హైదరాబాదులోని 'ఆనంద నిలయం' శ్రీవారి అంకితం..
ఇల్లు, నగదు టీటీడీకి వీలునామా రాసిన మాజీ ఐఆర్ఎస్ అధికారి.;
తిరుమల శ్రీవారు ఆనందనిలయంగా కింద కొలువై ఉంటారు. తన ఇంటికి కూడా రిటైర్డ్ ఐఆర్ ఎస్ అధికారి హైదరాబాద్ వనస్థలిపురంలో "ఆనంద నిలయం "గా పేరు పెట్టుకున్నారు. మూడు కోట్ల రూపాయల విలువైన ఆ ఇంటితో పాటు, కూడబెట్టుకున్న రూ. 66 లక్షలు కూడా టీటీడీకి వీలునామా రాశారు.
హైదరాబాద్ లో ఇటీవల ఆయన మరణించారు. దీంతో ఆయన చివరి కోరిక, వీలునామా ప్రకారం ట్రస్టు సభ్యులు ఆ పత్రాలు టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరికి తిరుమలలో గురువారం అందజేశారు.
టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరికి వీలునామా పత్రాలు అందిస్తున్న భాస్కరరావ్ ట్రస్టు సభ్యులు
టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరికి వీలునామా పత్రాలు అందిస్తున్న భాస్కరరావ్ ట్రస్టు సభ్యులు
హైదరాబాద్ నగరం వనస్థలి పురానికి చెందిన వైవిఎస్ఎస్. భాస్కరరావు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (Indian Revenue Service IRS ) పదవీ విరమణ చేశారు. ఆయన జీవించి ఉండగానే వనస్థలిపురంలోని ఇల్లు బ్యాంకు ఖాతాలోని డబ్బు తిరుమల శ్రీవారి పేరిట వీలునామా రాశారు.
వనస్థలిపురంలోని "ఆనంద నిలయం" పేరిట 3,500 చదరపు అడుగుల్లో భవనం నిర్మించుకున్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఈ ఇంటిని వినియోగించాలని కూడా భాస్కరరావు వీలునామా రాశారు.
మాజీ ఐఆర్ఎస్ అధికారి భాస్కరరావు ఇటీవల మరణించారు. దీంతో ఆయన కోరిక మేరకు ట్రస్టు సభ్యులు ఎం.దేవరాజ్ రెడ్డి, వి.సత్యనారాయణ, బి.లోకనాథ్ వీలునామాతో పాటు, ఆస్తి పత్రాలు కూడా టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి తిరుమలలో అప్పగించారు. వీలునామాలో ఏమి రాశారంటే.
"మాజీ ఐఆర్ఎస్ అధికారి భాస్కరరావు జీవించి ఉండగానే ఆస్తులను టీటీడీ పేరిట రాశారు. అందులో
తను బ్యాంకులో దాచుకున్న సొమ్మును టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.36 లక్షలు, శ్రీవేంకటేశ్వర సర్వ శ్రేయాస్ ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీవాణి ట్రస్టుకు రూ.6 లక్షలు విరాళంగా అందివ్వండి" వీలునామాలో రాశారని ట్రస్టు సభ్యులు తెలిపారు.
తన జీవితాంతం శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో అంకితమై ఉండాలని భాస్కరరావు ఆకాంక్షించారని ట్రస్టు సభ్యులు తెలిపారు. ఆయన అంతిమ కోరిక మేరకు వీలునామా ప్రకారం టీటీడీకి చెందాల్సిన ఆస్తి పత్రాలు, చెక్కులను గురువారం ఉదయం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సీ.హెచ్. వెంకయ్య చౌదరి అందజేశారు.వారిని అదనపు ఈవో సత్కరించారు. మంచి కార్యానికి కృషి చేసినందుకు అభినందనలు తెలియజేశారు.