పేర్ని నాని తప్పించుకో లేరు
పేర్ని నానికి, ఆయన బినామీలకు చుక్కలు చూపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
రేషన్ బియ్యం మాయమైన కేసులో నుంచి మాజీ మంత్రి పేర్ని నాని తప్పించుకోలేరని, చట్టం తన పని తాను చేసుకుని పోతుందని, చట్టం నుంచి పేర్ని నాని ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని తినేసి ఇప్పుడు నీతి కబుర్లు చెబుతున్నారని పేర్ని నానిపై మండిపడ్డారు. అమరావతిలో ఆదివారం కొల్లు రవీంద్ర మాట్లాడుతూ..పేర్ని నానిపై విరుచుకు పడ్డారు. భార్య పేరుతో రేషన్ బియ్యం గోడౌన్ ఉంటే జాగ్రత్తలు తీసుకుంటూ బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా? అంటూ ప్రశ్నించారు. భార్య పేరును వాడుకుని పేర్ని నాని సానుభూతి పొందాలనుకుంటున్నారని, ఇది సిగ్గు చేటన్నారు. దొంగతనం చేసి డబ్బు తిగిచ్చేస్తే దొంగ దొర అయిపోరని ఎద్దేవా చేశారు. దొంగ దొంగే అని అన్నారు. ఇక నుంచి పేర్ని నానికి, ఆయన బినామీలకు చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి పేర్ని నాని అక్రమాలపై ఈడీ విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. మంత్రిగా ఉండగా పేర్ని నాని పోర్టు సమీపంలోని భూములను లాక్కోవడం వాస్తవం కాదా అని నిలదీశారు.