అందరికీ ఆదాయం పెరగాలి..ప్రజల కోసం సీఎం ప్రార్థనలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుర్గమ్మను దర్శించుకున్నారు.;
నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో సీఎం చంద్రబాబుకు ఆలయ అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు సీఎంకు వేదాశీర్వాచనాలిచ్చారు. అనంతరం ముఖ్యమంత్రికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలందరికీ ఆదాయం పెరగాలని.. సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గమ్మ అమ్మవారిని ప్రార్థించినట్లు చంద్రబాబు చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం రోజున కనక దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ప్రార్థనలు చేసినట్లు చెప్పారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ను కలిశారు. విజయవాడలోని రాజభవన్‌కు వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పరస్పరం ఇరువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన సంవత్సరం లక్ష్యాలు, చేపట్టనున్న కార్యక్రమాల గురించి గవర్నర్‌కు చంద్రబాబు వివరించారు.