శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజక వర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు వ్యతిరేకంగా ఆయన బంధువు సువార గాంధీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో నిలచారు. దీంతో సీతారామ్‌కు ఇబ్బందులు తప్పవని, ఓట్లు చీలే ప్రమాదం ఉందని స్ఙానికులు చర్చించుకుంటున్నారు. సీతారామ్‌కు ప్రత్యర్థిగా రంగంలో ఉన్న టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ తమ్మినేనికి స్వయాన భవమరిది కావడం విశేషం.
మంత్రి బూడి ముత్యాల నాయుడుకి కూడా ఇంటి పోరు తప్పడం లేదు. ఆయన కుమారుడే ఆయనపై తిరుగుబాటు ప్రకటించారు. తనకు కాకుండా తన అక్క అనురాధకు మాడుగుల సీటు ఇప్పంచడంతో కొడుకు రవికుమార్ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. దీంతో ముత్యాల నాయుడుకి తలనొప్పి వచ్చి పడింది. ముత్యాల నాయుడు ప్రస్తుతం అనకాపల్లి పార్లమెంట్ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. తన సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు తలెత్తడం, స్వంత నియోజక వర్గం మాడుగుల నుంచి ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగడం ముత్యాల నాయుడుకి మైన్ అవుతుందనే టాక్ స్థానికుల్లో ఉంది. తన తండ్రిని, సోదరిని ఓడించాలని వీడియోలు చేసి సామాజిక మాద్యమాల్లో విడుదల చేయడం సంచలనంగా మారింది.
కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంకు సొంత కుమార్తె ఎదురు తిరిగింది. తండ్రి ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా పని చేయడం నచ్చని ఆమె తండ్రిపైనే కుమార్తె క్రాంతి విమర్శలు గుప్పించింది. తండ్రి ముద్మగడ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వంగ గీతకు ప్రచారం చేస్తుండగా కుమార్తె క్రాంతి మాత్రం పవన్ కల్యాణ్‌కు ప్రచారం చేస్తుండటం సంచలనంగా మారింది. తండ్రి ముద్రగడపై వ్యతిరేకంగా ఆయన కుమార్తె క్రాంతి చేసిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆయన చెల్లెలు షర్మిల తిరుగుబాటు జెండా ఎగురవేసి, కాంగ్రెస్ అభ్యర్థిగా కడప పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలిచారు. రాష్ట్రాన్ని పాలించే అర్హత జగన్‌కు లేదని ప్రతి రోజు విమర్శలు గుప్పిస్తున్నారు.
మంత్రి అంబటి రాంబాబుకు కూడా ఇంటి పోరు ఎదురైంది. ఆయన అల్లుడు గౌతమ్ సొంత మామకు ఓట్లేయొద్దని, ఆయన దుర్మార్గుడని, ఓడించాలని వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఇవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి.