నా చెల్లెలు, అమ్మ ఫొటోలు పెట్టి డైవర్ట్ చేస్తున్నారు:మాజీ సీఎం జగన్
విజయనగరం, విశాఖలకు తరలించి ఉంటే డయేరియా మరణాలు ఉండేవి కాదు. తాను స్పందించేంత వరకు ప్రభుత్వం పట్టించుకోలేదని జగన్ అన్నారు.
ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తోంటే తన చెల్లెలు, అమ్మ ఫొటోలు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని కూటమి ప్రభుత్వంమై మాజీ సీఎం జగన్ ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా బాధితుల పరామర్శించిన అనంతరం జగన్ మాట్లాడుతూ.. గుర్లలో సెప్టెంబర్ 20న∙తొలి డయేరియా మృతి కేసు నమోదైతే 35 రోజులైనా ప్రభుత్వం స్పందించలేదని, అక్టోబర్ 19న తాను ట్వీట్ చేసే వరకు ప్రభుత్వం స్పందించలేదని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మండిపడ్డారు. డయేరియా బాధితులను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రులకు ఎందుకు తరలించలేదని ప్రశ్నించారు. ఆసుపత్రులకు తరలించకుండా స్కూల్ బెంచ్‌లపై వైద్యం చేస్తారా? అని నిలదీశారు. తమ హయాంలో ప్రతి గ్రామంలో సచివాలయాలు కనిపించేవి. అక్కడే వివిధ శాఖల వారు పని చేస్తూ కనిపించే ఉద్యోగులు ఉండేవారు. బడి పిల్లలు చక్కగా నవ్వుతూ కనిపించేవారు. అవన్నీ పోయాయన్నారు. తమ హయాంలో విలేజ్ క్లినిక్స్ పని చేసేవి, నాడు–నేడుతో బాగుపడిన స్కూళ్లు, రైతు భరోసా కేంద్రాలు కనిపించేవి. చక్కగా ఈ–క్రాపింగ్ జరిగేది. ఇప్పుడవన్నీ నీరుగారి పోయాయి. దీనికి గుర్ల గ్రామం ఒక ఉదాహరణ.