'కూటమి పొత్తు ధర్మానికి ' పరీక్షా సమయమేనా..!
కూటమిలో టీడీపీ-జనసేన మధ్య చిచ్చు రగలుకోనుందా? టీటీడీ బోర్డు ఏర్పాటుతో ఈ పరిస్థితి ఏర్పడిందా? తిరుపతి ఎమ్మెల్యే విషయంలో ఏమి జరిగింది?
By : The Federal
Update: 2024-11-03 10:47 GMT
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిపై సీఎం ఎన్. చంద్రబాబుకు స్పష్టమైన అవగాహన ఉంది. సభ్యుల ఎంపిక, కూర్పులో ఎక్కడా రాజీపడరు. విమర్శలకు ఆస్కారం ఇవ్వరు. అనేది చంద్రబాబును అభిమానించే వారి భావన ఇది. ఈసారి కూడా అధికారులను మాత్రమే ఎక్స్-అఫీషియో సభ్యులుగా పరిమితం చేశారు. బోర్డులో పార్టీల నేతలకు ఎక్స్-అఫీషియో సభ్యులుగా స్థానం ఇవ్వలేదు. దీంతో పునరావాసం కల్పించారనే అపవాదు, విమర్శకులకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదే ప్రస్తుతం సమస్యగా మారింది. మిత్రపక్షంలో భాగస్వామి అయిన జనసేన పార్టీ నుంచి ఆయన ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నారనేది చర్చకు తెరతీసింది.
టీడీపీపై జనసేన మమకారం
2024 జూన్ 11 : టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఎమ్మెల్యేలతో జరిగిన తొలిభేటీ అది. వేదికపై టీడీఎల్పీ నేత చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కూర్చుని ఉన్నారు. 164 మంది కూటమి ఎమ్మెల్యేలను ఉద్దేశించి జనసే చీఫ్ పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారు. సీఎం అభ్యర్థిగా చంద్రబాబు పేరును పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. ఎమ్మెల్యేల నుంచి కరతాళధ్వనులతో హాల్ ప్రతిధ్వనించింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యాలు అందరి హృదయాలను కదిలించాయి. టీవీల్లో, సోషల్ మీడియాలో ప్రసారమైన వీడియోలు చూసిన వారందరి కళ్ల నుంచి తెలియకుండానే ద్రవింపచేశాయి. ఆ సన్నివేశంలో..
"ఈయనను అని పవన్ కల్యాణ్ అనగానే.. చంద్రబాబు తన కుర్చీ నుంచి లేచి వచ్చారు. దగ్గరకు వచ్చిన చంద్రబాబు కుడి చేతిని పవన్ కల్యాణ్ తన చేతిలోకి తీసుకున్నారు. ఆ వెంటనే "ఈయనను నా పక్కన ఉంచుకునే మాట్లాడాలి. నలిగిపోయారు. చాలా నలిగిపోయారు. చెప్పడానికి మాటలు లేవు" అని పవన్ కల్యాణ్ అనడంతోనే చంద్రబాబు కూడా భావోద్వేగానికి లోనయ్యరనే విషయం ఆయన కళ్లలోకి చూసిన వారెవ్వరికైనా అర్థం అవుతుంది. పవన్ కల్యాణ్ నోటి నుంచి కాకుండా ఆ మాటలు ఆయన హృదయాంతరాల నుంచి తన్నుకు వచ్చాయి" అనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వీడియోలు చూసిన వారి మనస్సుల్లో పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు ఇంకా నేతలు, శ్రేణుల చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. విమర్శకులు కూడా అభినందించే విధంగా గుండెలను తాకాయనడంలో సందేహం లేదు.
ఈ మిత్రత్వానికి పరీక్షా సమయం..
జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హిందూత్వవాదాన్ని నెత్తికెత్తుకున్న తరువాత టీడీపీ కూటమికి పరీక్షా సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. దీనికి ప్రభుత్వం ఏర్పడిన తరువాత క్షేత్రస్థాయిలో మూడు పార్టీల శ్రేణులు ఎవరికి తోచిన తీరుగా వారు సాగుతున్నారనేందుకు అనేక సంఘటలు నిదర్శనంగా కనిపిస్తాయి. అందులో టీటీడీ పాలక మండలి నియామకం కూటమి మిత్రత్వానికి విషమ పరీక్షగా మారినట్లు కనిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిపాదించిన పేర్లకు సీఎం చంద్రబాబు ఓకే అన్నారు. అయితే, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విషయంలో మూడు పార్టీల మధ్య, ప్రధానంగా జనసేనతో విబేధాలు పొడచూపే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
ఎందుకంటే...
టీటీడీ పాలక మండలిలో సభ్యులతో పాటు తుడా (Tirupati Urban Development Authority) చైర్మన్ తోపాటు తిరుపతి ఎమ్మెల్యేకి కూడా ఎక్స్ అఫీషియో సభ్యత్వం ఉంటుంది. ఈ పద్ధతి మొదటి నుంచి లేదు. అయిన వారి కోసం దివంగత సీఎం వైఎస్ఆర్, ఆ తరువాత ఆయన కొడుకు వైఎస్. జగన్ ఈ పద్ధతులు అమలు చేశారు. అందులో..
2004లో దివంగత సీఎం వైఎస్ఆర్ ఈ పద్ధతికి పురుడు పోశారు. అప్పటి తుడా చైర్మన్ గా నియమితులైన తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కోసం వైఎస్ఆర్ ప్రభుత్వం అప్పట్లో జీఓ జారీ చేసింది. దీంతో క్యాబినెట్ ర్యాంక్ ఉన్న తుడా చైర్మన్ టీటీడీ పాలక మండలిలో సభ్యుడయ్యారు. ఆ తరువాత
2019లో వైసీపీ ప్రభుత్వం రాగానే మాజీ సీఎం వైఎస్. జగన్ మరోకొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఇందులో తిరుపతి ఎమ్మెల్యేకి కూడా టీటీడీ పాలక మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యత్వం కల్పించారు. బోర్డు మీటింగులో వీరికి ఓటింగ్ హక్కు ఉండదు. తుడా చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యేకి దర్శనాలు, సిఫారసు లేఖలకు సంబంధించి ప్రొటోకాల్ మాత్రమే ఉంటుంది.
పునారావాసానికి బాబు వ్యతిరేకమా?
టీటీడీ వ్యవహారాల్లో మాత్రం పదవుల పునరావాసం కల్పించడానికి మొదటి నుంచి సీఎం ఎన్. చంద్రబాబు వ్యతిరేకంగానే ఉండేవారని చెబుతారు. సభ్యులను మినహా రాజకీయ నేతలకు ఉద్దరకు టీటీడీలో పదవులు ఇవ్వలేదని చెబుతారు. అందులో భాగంగానే తాజాగా టీవీ5 బీ. రాజగోపాల్ నాయుడు (బీఆర్ నాయుడు) సారధ్యంలో టీటీడీ బోర్డు ఏర్పాటు చేశారు. ఇందులో 25 సభ్యులను నియమించారు. వారితో పాటు పరిపాలనా వ్యవహారాలు, ప్రొటోకాల్ పాటిస్తూ, నలుగురు అధికారులను ఎక్స్-అఫీషియో సభ్యలుగా జీఓ జారీ చేశారు. అందులో
1. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
2.దేవాదాయ శాఖ కమిషనర్
3. టీటీడీ ఈఓ (Executive Officer)
4. తుడా చైర్మన్ (ఇంకా ఎవరినీ నియమించలేదు.
సభ్యులుగా నియమించారు. వీరందరితో కలిపి 29 మందితో బోర్డు ఏర్పాటైంది. ఈ నెల ఆరవ తేదీ తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకార ముహూర్తం కూడా ఖరారైంది. కాగా,
ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి?
2019 నుంచి తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న వారు టీటీడీ బోర్డులో ఎక్స్ - అఫీషియో సభ్యుడు అవుతారు. తాజాగా సీఎం చంద్రబాబు ఎంపిక చేసిన పేర్లతో జారీ అయిన జీఓలో ఎక్కడా తిరుపతి ఎమ్మెల్యే ప్రస్తావన లేదు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా జనసేన నుంచి గెలిచిన ఆరణి శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పేరు జీఓలో లేకపోవడం రాజకీయంగా చర్చ జరుగుతోంది. తిరుపతి ఎమ్మెల్యేకు ప్రాతినిధ్యం కల్పించాలంటే, అందుకోసం మళ్లీ జీఓ జారీ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఇది కూడా రద్దు బాటలోనేనా?
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ అమలు చేసిన అనేక పథకాల పేర్లు మార్చారు. వారి కాలంలో అనుసరించిన అనేక పద్ధతులకు స్వస్తి చెబుతున్నారు. ఆ కోవలోనే మాజీ సీఎం వైఎస్. జగన్ ప్రభుత్వంలో తిరుపతి ఎమ్మెల్యే టీటీడీ బోర్డులో కల్పించిన ఎక్స్-అఫీషియో హోదాకు తిలోదకాలు ఇస్తారా? దీనిపై సీఎం ఎన్. చంద్రబాబు తీసుకునే నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నారు. ఇది కాస్త కూటమిలో చర్చకు తెరతీసింది. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మద్దతుదారులు కూడా నిరాశకు గురవుతున్నారు. ఇది కూటమి మిత్రత్వంపై ఎలాంటి ప్రభావం చూపనుంది. అనే విషయాలపై రెండు పార్టీల్లో చర్చించుకుంటున్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పట్టుబడతారా? అనేది కూడా ఆసక్తికరందా మారింది. ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఆయన చేసిన వ్యాఖ్య ప్రస్తావనార్హం.
"పదవులపై చాలా మందికి ఆశలు ఉన్నాయి. అందరూ చైర్మన్ పదవులే అడుగుతున్నారు" అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. టీడీపీ పెద్ద పార్టీ అందువల్ల "మా పరిస్థితి ఏమిటని సీఎం చంద్రబాబు అడిగితే, నేనేమి సమాధానం ఇవ్వగలను" అని పార్టీ నేతల ముందు ఓ ప్రశ్న వదిలారు. "మీరందరూ నా గుండెల్లో ఉంటారు. ఎవరికి ఏమి చేయాలో ఆ సమయంలో అది జరుగుతుంది " అని ఊరడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా 25 మంది బోర్డు సభ్యుల్లో జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిపాదించిన ముగ్గురికి అవకాశం దక్కింది. దీనివల్ల తిరుపతి ఎమ్మెల్యే కూడా ఎక్స్-అఫీషియో సభ్యుడు కావడానికి పవన్ కల్యాణ్ పట్టుబట్టగలరా? దీనికి సీఎం చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే. బోర్డు కొలువుదీరిన తరువాత కూడా మధ్యంతరంగా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.