నేడు అమరావతిని దేవుళ్ల రాజధాని అందామా?
మానవులకు, దేవుళ్లకు చాలా తేడా ఉందని అందరూ భావిస్తారు. ఎందుకంటే వరాలు ఇచ్చే వారు దేవుళ్లు. పాలకులు వరాలు ఇచ్చే వారు అయినా ఆ వరాలు ప్రజలకు చేరటం లేదు.;
అమరావతి అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచిన రాజధానిగా నమోదైంది. పదేళ్ల క్రితం ఏపీ రాజధాని ప్రాంతానికి అమరావతిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నామకరణం చేశారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత స్వర్గీయ రామోజీరావు అమరావతిగా పేరు పెట్టాలని సూచిస్తేనే పెట్టినట్లు ఆయన చనిపోయిన తరువాత జరిగిన సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ‘అమరావతి’ అంటే ఏమనుకుంటున్నారు, ఇంద్రుడు పరిపాలించిన ప్రాంతం. ఇక్కడ పాలన కూడా అలాగే సాగుతుందని 2018లో తాత్కాలిక సచివాలయంలో పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకు అప్పుడప్పుడూ అమరావతి ప్రస్తావన రాగానే దేవతల ప్రస్తావన కూడా వస్తూనే ఉంది.
ఆథ్యాత్మిక కేంద్రంగా మారుతుందా?
అమరావతిని ఆథ్యాత్మిక కేంద్రంగా మార్చే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో అమరావతిలో వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఇప్పటికే నిర్మించారు. అమరావతిలో దేవాలయ టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందని, ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మిస్తామని తిరుపతిలో జరిగిన ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో లో చెప్పారు. అంటే అమరావతిలో దేవుళ్లు ఉన్నారని చెప్పటానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి ఆదాయ వనరుగా మారుతుందని ఇప్పటికే ప్రకటించారు. అన్ని రకాలుగా అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. పెట్టుబడి దారులు వస్తే వారికి కావాల్సిన స్థలం ఆఫీసుల నిర్మాణానికి ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు.
ప్రపంచమంతా చూసేలా నిర్మాణాలు
ప్రపంచంలోని వారంతా చూసేలా రాజధానిలో సచివాలయం, హైకోర్టు వంటి భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసి పనులు మొదలు పెట్టారు. ఇప్పటికే ఎమ్మెల్యే క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్లు, రాష్ట్ర కార్యాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. గతంలో 80 శాతం పూర్తయి ఆగిపోయిన నిర్మాణాలను తిరిగి మిగిలిన భాగం నిర్మించే పనిలో అధికారులు ఉన్నారు. ఒక మంచి ఎగ్జిక్యూటివ్ కేంద్రంగా అమరావతిని మార్చాలనే ఆలోచన చంద్రబాబు చేశారు. అటువంటిది ఆథ్యాత్మిక కేంద్రం అనటం, దేవతలు ఉన్నారని అనటం వెనుక అర్థం ఏమిటనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
నేటి పాలకులు దేవుళ్లుగా కీర్తించ బడతారా?
దేవుళ్ల కాలంలోనే కాదు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో కూడా పాలకులు దేవుళ్లుగానే కీర్తించ బడ్డారు. ఎందుకంటే వారిలో నిస్వార్థ పరులు ఉన్నారు. ఉండేందుకు ఇల్లు కూడా లేని వారు ఎంతో మంది మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఇప్పుడు వారిలా ఇల్లు లేకుండా ఉండాలని చెప్పటం లేదు. అన్ని సౌకర్యాలు ఒక విధంగా పాలకులకు దేవుళ్లు ఇచ్చారు. నీతి వంత మైన పాలన అందించి పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తే తప్పకుండా అందరి చేత కీర్తించ బడతారు. అప్పుడు పాలకులు ప్రజలకు దేవుళ్ల లానే కనిపిస్తారు. ఆ పరిస్థితులు ఉంటాయా? అవినీతి మరక అంటని నేత భవిష్యత్ లో కనిపిస్తారా?
పదవులతో పాటే అహంభావం..
పదవులు రావడంతో మనిషిలో అహంభావం పెరుగుతోంది. ప్రస్తుతం అది మనకు కనిపిస్తూనే ఉంది. గత ప్రభుత్వంలోనూ కనిపించింది. ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఉంది. కార్య నిర్వాహక వర్గాన్ని పావులుగా మార్చి పాలకులు ఆడిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల్లో వాస్తవాలు కూడా ఉన్నాయి. ఎంతో మంది ఐఏఎస్ లు, ఐపీఎస్ లు పాలకుల క్రూరత్వానికి ప్రతీకలుగా మిగిలారు. కార్యనిర్వాహకుల్లోనూ అవినీతి పరులు ఉన్నారు. అయితే రాజకీయ అవినీతి లేకుంటే అధికారుల్లో అవినీతిని అరికట్టం చాలా తేలిక.
ఎప్పుడైతే పాలకుల్లోనే అవినీతి ఉందో ప్రజలను రక్షించే వారు లేకుండా పోయారు. అధికార పక్షం, ప్రతిపక్షం గతంలో కలిసి పనిచేసేవి. నేడు ఆ పరిస్థితులు లేవు. గతంలో ఎవరు అధికారంలో ఉంటే వారి వద్దకు ప్రతిపక్ష నాయకులు నేరుగా అర్జీలు తీసుకుని వచ్చి సమస్యలను ప్రభుత్వానికి తెలిపి సామరస్యంగా ప్రజలకు సేవ చేసే వారు. ఇప్పుడు చూద్దామన్నా కనిపించడం లేదు. గెలిచి ప్రతిపక్షంలో ఉన్న ప్రజా ప్రతినిధులకు విలువ లేకుండా పోయింది. అక్కడ అధికార పార్టీ వారు ఒక ఇన్చార్జ్ ను నియమించి ఆ వ్యక్తి ద్వారానే పనులు చేయిస్తూ ఎమ్మెల్యేకు వాయిస్ లేకుండా చేస్తున్నారు. ఈ పాలన దేవతలు చేయలేదని చెప్పొచ్చు. అటువంటి మంచి పాలన వస్తుందని ఆశిద్దాం.