ఐఏఎస్ శ్రీలక్ష్మిని వెంటాడుతున్న ఓబుళాపురం మైనింగ్ కేసు

ఓబుళాపురం మైనింగ్ కేసులో ఆమె నిందితురాలేనని తెలంగాణ హైకోర్టు ప్రకటించింది;

Update: 2025-07-25 10:52 GMT
చాట్ జీపీటీ సౌజన్యంతో రూపొందించిన చిత్రం..
ఐఏఎస్ అధికారి యర్రా శ్రీలక్ష్మీ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో ఆమె నిందితురాలేనని తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. దీంతో ఆమె పాత్రపై తిరిగి సీబీఐ విచారణ సాగిస్తుంది. తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. ఇది ఆమెకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె నిబంధనలకు విరుద్ధంగా గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓఎంసీ కంపెనీకి గనులు లీజుకు ఇచ్చారన్నది ఆరోపణ. ఈ కేసులో ఆమె గతంలో అరెస్ట్ అయ్యారు. కొంత కాలం జైల్లో ఉండి బెయిల్ పై విడుదలై వచ్చారు.
ఈ మైనింగ్‌ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆమె ఉన్నత న్యాయస్థానంలో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిని న్యాయస్థానం నిందితురాలిగా తేల్చింది. కోర్టు తీర్పుతో ఆమె పాత్రపై సీబీఐ విచారణ జరపనుంది.
అంతకుముందు ఏమి జరిగిందంటే..
ఓబుళాపురం మైనింగ్‌ కేసులో వై.శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌ను 2022 అక్టోబరులో సీబీఐ కోర్టు కొట్టేసింది. దీన్ని సవాలు చేస్తూ ఆమె తెలంగాణ హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలుచేశారు. గతంలో దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. శ్రీలక్ష్మి పిటిషన్‌ను అనుమతించింది. ఆమెను కేసు నుంచి తప్పిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. సీబీఐ వాదన వినకుండా ఉత్తర్వులు జారీచేయడం సరికాదని అభిప్రాయపడింది. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకుని తాజాగా విచారణ చేపట్టాలంటూ ఈ పిటిషన్‌ను తిరిగి హైకోర్టుకు పంపింది. దీన్ని మూడు నెలల్లో తేల్చాలని ఆదేశించింది. ఇప్పుడా కేసుపై తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో మళ్లీ సీబీఐ రంగంలోకి దిగనుంది.

శ్రీలక్ష్మి 2006లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పని చేశారు. ఆమె ఈ పదవిలో ఉన్నప్పుడు ఓఎంసీ మైనింగ్ లీజ్ వ్యవహారం ముందుకు సాగిందని సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు. ఓఎంసీ లీజులు కట్టబెట్టడానికి అమె అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ తెలిపింది. ఈ కేసులో ఆరో నిందితురాలైన శ్రీలక్ష్మి.. వాస్తవాలను తొక్కిపెట్టి మరోసారి ఇక్కడ పిటిషన్‌ దాఖలు చేశారంటూ తెలంగాణ హైకోర్టుకు సీబీఐ నివేదించింది. గతంలో ఇదే కేసులో ఆమె పిటిషన్లను ఈ హైకోర్టు కొట్టేసిందని తెలిపింది. ఈ విషయాన్ని ప్రస్తుత రివిజన్‌ పిటిషన్‌లో ప్రస్తావించకుండా మరోసారి పిటిషన్‌ దాఖలు చేశారంది. ఓఎంసీకి లీజుల మంజూరులో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని, కింది కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు శ్రీలక్ష్మి పిటిషన్‌ను తోసిపుచ్చింది.
న్యాయ ప్రక్రియ సాగిందిలా..
సీబీఐ కోర్టు (2022)... శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్ఛార్జ్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఆమెను విచారించాల్సిందేనని తీర్పు ఇచ్చింది.
తెలంగాణ హైకోర్టు.. 2023లో ఆమె దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను అనుమతించి, ఆమెను కేసు నుంచి తప్పిస్తూ తీర్పు వెలువరించింది.
సుప్రీంకోర్టు ఏమి చెప్పిందింటే... సీబీఐ అప్పీల్ పై విచారణ చేసిన సుప్రీంకోర్టు, హైకోర్టు ఒక్కపక్షంగా తీర్పు ఇచ్చిందని అభిప్రాయపడి, పిటిషన్‌ను తిరిగి హైకోర్టుకు పంపింది.
తాజా హైకోర్టు తీర్పు (2025).. సీబీఐ వాదనలను సమీక్షించిన హైకోర్టు, గత తీర్పు లోపభూయిష్టమని తేల్చి, శ్రీలక్ష్మి దాఖలు చేసిన తాజా పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆమె మళ్లీ నిందితురాలిగా తేల్చింది.
ఇప్పుడు ఏమవుతుంది?
సీబీఐ మరోసారి నేర విచారణను ముందుకు తీసుకెళ్తుంది. మళ్లీ కింది కోర్టులో కేసు విచారణ సాగుతుంది. కేసులో తుది తీర్పు రావడానికి సమయం పట్టే అవకాశముంది. కానీ అధికారులపై నైతిక, పరిపాలనా ఒత్తిడులు పెరగడం ఖాయం.
శ్రీలక్ష్మి చేసిన తప్పిదం ఏమిటీ?
ప్రధానంగా శ్రీలక్ష్మిపై ఉన్న ఆరోపణ ఏమిటంటే: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)కు నిబంధనలకు వ్యతిరేకంగా మైనింగ్ లీజులు మంజూరు చేయడం. లీజ్ అనుమతుల విషయంలో నిబంధనల ఉల్లంఘన. అధికార దుర్వినియోగం
సీబీఐ వాదన ప్రకారం, శ్రీలక్ష్మి పదవిని దుర్వినియోగం.
గతంలోనే హైకోర్టు ఆమె డిశ్ఛార్జ్ పిటిషన్‌ను కొట్టివేసినా, అదే కేసులో మరోసారి పిటిషన్ వేయడం ద్వారా తప్పుడు సమాచారంతో కోర్టును దారి తప్పించేందుకు ప్రయత్నించారని సీబీఐ ఆరోపించింది.
కొంపకు తిప్పలు తెచ్చిన క్యాపిటివ్ మైన్స్ పదం
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి చేసిన ప్రధాన “తప్పిదాల్లో” ఒకటిగా ‘క్యాపిటివ్ మైన్స్’ అనే పదాన్ని చేర్చడమని సీబీఐ ఆరోపించింది. క్యాపిటివ్ మైనింగ్ Captive Mining అంటే ఒక కంపెనీ తన అవసరాల కోసం మాత్రమే ఓ గనిని ఉపయోగించాలి అనే నిబంధనతో మైనింగ్ లీజ్ ఇవ్వడం. అంటే, ఆ గనిలో తవ్విన ఖనిజాలను బయట మార్కెట్‌కి అమ్మకుండా, తన పరిశ్రమ అవసరాలకే పరిమితం చేయాలి. అది గాలి జనార్ధన్ రెడ్డి కంపెనీ తనకు అనుకూలంగా మార్చుకుని పెద్దఎత్తున విదేశాలకు ఖనిజాన్ని అమ్ముకుంది.

శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు, లీజు షరతుల్లో తానే స్వయంగా ‘క్యాపిటివ్ మైనింగ్’ అనే పదాన్ని చేర్చినట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. లీజు షరతులలో అనవసరంగా, అనధికారికంగా చేసిన మార్పుగా సీబీఐ అభియోగం మోపింది.
దీనివల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం ...
ఓబుళాపురం మైనింగ్ కేసు–లో శ్రీలక్ష్మి వంటి అధికారుల నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి తీవ్ర ఆర్థిక నష్టం జరిగినట్లు సీబీఐ తన ఆరోపణల్లో స్పష్టంగా పేర్కొంది. అయితే, ఇది కేవలం పరిమిత మోతాదులో నష్టం కాదు. భారత దేశ ఖనిజ వనరుల పరిరక్షణ, ప్రభుత్వ ఆదాయాలు, పారదర్శక పాలన, అసలైన లీజుదారుల హక్కులు అన్ని వాటిపై దీర్ఘకాలిక ప్రభావం చూపే విధంగా ఉంది.
సీబీఐ అంచనా ప్రకారం, ఒక్కగాని నష్టమే ₹350 కోట్లు నుంచి ₹500 కోట్లు వరకు ఉండవచ్చని చెబుతూ, కోర్టుకు వివరణ ఇచ్చింది.
2011లో గాలి జనార్ధన్ రెడ్డి అరెస్ట్ సమయంలో ఓఎంసీ అక్రమ మైనింగ్ విలువ ₹5000 కోట్లకు పైగా ఉందని కొన్ని నివేదికల్లో ఉంది.
Tags:    

Similar News