నేను రాజకీయాల్లోకి అడుగు పెడుతానని అనుకోలేదు

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలోని ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో గురువారం జరిగింది.

Update: 2024-09-26 13:45 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ పూర్వ వైభవాన్ని సాధించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఎలాంటి కార్యక్రమాలు చేపడితే ప్రజలకు చేరువ అవుతామనే అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమానికి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడానికి పరిస్థితులే కారణమన్నారు. తన నాన్న ఏర్పాటు చేసిన రెడ్డి కాంగ్రెస్‌ను నాడు కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయ్యారు. నేను వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాను. అప్పుడు కావాలనుకుంటే రాజ్య సభ తీసుకొని ఉండొచ్చన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినందు వల్ల నా అవసరం అక్కడ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి. నా అవసరం ఇక్కడ ఉంది. అందుకే పార్టీ ఇచ్చిన బాధ్యతలను చేపట్టానన్నారు. రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలని వైఎస్‌ఆర్‌ కోరిక. నాకు ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక లేదు. రాహుల్‌ ప్రధాని అవ్వాలి. అదే నా లక్ష్యం అన్నారు. రాహుల్‌ ప్రధాని అయితే రాష్ట్ర విభజన సమస్యలన్నీ నెరవేరుతాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ పునర్మిణాం జరగాలి. 46వేలకుపైగా పోలింగ్‌ బూత్‌లున్నాయి. బూత్‌ లెవల్‌ కార్యకర్తలు ఉంటే అదే ఒక ఫోర్సుగా తయారవుతుందన్నారు. మండల, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు కావాలి. జగన్‌ మీద ఉన్న వ్యతిరేకతతో చంద్రబాబుకు ఓట్లు పడ్డాయి. కూటమి మీద ప్రేమ ఉండి కాదు. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్‌ గెలవాలి. ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర సమస్యలపై ఉద్యమాలు ఉంటాయన్నారు. 2029లో అధికారమే ధ్యేయంగా పని చేయాలని కాంగ్రెస్‌ నేతలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ సెక్రెటరీ పాలక్‌ వర్మతో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News