తుఫాన్ ‘ఆస్నా’ ఎఫెక్ట్.. అతలాకుతలమైన ఆంధ్ర

ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్లు తయారైంది తెలుగు రాష్ట్రాల పని. ఒకవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కలవరపెడుతుంటే..

Update: 2024-08-31 15:21 GMT

ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్లు తయారైంది తెలుగు రాష్ట్రాల పని. ఒకవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కలవరపెడుతుంటే.. మరోవైపు అరేబియా సముద్రంలో మొదలైన ‘అస్నా’ తుఫాను కూడా ఇటువైపే కదులుతుండటం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కంటిపైన కునుకులేకుండా చేస్తోంది. ఈ ‘ఆస్నా’ తుఫాను గంటకు 13-15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా దూసుకొస్తుందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడం తీవ్ర అల్పపీడనం మారి ఇప్పుడు ‘ఆస్నా’ తుఫానుగా అవతరించిందని వివరించింది. రానున్న 24 గంటల్లో ఇది తీరం దాటొచ్చని, ఈ తుఫాను ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలు సహా 10 రాష్ట్రాలపై తీవ్రంగా ఉండనుందని, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిస్తోంది.

తెలుగు రాష్ట్రాలకు వార్నింగ్..

ఒకవైపు బంగాళాఖాతంలో మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనాలు వాయుగుండాలుగా మారాయి. అరేబియాలోని వాయుగుండం కాస్తా తుఫానుగా మారగా.. బంగాళాఖాతంలో వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర వాతావరణ శాఖ రెడ్ ఎలర్ట్ ప్రకటించింది. ప్రతి జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఆస్నా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణ, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక,కేరళ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

అతలాకుతలమైన ఆంధ్ర

ఆంధ్రప్రదేశ్ అంతా ఈరోజు భారీ వర్షాలతో అతలాకుతలమైంది. ఈ వర్షాలతో పలు జిల్లాల్లోని రహదారులు అన్నీ కూడా చెరువులను తలపించాయి. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు కూడా జరిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో నిర్లక్ష్యమో, సరైన భద్రత లేకనో ఒకరిద్దరు వాగుల్లో కొట్టుకుపోయారు. వీటిపై రెస్క్యూ టీమ్స్ దృష్టి సారించి.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేస్తున్నారు. వర్షాల దెబ్బకు పలు జిల్లాల్లో పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు కలెక్టర్లు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా వరదలు ముంచెత్తే అకాశం కూడా లేకపోలేదని హెచ్చరించింది. మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దని తెలిపింది.

విజయవాడలో ఇలా..

ఈరోజు వర్షాల దెబ్బకు విజయవాడలో పలు చోట్లు రోడ్లపై నీరు నిలిచిపోయి జనజీవనం స్తంభించింది. మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడి నలుగురు మరణించగా, ముగ్గురు గల్లంతయ్యారు. ఈమేరకు సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్ అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టింది. కలెక్టర్ సృజన కూడా అక్కడకు వెళ్లి పరిస్థితుల గురించి అధికారులను ఆరా తీశారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఏలూరు జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. వర్షాల దెబ్బకు భారీ వృక్షం నేలకొరిగింది. ఈ ఘటనలో విద్యుత్తు, కేబుల్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఒక మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. పలు ఇతర జిల్లాల్లో కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. వీటన్నింటిపై అధికారుల సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర కూడా అధికారులతో సమీక్షించి పరిస్థితులపై ఆరా తీశారు. ప్రతి జిల్లాలో ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News