ఈసారి వంతు మాజీ మంత్రి విడదల రజనీదేనా?
ప్రతికార రాజకీయాలతో రగిలి పోతున్న ఆంధ్రప్రదేశ్ లో ఈసారి వంతు గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజని కావొచ్చునంటున్నారు.;
By : The Federal
Update: 2025-03-04 07:56 GMT
ప్రతికార రాజకీయాలు, అరెస్టులు, జైళ్లు, బెయిళ్లతో రగిలి పోతున్న ఆంధ్రప్రదేశ్ లో ఈసారి వంతు గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజని కావొచ్చునంటున్నారు. బెదిరింపులు, అక్రమ వసూళ్ల కేసులో ఆమెను నిందితురాలిని చేసేలా ఫిర్యాదులు వస్తున్నాయి. ఆమెతో పాటు ఈ వ్యవహారంలో ఐపీఎస్ అధికారి పల్లె జాషువాపై కేసు పెట్టాలని ఓ స్టోన్ క్రషర్ ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలుచేశారన్న అభియోగాలతో వారిరువురిపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం ఏసీబీ తాజాగా సీఎస్ అనుమతి తీసుకుంది. విడదల రజనిపై విచారణకు అనుమతి కోసం గవర్నర్‌కు లేఖ రాసింది. గవర్నర్ నుంచి అనుమతి రావడంతోనే కేసు నమోదు చేయవచ్చునని భావిస్తున్నారు.
అసలేమిటీ కేసు..
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ ఉంది. ఆమె ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో చేరినపుడు స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్నది ఫిర్యాదు. దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇటీవల విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. మంత్రిగా ఉన్నప్పుడు రజనీ రూ.5కోట్లు డిమాండు చేసి.. రూ.2.20 కోట్లు వసూలు చేశారని, అందులో రజనికి రూ.2 కోట్లు, జాషువాకు రూ.10 లక్షలు, రజని పీఏకు రూ.10 లక్షలు చెల్లించారని సమాచారం. విజిలెన్స్ విభాగం నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. కేసు నమోదు కోసం అవసరమైన అనుమతుల్ని ఏసీబీ అధికారులు తీసుకుంటున్నారు.
‘‘2020 సెప్టెంబరు 4న విడదల రజని పీఏ రామకృష్ణ శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే పిలుస్తున్నారని యజమానులకు చెప్పారు. వారు ఆమెను కలిశారు. క్రషర్ కార్యకలాపాలు కొనసాగాలంటే పార్టీకి ఫండ్ ఇవ్వాలని అడిగారని, తక్షణమే ఇవ్వనందుకు గుంటూరు జిల్లా ఆర్‌వీఈవో (రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి)గా ఉన్న పల్లె జాషువా క్రషర్‌లో తనిఖీలు చేశారని, క్రషర్ లో అవకతవకలు ఉన్నాయని, రూ.50కోట్ల జరిమానా చెల్లించాలని యజమానులను బెదిరించారని’’ స్టోన్ క్రషర్ యజమాన్యం ఫిర్యాదు చేసింది.
మాజీ మంత్రి రజనీపై కేసు పెట్టిన స్టోన్ క్రషర్ యజమాని
కొన్నాళ్ల తర్వాత జాషువా ఫోన్‌చేసి ‘‘విడదల రజిని చెప్పినట్లు చేస్తారా? లేదా రూ.50 కోట్ల జరిమానా విధించి.. క్రషర్ సీజ్ చేసేయాలా?’’ అని బెదిరించారు. "జాషువా నుంచి ఒత్తిడి పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్టోన్‌క్రషర్ యజమానులు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసులు పెడతామని, వ్యాపారం మూయించేస్తామని" హెచ్చరించినట్టు యాజమాన్యం ఆరోపించింది. ఈ విషయాన్నే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రభుత్వానికి నివేదించింది. దీని ఆధారంగానే ఇప్పుడు ఏసీబీ రంగంలోకి దిగింది.
మరికొన్ని కేసుల్లోనూ రజనీ...
ఆమెపై ఇప్పటికే పలువురు కేసులు పెట్టారు. 2019కి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా పోలీసులు తనపై కేసు నమోదు చేశారని ఆమె వివరించారు. ఈ కేసు వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోసం ఆమె ఏపీ హైకోర్టులో కేసు వేశారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కట్టు కథ అల్లి మళ్లి తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడంటూ ఆమె ఆరోపించారు. ఓ వడ్డీ వ్యాపారికి డబ్బులు ఎగ్గొట్టారనే ఆరోపణలను కూడా ఆమె ఎదుర్కొంటున్నారు.