ఆంధ్రా కాంగ్రెస్ కూడా ఆకట్టుకుంటూ ఉందే...
కాంగ్రెస్ బలం పెరుగుతోందా.. అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు చేరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పెరుగుతోంది. ఎన్నికల నేపథ్యంలో బలం పెరగటంతో నాయకులు జోష్ తో కనిపిస్తున్నారు. ప్రతి రోజూ విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నాయకులు సమావేశాలతో బిజీగా ఉంటున్నారు. ఇప్పటి వరకు నీరసంగా ఉన్న క్యాడర్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. వైఎస్ షర్మిల రెడ్డి ఏసీసీసీ బాధ్యతలు తీసుకున్న తరువాత అన్ని విభాగాలను యాక్టివేట్ చేశారు. అనుబంధ సంఘాలు కూడా యాక్టివ్ అయ్యాయి. రాష్ట్ర మాజీ నాయకులు కొందరు నిత్యం పార్టీ కార్యాలయంలోనే ఉంటున్నారు. పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాకూర్ కూడా పార్టీ కార్యక్రమాలను నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
ఒక్కొక్కరుగా చేరికలు
15 రోజులుగా ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వైఎస్సార్సీపీలో టిక్కెట్లు రాని వారు, అసంతృప్తిగా ఉన్నవారు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటి వరకు ప్రధానంగా వైఎస్సార్సీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో చేరారు. తాము తిరిగి సొంతగూటికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
నందికొట్కూరు (ఎస్సీ) ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నియోజకవర్గం 2009 నుంచి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా మారింది. అంతకు ముందు ఎక్కువగా రెడ్లు గెలిచారు. ఆ తరువాత ఎస్సీల్లో ఒకరికి టిక్కెట్ తీసుకున్న వారు ఆ పార్టీకి రెండోసారి టిక్కెట్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతోందో అర్థం కావడం లేదని నాయకులు చెబుతున్నారు. ఆర్థర్ పోలీస్ అధికారి. రాజకీయాలపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. తిరిగి ఈ ఎన్నికల్లో సీటు ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ సీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో పార్టీలో చేరారు.
చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా కూడా ప్రభుత్వ అధికారి రాజకీయాలపై ఉన్న మక్కువతో వైఎస్ జగన్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో చింతలపూడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఎలిజాకు సీటు ఇవ్వలేదు. ఇందుకు వర్గరాజకీయాలు కారణం. ఆయన కూడా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంచి అధికారిగా పేరు వుంది. ఈయనను అమలాపురం పార్లమెంట్ కు పోటీ చేయాలని కోరినా వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.
పోలవరం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాడిసె దుర్గారావు కుమారుడు బాడిసె బొజ్జి షర్మిల సమక్షంలో పార్టీలో చేరారు. శ్రీకాళహస్తి టెంపుల్ మాజీ చైర్మన్ పోతుగుంట గురవయ్యనాయుడు కుమారుడు డాక్టర్ పోతుగుంట రాజేష్ కాంగ్రెస్లో చేరారు. రాజేష్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైద్యునిగా మంచిపేరు సంపాదించుకున్నారు. కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగల మురళీకృష్ణ కాంగ్రెస్లో చేరారు. నంద్యాల జడ్పీటీసీ సభ్యులు గోకుల్ కృష్ణారెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోలవరం నుంచి వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకురాలు దువ్వెల సృజన కాంగ్రెస్ లో చేరారు. ఆమెకు నియోజకవర్గంలో రాజకీయాలపై మంచి పట్టుంది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య కుమార్తె దారా పద్మజ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దారా సాంబయ్య ఎక్సైజ్ సూపరింటెన్ డెంట్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత బీజేపీలో చేరారు.
ఇలా ప్రతిరోజూ ఒకరిద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరుతూనే ఉన్నారు. పార్టీలో చేరాలనుకునే వారు స్థానిక నాయకులతో కలిసి నేరుగా విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి షర్మిల సమక్షంలోనే చేరుతున్నారు. వచ్చిన వారితో మాటా మంతీ కలుపుతూ షర్మిల కూడా వారిని ఆకట్టుకునే విధంగా ముందుకు సాగుతున్నారు.