కోటప్పకొండలో తప్పిన భారీ ప్రమాదం

మహాశివరాత్రి సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు.;

Update: 2025-02-26 07:32 GMT

మహాశివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ పల్నాడు జిల్లా కోడప్పకొండ మీద అపశ్రుతి చోటు చేసుకుంది. కోటప్పకొండ మీద కొలువైన త్రికోటేశ్వర స్వామి గుడిలో బుధవారం మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులతో కిటకిటలాడుతోంది. బుధవారం తెల్లవారుజాము నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అయితే వేలాది మంది భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు నిఘా పెట్టారు. అందులో భాగంగా డ్రోన్‌తో భద్రతా పరమైన పర్యవేక్షణ చేపట్టాలని భావించారు.

దీని కోసం డ్రోన్‌ను ఉపయోగించారు. దీనిని గాలిలో ఎగుర వేశారు. ఇది గాలిలో ఎగురుతూ కోటప్పకొండ పరిసర ప్రాంతాలను షూట్‌ చేస్తున్న సమయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆలయ క్యాంటీన్‌ సమీపంలోని కరెంట్‌ తీగలపై పడి ఇరుక్కొని పోయింది. దీంతో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ట్రాన్స్‌ ఫార్మర్‌ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో అటు అధికారులు, ఇటు పోలీసులు ఒక్క సారిగా షాక్‌కు గురయ్యారు. భక్తులు ఒక్క సారిగా పరుగులు తీశారు. వెంటనే తేరుకొని అలెర్ట్‌ అయ్యారు. అప్రమత్తమైన అధికారులు కరెంట్‌ సరఫరాను నిలిపివేశారు. అంతేకాకుండా క్యాంటీన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినటై్టంది. దీనిని గమనించిన భక్తులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. పరుగులు పెట్టారు.

ఒక పక్క క్యాంటీన్‌కు పెద్ద ఎత్తున భక్తులు క్యాంటీన్‌కు వస్తుండటం, మరో పక్క అదే సమయంలో డ్రోన్‌ కరెంట్‌ తీగలపైపడి ఇరుక్కొని పోవడం, అంతే స్పీడ్‌గా అధికారులు అప్రమత్తమైన అధికారులు విత్యుత్‌ సరఫరాను నిలిపివేయడంతో భక్తులు ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా బయటపడ్డారు. తర్వాత కరెంటు తీగలపై పడి ఇరుక్కొని పోయిన డ్రోన్‌ను కిందికి దింపారు. ఈ నేపథ్యంలో విత్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తర్వాత కరెంట్‌ సరఫరాను పునరుద్దరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో కోటప్ప కొండ కూడా ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం. శివరాత్రి జాగారాలకు పెట్టింది పేరు. ఇక్కడ త్రికోటి స్వామి రూపంలో శివుడు కొలువై ఉన్నాడు. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామున రెండు గంటలకు బిందెతీర్థంతో స్వామి వారికి అభిషేకం చేశారు. ఎమ్మెల్యే అరవిందబాబు, ఆలయ ఈవో చంద్రశేఖర్‌ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా భద్రత చర్యలు చేపట్టారు. దాదాపు మూడు వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.
Tags:    

Similar News