గన్నవరం వైసీపీ సీటు వంశీకేనా?
వివాదాలకు కేరాఫ్ వల్లభనేని వంశీ. మరో ఫైర్ బ్రాండ్ కొడాలి నానికి మిత్రుడు. చంద్రబాబు.. లోకేష్‌పై ఒంటి కాలితో లేస్తారు. ప్రత్యుర్థులను విమర్శలు చేయడంలో దిట్ట.;
Byline : The Federal
Update: 2024-03-09 12:01 GMT
జి. విజయ కుమార్
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశికి వైఎస్‌ఆర్‌సీపీ సీటు దక్కుతుందా? తనకు సీటు దక్కుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నారు వంశీ. వైఎస్‌ఆర్‌సీపీ 11 సార్లు అభ్యర్థులను రకరకాలుగా వడపోసి ప్రకటించినా అందులో వంశీ పేరు లేదు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్‌ఆర్‌సీపీకి మద్ధతు పలికారు వంశీ. వైఎస్‌ఆర్‌సీపీలో చేరే వాళ్లు ఎవరైనా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావలసిందేనని మొదట్లోనే సిఎం జగన్ తేల్చి చెప్పారు. అయితే అధికారికంగా తాను వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించకుండా సీఎం జగన్‌తో మాట్లాడుకొని గత నాలుగేళ్లు వైఎస్‌ఆర్‌సీపీలోనే కొనసాగారు. నియోజక వర్గ ఇన్‌చార్జీగా వంశీనే ఉంటారని సిఎం ప్రకటించారు.
పార్టీకి దూరమైన వైఎస్సార్‌సీపీ నాయకులు
గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు వంశీ రాకను వ్యతిరేకించి చివరకు టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆయననే టీడీపీ అభ్యర్థి అయ్యారు. వంశీ రావడాన్ని వ్యతిరేకించి దుట్టా రామచంద్రరావు కూడా వైఎస్‌ఆర్‌సీపీ నుంచి వైదొలిగారు. వంశీ ప్రస్తుతం సీటు దక్కుతుందనే ఆశతో ఎదరు చూస్తున్నారు. జగన్ చేయించిన సర్వేలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయా లేవా? సర్వేలతో నాకెందుకని సీటు ఇస్తాడా లేదా అనే చర్చ కూడా నియోజక వర్గంలో తీవ్రంగా ఉంది. ఇటీవల జరిగిన పార్టీ ముఖ్య నాయకుల మీటింగ్‌లో ఇకపై పెద్దగా మార్పులు ఉండవని, ప్రస్తుతం ఉన్న వారే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని సిఎం ప్రకటించడంతో వంశీ తనకు సీటు తప్పకుండా వస్తుందనే ధీమాతో ఉన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఎంట్రీ
వల్లభనేని వంశీ తొలుత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చారు. విజయవాడ పార్లమెంట్ ఎంపిగా బరీలోకి దిగారు. 2009లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆం«ధ్ర ఆక్టోపస్‌గా పేరొందిన లగడపాటి రాజగోపాల్ చేతిలో వంశీ ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో వంశీకి 416,682 ఓట్లు వచ్చాయి. తర్వాత అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. గన్నవరం అసెంబ్లీ నియోజక వర్గానికి మారారు. ఇక్కడ నుంచి రెండు దఫాలుగా గెలుపొందారు. టీడీపీ అభ్యర్థిగా 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నుంచి విజయం సాధించారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు దుట్టా రామచంద్రరావుపై 2014లోను, యార్లగడ్డ వెంకట్రావుపైన 2019లో విజయం సాధించారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమి కావడం, వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధించి అధికారంలోకి రావడంతో ఆయన పార్టీని వీడారు. రెండు పర్యాయాలు టీడీపీ నుంచి గెలుపొంది అప్పటి వరకు కరుడు కట్టిన టీడీపీ నేతగా ఉన్న వంశీ వైఎస్‌ఆర్‌సీపీలోకి మారారు.