. కిరాణా షాపుల వారి నుంచి మిల్లర్ల వరకు అందరూ కొనుగోలు చేస్తున్నారు. ఒక నగరం ఉందంటే అందులో కనీసం 20 మంది రేషన్ బియ్యం కొనుగోలు చేసి అమ్మే మాఫియా తయారైంది. ప్రస్తుతం మనం తింటున్న దోశల్లో వేసే బియ్యం రేషన్ బియ్యం. దోశలకు ఈ బియ్యం బాగా పనికొస్తున్నాయి. బాగా నానబెట్టి మినపప్పులో కలిపి రుబ్బడం వల్ల బియ్యం వాసన తగ్గిపోతుంది. రాత్రంతా పిండిని నానబెడతారు. అందువల్ల ముక్కిపోయిన బియ్యం వాసన ప్రత్యేకించి ఉండదు. కిరాణా దుకాణాల్లో దోశ పిండి బియ్యం ఇవ్వాలని హోటళ్ల వారు అడిగితే ఇచ్చేస్తారు. కొన్ని పెద్ద హోటల్స్ వారు డీలర్ల నుంచి నేరుగా బస్తాలు కొనుగోలు చేస్తారు. అందువల్ల రేషన్ బియ్యం కొనుగోలు చేసే వ్యాపారులు లారీల్లో బియ్యాన్ని నేరుగా మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ పాలిష్ పట్టి పోర్టులకు చేరుకుంటున్నాయి. ఈ బియ్యానికి ఆఫ్రికన్ కంట్రీస్ లో చాలా గిరాకీ ఉంది. అక్కడ వారికి బియ్యం తక్కువ ధరకు దొరికే అవకాశం లేదు. ఈ బియ్యాన్ని అందుకే దొంగతనంగా రవాణా చేస్తున్నారు. కొన్నింటికి దొంగ బిల్లులు సృష్టించి అమ్ముతున్నారు.
చెక్ పోస్టుల్లో ఏమి చేస్తున్నారు. కాకినాడ పోర్టులోకి ఎంట్రెన్స్ నుంచి పూర్తిగా రేపు వరకు వెళ్లాలంటే ఐదు చెక్పోస్టులు దాటాలి. అయినా దాటి వెళుతున్నాయి. ఈ చెక్ పోస్టుల్లో ఉన్న వారిలో రాష్ట్ర పోలీసులు కూడా ఉన్నారు. వీరు ఏమి చేస్తున్నారు. ఎందుకు దొంగరవాణాపై కన్నెర్ర చేయడం లేదు. ఎవరికి వారు జేబులు నింపుకుంటున్నారు కాబట్టి ఎవ్వరూ మాట్లాడటం లేదు. అవినీతిని అంత మొందించాలంటే ముందుగా పొలిటికల్ కరప్షన్ ఆగిపోవాలి. అప్పుడే ఏ అధికారైనా భయంతో పనిచేస్తాడు. అలా కాకుండా నావాటా ఏదని ప్రశ్నిస్తే అన్ని అడ్డ దారులూ తెరుచుకుంటాయి. దానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు. అందరూ చేతులు ఎత్తేయాల్సిందే. ఎవరైనా నిజాయితీ పరుడైన అధికారి ఉంటే చచ్చిపోవాల్సిందే.
పై విషయాలు పక్కన బెడితే ముక్క బియ్యం మాటేమిటి? బియ్యాన్ని ఎప్పటికప్పుడు తెప్పిస్తూ సరఫరా చేయలేరా? సంవత్సరాల తరబడి గోడౌన్స్ లో పెట్టుకుని పనికి రాకుండా పోయాయని భావించినప్పుడు సముద్రంలో కలిపేస్తున్నారు. సరఫరా చేసేందుకు మిల్లర్లు రెడీగా ఉన్నారు. అలాంటప్పుడు కనీసం రెండేళ్లకోసారైనా కొత్తగా వచ్చే బియ్యాన్ని పేదలకు అందేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. లేదంటే ఈ దందా కొనసాగుతూనే ఉంటుంది. దీనిని ఆపేందుకు ఎవరు ప్రయత్నించినా ఫెయిల్ కాక తప్పదు. దేశం దాటి పోకుండా కట్టడి చేయొచ్చేమో కాని దేశంలోనే దొంగలు కొనుగోలు చేసి దొంగ వ్యాపారుల ద్వారా దేశంలోనే వాడుకుంటే దానిని ఎలా అరికట్టాలో కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఎన్నో మిల్లులకు లైసెన్స్ లు రెన్యువల్ అవుతున్నాయి. కానీ అక్కడ మిల్లులు మూతపడి ఉంటున్నాయి. ఎందుకు మూతపడిన రైస్ మిల్లుల లైసెన్స్ లు రెన్యువల్ చేయించుకుంటున్నారో ఒక్కసారైనా ఆలోచించారా?