SECI | జగన్ పై చర్యలకు చంద్రబాబు భయపడుతున్నారా? ఎందుకు?
జగన్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలను అడ్డం పెట్టుకుని ఆయనపై చర్య తీసుకునేందుకు వచ్చిన 'లడ్డూ' లాంటి అవకాశాన్ని చంద్రబాబు వదిలేసుకున్నారా? ఎందుకు?;
By : The Federal
Update: 2025-01-04 06:57 GMT
ప్రముఖ పారిశ్రామి వేత్త అదానీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కుదిరిన సోలార్ పవర్ కాంట్రాక్ట్ ల ఒప్పందాలను ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఎందుకు రద్దు చేయడం లేదు? అదానీ సంస్థల నుంచి సుమారు 1750 కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయని ప్రపంచ వ్యాప్తంగా వార్తలు వచ్చినా చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఒప్పందాలను అడ్డం పెట్టుకుని ఆయనపై చర్య తీసుకునేందుకు వచ్చిన లడ్డూ లాంటి అవకాశాన్ని టీడీపీ అధినేత, వైసీపీ బద్ధవ్యతిరేకి చంద్రబాబు ఎందుకు వదిలేసుకుంటున్నారు? లాంటి ప్రశ్నలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశమయ్యాయి.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో అనుచిత లబ్ధి పొందేందుకు భారీగా లంచాలు చెల్లించారన్న అభియోగాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, అజూర్ పవర్ సంస్థ పూర్వ గ్లోబల్ డైరెక్టర్ సిరిల్ కేబనీస్ తదితరులపై అమెరికాలో దాఖలైన క్రిమినల్, సివిల్ కేసుల విచారణను ఒకే జడ్జికి అప్పగిస్తూ న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తెలుగు మీడియా చర్చోపచర్చలు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో భారత ప్రభుత్వ సంస్థ- సౌర ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI)తో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) కుదుర్చుకున్న పవర్ కొనుగోలు ఒప్పందాలను (PPAs) తక్షణమే రద్దు చేయబోమని, జగన్ పై తనకేమీ రాజకీయ కక్ష లేదని, వేధింపుల కోసం ఆయన్ను అరెస్ట్ చేసే ఉద్దేశం లేదని చంద్రబాబు చెబుతున్నారు.
గత ప్రభుత్వ తప్పిదాలకు సంబంధించిన తగిన సాక్ష్యాధారాలు లభించేవరకు చర్యలు తీసుకోకూడదనే నిర్ణయాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంది. అమెరికా కోర్టు గత నవంబర్ లో చెప్పినట్టు, అరబిందో అధినేత గౌతమ్ అదానీ, ఇతరులపై లంచం ఆరోపణలు వచ్చాయి.
అమెరికాలోని మూడు రాష్ట్రాలలో మూడు కేసులూ నమోదు అయ్యాయి. ఇవన్నీ ఒకే అంశానికి సంబంధించినవి కాబట్టి.. క్రిమినల్ కేసు విచారిస్తున్న యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ జడ్జి నికొలాస్ గరౌఫిస్‌కే వాటన్నింటి విచారణను అప్పగించినట్టు పీటీఐ వార్తా సంస్థ జనవరి 3న వెల్లడించింది. అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకునేలా అంగీకరింపజేసేందుకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు రూ.1,750 కోట్లు ఇవ్వజూపారన్నది గౌతమ్ అదానీ, సిరిల్ కేబనీస్ తదితరులపై అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ), అమెరికా దర్యాప్తు సంస్థలు మోపిన అభియోగం. తప్పుడు సమాచారంతో అమెరికాలో నిధులు సమీకరించి, దాన్ని లంచాలకు వెచ్చించారన్నది ఆరోపణ.
"గట్టి సాక్ష్యాలు లేకుండా ఒప్పందాల నుంచి వెనక్కి తగ్గలేం. భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుంది. సాక్ష్యాలు లభించే వరకు ఏ చర్యలు తీసుకోలేం. మరిన్ని సాక్ష్యాలు అవసరం. అమెరికాలో కేసు ఫలితం కోసం ఎదురు చూస్తున్నాం. సాక్ష్యాలు లభించినట్లయితే, తగిన చర్యలు తీసుకుంటాం," అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విలేకరులతో చెప్పారు.
YSRCP ప్రభుత్వం కుదుర్చుకున్న SECI ఒప్పందానికి సంబంధించిన ఫైళ్లను పరిగణనలోకి తీసుకుని, నాయుడు సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఈ ప్రకటన చేశారు.
జగన్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులకూ లంచాలు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ)ని ఉల్లంఘించారని, సెక్యూరిటీల కుంభకోణానికి పాల్పడ్డారని గౌతమ్ అదానీ, సిరిల్ కేబనీస్ సహా 8 మందిపై న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టులో అమెరికా ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్’ క్రిమినల్ కేసు నమోదు చేసింది. తప్పుడు సమాచారమిచ్చి నిధులు సమీకరించారంటూ గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపైనా, ఎఫ్‌సీపీఏ చట్టాన్ని ఉల్లంఘించారంటూ సిరిల్ కేబనీస్‌పైనా ఎస్‌ఈసీ వేర్వేరుగా సివిల్ కేసులు దాఖలు చేసింది. ఆ కేసులన్నింటికీ మూలం, జరిగిన లావాదేవీలు, చోటుచేసుకున్న పరిణామాలు ఒకటే కాబట్టి.. వాటిని కలిపి విచారించాలని ఎస్‌ఈసీ ఇటీవల న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టుకు పిటిషన్ సమర్పించింది. ఆ నేపథ్యంలో ఆ కేసుల విచారణను ఒకే జడ్జికి అప్పగిస్తూ న్యూయార్క్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అమెరికా కోర్టుల్లో కేసులు నమోదు అయిన తర్వాత కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచనలో పడ్డాయి. తమిళనాడు ప్రభుత్వం తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అయితే ఈ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం ఊగిసలాటలో పడింది.
ఈ ఆరోపణలు వచ్చిన తొలినాళ్లలో SECI ఒప్పందాన్ని 'సూత్రప్రాయంగా' రద్దు చేసి, కొత్త విధానాలపై పని చేయాలనే నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఒప్పందాల పరిశీలన తర్వాత ప్రభుత్వం వేచి చూద్దాం అనే ధోరణి అవలంబించింది. ఇందుకు ప్రధాన అవరోధాల్లో ఒకటి, తక్షణమే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నా PPAs ప్రకారం రూ.2,100 కోట్ల జరిమానా అదానీ కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆరు నెలల చెల్లింపులతో సమానం. ఆరు నెలల తర్వాత రద్దు చేసుకున్నా ఈ రూ. 2,100 కోట్ల జరిమానా అనివార్యం. అందువల్ల మరో 6 నెలలు వేచి చూడడానికే చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
నిజానికి, తన రాజకీయ ప్రత్యర్థి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు ఇది చంద్రబాబు నాయుడికి వచ్చిన 'సువర్ణావకాశం'. కానీ ఆయన అందుకు సిద్ధంగా లేడు. బహుశా దీనికి రకరకాల రాజకీయ సమీకరణాలు, జగన్ కు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల ఆశిస్సులు, అదానీ అండ ఉండడ వల్ల చంద్రబాబు వెనకాడుతుండవచ్చునన్న విమర్శలూ వచ్చాయి.
"SECI అంశంలో జగన్ పై చర్యలు తీసుకోవడానికి ఇదొక 'లడ్డూ' లాంటి ఛాన్సే. కానీ, ఇది రాష్ట్ర ప్రభుత్వ విశ్వసనీయతకు సంబంధించిన విషయం. పారిశ్రామిక వేత్తలు భయపడవచ్చు. అందువల్లే నేను ప్రతీకార రాజకీయాలు చేయను. తెలుగుదేశం పార్టీ (TDP)కి, వైఎస్ఆర్సీపీ మధ్య ఇదే తేడా," అని నాయుడు చెబుతున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం.
2021 డిసెంబర్ లో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ డిస్కంలు SECI తో 7000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం (PSA) కుదుర్చుకున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది పెద్ద కాంట్రాక్ట్. నవంబర్ లో అమెరికా కోర్టులో దాఖలైన కేసును బట్టి, గౌతమ్ అదానీ ఆనాడు జగన్ ప్రభుత్వంలోని ఒక 'ఉన్నతాధికారి'ని కలసి, డిస్కంలు SECI నుంచి విద్యుత్ కొనుగోలు చేయటానికి రూ. 1,750 కోట్ల లంచం ఆఫర్ చేసినట్లు చూపించారు.
అయితే, ఈ ఆరోపణలను వైఎస్సార్ సీపీ తోసిపుచ్చింది. డిస్కంలు, భారత ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాయని, బాగా తక్కువ ధరకే సౌర విద్యుత్ ఒప్పందం జరిగిందని, ఎటువంటి అవకతవకలకు, లంచాలకు అవకాశం లేదని ప్రకటించింది.