జగన్ పై రాయి వేసింది చిన్న పిల్లోడా?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన రాయిదాడి కేసులో పోలీసులు పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. ఓమైనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.

Update: 2024-04-16 13:37 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన రాయిదాడి కేసులో పోలీసులు పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు వంద మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన తర్వాత ఐదుగుర్ని కీలకంగా భావిస్తున్నారు. వీరిలో విజయవాడ అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన మైనర్ బాలుడు రాయి విసినట్టు చెబుతున్నారు.


18 ఏళ్ల లోపు యువకుడు కావడంతో అతని పేరు తెలిసినప్పటికీ చట్టం ప్రకారం పేరు రాయకూడదు. అందుకనే ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆ యువకుని పేరు రాయడం లేదు. అతని తల్లి చెప్పిన వివరాల ప్రకారం వాళ్లింటికి ఐదుగురు పోలీసులు వచ్చారు. మీ అబ్బాయి సొల్యుషన్ తాగినట్టు ఆరోపణలు వచ్చాయి. అందుకని ఆ అబ్బాయిని తీసుకువెళ్లి విచారించి వదిలివేస్తాం, మీరు (తల్లిదండ్రులు) ఆ అబ్బాయి ఆధార్ కార్డు తీసుకుని పోలీసు స్టేషన్ కి రండి. భయపడాల్సిన పనేమీ లేదు అని పోలీసులు చెప్పి తీసుకుపోయారు. పోలీసు విచారణ జరుగుతోంది.


ఇళ్ల పైకప్పుకు వాడే పెంకు ముక్కను ఆ మైనర్ జేబులో పెట్టుకుని సభకు వెళ్లినట్టు, ఆ పెంకును జగన్ పైకి విసిరినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మైనర్ తోపాటు ఇతర నలుగురు అనుమానితులు కూడా సీసీఎస్‌ పోలీసుల అదుపులో ఉన్నారు.


మూడు రోజుల కిందట జగన్ పై విజయవాడలో ఎవరో అకతాయి విసిరిన రాయికి ఆయన నుదిటిపై గాయం అయింది. హుటాహుటిన జగన్ ను ఆస్పత్రికి తరలించారు. నుదిటిపై గాయానికి ప్లాస్టర్ వేసి ప్రాధమిక చికిత్స అనంతరం ఇంటికి పంపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కోసం 8 బృందాలను ఏర్పాటు చేశారు. అనుమానితులుగా భావిస్తున్న వంద మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగుర్ని కీలకంగా భావిస్తున్నారు.
Tags:    

Similar News