‘సమయం వృథా చేయడం ఇష్టం లేకే’.. పింఛన్ పంపిణీలో డిప్యూటీ సీఎం

పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందుకే ఇప్పటి వరకు పిఠాపురం రాలేదన్నారు.

Update: 2024-07-01 10:45 GMT

ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆయన పిఠాపురంలో అడుగు పెట్టారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా పింఛన్‌లు అందించారు. ఎన్నికల సమయంలో చెప్పిన విధంగానే వృద్ధులకు అదనంగా ఇవ్వాల్సిన బకాయిలతో కలిపి రూ.7 వేలు, వికలాంగులకు రూ.6వేలు అందించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు నాలుగు శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజవర్వేషన్ కల్పించాలని డిప్యూటీ సీఎంకు పలువురు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగుల పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.

‘అందుకు జీతం కూడా వదిలేశా’

గెలిచిన తర్వాత నియోజకవర్గానికి రావడం ఇదే తొలిసారి అని పవన్ కల్యాణ్ చెప్పారు. విజయోత్సవ ర్యాలీలు, సభలు అంటూ ఉన్న సమయాన్ని వృథా చేయడం ఇష్టం లేక వెంటనే పనిలోకి దిగేశానని, అందుకే రాలేక పోయాయని ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకున్నారు. ప్రస్తుతం తనకు కేటాయించిన మంత్రిత్వశాఖలపై పూర్తి అవగాహన సంపాదించుకుని, ప్రజలకు ఉపయోగపడేలా సేవా చేయాలన్న ఆలోచనలో ఉన్నానని చెప్పుకొచ్చారు. ‘‘వైసీపీ తరహాలో కాకుండా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. వైసీపీ పాలనలో ప్యాలెస్‌ల నిర్మాణానికే ప్రాధాన్యత ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా జీతం తీసుకోవాలని అనుకున్నాను. కానీ ఈ శాఖలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి వల్లు నిధులు నిల్‌గా ఉన్నాయి. అందుకే నా జీతం కూడా వదిలేశాను’’ అని వివరించారు.

రీ సర్వే చేపడతాం

‘‘లబ్దిదారులకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి రీ సర్వే చేపడతాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రతి పథకం అందేలా చర్యలు చేపడతాం. మెరుగైన ప్రజా సేవ చేసి వారి మన్ననలు పొందిన తర్వాతే విజయోత్సవ వేడుకలు జరుపుకుంటా. పిఠాపురం నియోజకవర్గంలోని గ్రామాలను మోడల్ విలేజ్‌లుగా తీర్చిదిద్దుతా. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న పాలనను సీఎం చంద్రబాబుతో కలిసి గాడిలో పెడతా. ఏ పని అయితే చిటికెలో జరిగేలా ప్రభుత్వ కార్యాలను మారుస్తాం. ఆ దిశగా కృషి చేస్తా. వైసీపీ హయాంలో రూ.3వేల పింఛన్ ఇచ్చి అందులో రూ.3 వందలు కమీషన్ తీసుకునేవారు. ఇలా జరగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’ అని చెప్పారు.

‘ఒక్క పింఛన్ కూడా తీయం’

ఈ క్రమంలోనే పింఛన్ పంపిణీపై రాష్ట్ర వ్యవసాయక మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే సగానికి పైగా పింఛన్లు తొలగిస్తారని గతంలో కొందరు ప్రచారం చేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వం ఒక్క పింఛన్ కూడా తొలగించదని హామీ ఇచ్చారు. ఉన్న ప్రతి పింఛన్‌దారునికి నెల ప్రారంభమైన తొలి రెండు రోజుల్లోనే పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు అచ్చెన్నాయుడు. పింఛన్ల కోసమే తమ ప్రభుత్వం రూ.36 వేల కోట్లు ఖర్చు చేస్తుందని వెల్లడించారు. చెప్పినట్లు లబ్ధిదారులకు రూ.7వేల అందించగలగడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ప్రజల శ్రేయస్సే కావాలి

కూటమి ప్రభుత్వానికి ప్రజల శ్రేయస్సు తప్ప మరేమీ అక్కర్లేదని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ‘‘2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. అధికారం చేపట్టిన వెంటనే టీడీపీ వారికి పింఛన్లను తొలగించింది. అలానే మేము కూడా చేస్తామని ఎన్నికల ముందు తెగ ప్రచారం చేసింది. కానీ మా ప్రభుత్వం ప్రతీకార ప్రభుత్వం కాదు. ప్రజల శ్రేయస్సు కోరే ప్రభుత్వం. ఏ పార్టీ వారైనా ప్రతి ఒక్కరూ బాగుండాలని భావించే ప్రభుత్వం. మరోవైపు వాలంటీర్లు లేకుండా పింఛన్ అందించడం సాధ్యం కాదన్నారు. ఆ అసాధ్యాన్ని ఈరోజు మేము సుసాధ్యం చేసి చూపించాం. వాలంటీర్ల కన్నా వేగంగానే పింఛన్‌ను అందించాం’’ అని చెప్పారు అచ్చెన్నాయుడు.

Tags:    

Similar News