సమయం పొడిగిస్తే.. చదువు వస్తుందా?
రోజుకు ఎనిమిది గంటల పాటు హైస్కూళ్లల్లో పిల్లలకు చదువులు చెబుతున్నారు. ఈ సమయం చాలదంటోంది ప్రభుత్వం. టైమ్ పెంచితే సమస్యలు తప్పవంటున్నారు ఉపాధ్యాయులు.
By : G.P Venkateswarlu
Update: 2024-11-18 07:44 GMT
ఆంధ్రప్రదేశ్‌లోని హైస్కూళ్లు, హైస్కూల్ ప్లస్‌లలో సాయంత్రం ఐదు గంటల వరకు స్కూళ్ల నిర్వహణను పొడిగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఉదయం 9 గంటల నంచి సాయంత్రం 4 గంటల వరకు స్కూళ్ల సమయాలు కొనసాగుతున్నాయి. దీనిని మరో గంట పొడిగించి, సాయంత్రం ఐదు గంటల వరకు స్కూళ్లు కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఈ నెల 25 నుంచి 30 వరకు పైలెట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోను రెండు చోట్ల సమయం పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
చదువుకు.. సమయానికి లింకు..
ప్రస్తుతం ఉన్న సమయానికి బదులు ఒక గంట సమయం పెంచినంత మాత్రాన, పిల్లలకు చదువులు వస్తాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం అక్షరాలు(తెలుగు, ఇంగ్లీషు) ఐదో తరగతి పూర్తి అయిన విద్యార్థికి రావడం లేదంటే ఆశ్చర్యాంగానే ఉంటుంది. ఇందుకు ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు చెబుతున్నది ఒకటే మాట. ఈ పిల్లోడు స్కూలుకు రాడు. అందుకే వాడికి అక్షరాలు రావడం లేదు. ఈ మాటను ఎవరైనా సమర్థిస్తారా? ఒకప్పుడు ఉపాధ్యాయులు ఇంటికెళ్లి తల్లిదండ్రులను ఒప్పించి పిల్లలను స్కూలుకు తీసుకొచ్చేవారు. భయంతో పాటు టీచర్‌పై పిల్లలకు భక్తి కూడా ఉండేది. నేడు పిల్లలకు భయమూ లేదు.. భక్తీ లేదు. నాకెందుకులే అని ఉపాధ్యాయులు కూడా పట్టించుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. బాగా చదువుకున్న తల్లిదండ్రులైతే.. తమ పిల్లలను చిన్న నాటి నుంచి స్కూలుకు అలవాటు చేసి, ఉదయం లేవగానే పిల్లలకు స్కూలుకు వెళ్లాలనే ఆలోచనలు వచ్చేలా తయారు చేస్తున్నారు.
అదే చదువురాని తల్లిదండ్రులైతే.. తమ పిల్లలను తమతో పాటు పనులకు తీసుకెళ్తున్నారు. పిల్లలు తల్లిదండ్రులతో కలిసి పనులకు వెళితే సరేసరి. లేదంటే స్కూలుకు వెళ్తామని పిల్లలు అడిగినా.. సరే వెళ్లమని చెప్పి, తల్లిదండ్రులు పనులకు వెళ్లిపోతారు. ఈ పిల్లలు ఒకరోజు వస్తే, మరొక రోజు స్కూలుకు రాని మాట వాస్తవం. అందువల్ల పాఠ్యాంశాల విషయంలో వెనక్కి రాలేక, వీళ్లను ఉపాధ్యాయులు కూడా పట్టించుకోవడం లేదనేది నిజం. అందువల్లే డ్రాప్ అవుట్స్ పెరగడంతో పాటు ఎంతో మంది పిల్లలకు బేసిక్స్ కూడా రావడం లేదు. ఇది ఉపాధ్యాయుల తప్పనాలో.. లేక తల్లిదండ్రుల తప్పనాలో, ఆలోచిస్తుంటే ఆ విద్యార్థి జీవితం కాస్త ముందుకు సాగుతుంది. అదే సమయంలో చదువు రాని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్షరాలు వచ్చినా రాకపోయినా విద్యార్థి పై తరగతులకు ప్రమోట్ అవుతాడు. అలా ఎందుకు చేస్తున్నారని ఉపాధ్యాయులను ప్రశ్నిస్తే విద్యార్థిని అదే తరగతిలో ఉంచితే, తాము సరిగా చదువు చెప్పడం లేదని, తమపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. అందుకే చదువుతో సంబంధం లేకుండా తరగతులు మాత్రం సమయానుకూలంగా మారి పోతున్నాయి.
గతంలో సిలబస్ సమస్య లేదా?
ఈ విద్యా సంవత్సరం సకాలంలోనే ప్రారంభమైంది. ఎటువంటి అవాంతరాల్లేవు. ఒకటి రెండు సందర్భాల్లో తుపానుల వల్ల పాఠశాలల సరిగా సాగ లేదు. అది కూడా కొద్ది రోజులు మాత్రమే. ఈ సమయాన్ని రోజులో ఎంతో కొంత టైమ్ కేటాయించి ఉపాధ్యాయులు సిలబస్‌లను పూర్తి చేసుకోవచ్చు. సిలబస్ సకాలంలో పూర్తి కావడం లేదని, అందుకే ప్రతి రోజు మరో గంట సమయం పెంచుతున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఉపాద్యాయులు, పిల్లల బాధలు పట్టవా..
సాయంత్రం ఐదు గంటల వరకు స్కూళ్లు నిర్వహించడం వల్ల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. హైస్కూళ్లు దాదాపు ఎక్కువ శాతం మండల కేంద్రాల్లోనే ఉన్నాయి. గ్రామాలు, మండల కేంద్రాలకు ఎటు చూసినా పది నుంచి 20కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాయి. పిల్లలు స్కూళ్ల సమయం ముగిసిన తర్వాత బస్సులపైనో, తల్లిదండ్రులపైనో ఆధారపడాలి. వాహనాలు ఉన్న తల్లిదండ్రులు స్కూలు వరకు వచ్చి తీసుకెళ్తారు. వాహనాలు లేని తల్లిదండ్రుల పిల్లలు బస్సుల్లోను, లేక నడిచే ఇంటికి చేరుకోవాలి. అలాంటప్పుడు సాయంత్రం ఐదు గంటల వరకు స్కూల్లో ఉంటే ఇంటికి చేరుకునేది ఎలాగనే భయం విద్యార్థుల్లో మొదలైంది. ఉపాధ్యాయులు కూడా ఎక్కువ మంది మండల కేంద్రాల్లోనే నివాసం ఉంటున్నారు. స్కూలున్న ఊర్లల్లోనే వారు ఉండాలంటే అద్దెకు ఇల్లు కూడా దొరికే పరిస్థితులు చాలా చోట్ల లేవు. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయుడు ఇంటికి చేరుకోవాలన్నా రాత్రి అవుతుంది. తిరిగి ఉదయం ఆరు గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకుంటే కానీ 9 గంటల లోపు స్కూలుకు రాలేరు. అందువల్ల కేవలం సిలబస్‌లను దృష్టిలో ఉంచుకొని సాయంత్రం పొడిగించడం అనేది మంచిది కాదని చాలా మంది చెబుతున్నారు.
ఉన్నత పాఠశాలల పని వేళల మార్పు విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఏపీ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సీవీ ప్రసాద్, ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏసీవీ గురవారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇళ్ల వద్ద ఉండే సమస్యలు, వాతావరణ సమస్యలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర మాట్లాడుతూ చదువు కోసం ఒక గంట సమయం పెంచడం మంచిదే అయినప్పటికీ విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. సమయం ఎంత అనేది ప్రధానం కాదని, విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు తమ సమయాన్ని ఎంత వెచ్చిస్తున్నారనేదే ముఖ్యమని అన్నారు. విద్య జ్ఞాన నేత్రమని అంటారు. అటువంటి విద్యా దానం ఎందరి జీవితాలనో తీర్చి దిద్దుతుందని, ప్రభుత్వం అన్ని విధాల ఆలోచించి, నాణ్యమైన బోధనల ద్వారా మంచి విద్యను అందించాలే తప్ప సమయం పెంచినా ప్రయోజనం లేదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు.