భారతదేశం అందుకే అభివృద్ధి చెందడం లేదా!
భారతదేశంలో రాజకీయ పరిస్థితులు, ప్రజాస్వామ్య దుస్థితిపై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రొఫెసర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారేమంటున్నారంటే..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనా భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. రాజకీయాల్లో వస్తున్న మార్పులు ఇందుకు నిదర్శనం. అయితే ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ రాజనీతి మానవీయ శాస్త్ర ప్రొఫెసర్ వార్డ్ బైరన్ స్కాట్ తెలిపారు. ప్రస్తుతం భారత్, ఇండోనేషియాలో జరుగుతున్న ఎన్నికల తీరును ఆయన పరిశీలిస్తున్నారు.
అందులో భాగంగా శనివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని జన చైతన్య వేదిక కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితి, ఎన్నికల తీరు గురించి ఆయన పౌర సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఈ సమావేశంలో నెదర్లాండ్స్‌కు చెందిన ఆమెస్టేర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వార్డ్ బైరెన్‌తో పాటు లండన్ కింగ్స్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ విఘ్నేష్ కార్తి, హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన పూర్వ ప్రొఫెసర్ కొండవీటి చిన్నయ్య సూరి కూడా పాల్గొన్నారు.
ఆ బాధ్యత పౌర సంస్థలదే
ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల్లో డబ్బు కీలక పాత్ర పోషిస్తున్న దేశాలు అభివృద్దిలో వెనకబడి ఉంటున్నాయని వార్డ్ బైరన్ వివరించారు. భారతదేశం కూడా ఆ దేశాల జాబితాలో ఉందని, ఇండియాలో ఇటువంటి పరిస్థితి రావడం తీవ్ర బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రజలు డబ్బు, కులం, మతం, మద్యం వంటి ప్రలోభాలకు లోను కాకుండా చైతన్యవంతంగా ఓటు వేసేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత పౌర సంస్థలు, మేధావులు తీసుకోవాలి. రాజకీయ సంస్కరణలను రాజకీయ పార్టీలు తక్షణం ప్రారంభించాలి. అప్పుడే పరిస్థితులు చక్కబడే అవకాశం ఉంటుంది’’అని వెల్లడించారు.
‘‘రాజకీయ పార్టీలకు కావాల్సిన ఎన్నికల నిధులను ప్రజల నుంచి సేకరించాలి. ప్రభుత్వాలు కూడా కొంతవరకు నిధులు ఇవ్వాలి. అప్పుడే దేశంలో రాజకీయ కార్పొరేటీకరణను నివారించడం సాధ్యమవుతుంది’’ అని ప్రొఫెసర్ విఘ్నేజ్ చెప్పుకొచ్చారు.
‘‘దేశంలోని పార్టీల మధ్య సైద్ధాంతిక వైవిద్యాలు కనుమరుగయ్యాయి. ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా అవతరిస్తున్నాయి. ఒక వ్యక్తి కేంద్రం రాజకీయాలు సాగడం ప్రజాస్వామ్యాన్ని కుంటుపడేలా చేస్తుంది. ఇది దేశ భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదు’’ అని ప్రొఫెసర్ కొండవీటి చిన్నయ్య సూరి తెలిపారు.
‘‘ప్రపంచంలో ఎన్నికల కోసం అత్యధికంగా ఖర్చు చేసే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. కానీ ఇక్కడ రాజకీయాలు కార్పొరేటివ్‌గా మారుతున్నాయి. సేవ చేయాలనుకునే వారు, మేధావులు, సమస్యలపై అవగాహన ఉన్నవారు ఎన్నికల బరిలో నిలువలేకున్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో కేవలం వెయ్యి కుటుంబాలకు చెందిన నేతలే పోటీ పడుతున్నారు’’అని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి వివరించారు.