Gas leak at pharma company | 'మిత్రాగ్ని పౌడర్' వాయువు ప్రాణాంతకమా?
ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ అయింది. పది మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆలస్యం వెలుగు చూసింది.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-01-06 05:45 GMT
ఓ హెర్బల్ కంపెనీలో బాయిలర్ నుంచి వెలువడిన మిశ్రమ వాయువు పీల్చిన సుమారు 20 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ గుట్టుచప్పుడు కాకుండా, ఆస్పత్రులకు తరలించారు. యాజమాన్యం కూడా సకాలంలో స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది. పరిశ్రమలో భద్రతా ప్రమాణాల లోపం వల్ల ఇలా జరిగిందనేది ప్రధాన ఆరోపణ చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాలు ఇవి.
సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలంలోని "లక్కీ ఫోర్ హెర్బల్ ఫార్మ కంపెనీ"లో శనివారం అర్థరాత్రి గ్యాస్ లీకేజీ జరిగింది. బాయిలర్ నుంచి వెలువడిన మిశ్రమ వాయువులు పీల్చి 20 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ సంస్థ యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా కార్మికులను పుత్తూరులోని ప్రైవేట్ ఆసుత్రికి తరలించి చికిత్స అందించారు.
లక్కీ ఫోర్ హెర్బల్ ఫార్మాసిటికల్స్ పరిశ్రమలో "మిత్రాగ్ని అనే ఆకు" పౌడర్‌గా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. 60 మంది కార్మికులు. పది మంది కార్యాలయ సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రోజుకు ఒకో షిప్టులో 20 మంది కార్మికులు విధుల్లో ఉంటారని సమాచారం. అందులో భాగంగా కార్మికులు విధుల్లో ఉండగా, శనివారం రాత్రి 11 గంటల సమయంలో బాయిలర్‌లో వ్యర్థాలు బయటకు వచ్చే వాల్వ్ ప్రమాదవశాత్తూ తెరుచుకుంది. దీంతో చాంబర్‌లోని ఆకుపొడి మిశ్రమం బయటకు వెదజల్లింది. అక్కడే పనిచేస్తున్న20 మంది కార్మికులు పొడిని పీల్చడంతో 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని పుత్తూరు సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. కోలుకున్న ముగ్గురిని రాత్రి డిశ్చార్జ్ చేయగా మరో ఏడు గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత కార్మికులకు ఎలాంటి ప్రమాదం లేనట్లు సమాచారం.
స్థానిక పోలీసులు, రెవెన్యూ, వైద్యాధికారులు ఆదివారం సాయంత్రం ఫ్యాక్టరీని సందర్శించి విచారించారు. హెర్బల్ మెడిసన్ తయారీకి వాడే మిశ్రమాన్ని పీల్చడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగదని మండల వైద్యాధికారి దర్శిత్‌రాజ్ తెలిపారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఫార్మా కంపెనీ యాజమాన్యం తెలిపింది.
ప్రమాదాన్ని కప్పిపెట్టే యత్నం
జరిగిన ప్రమాదాన్ని ఆ పరిశ్రమ దాచిపెట్టే ప్రయత్నం చేసిందనే ఆరోపణలు వినిపించాయి. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరిలించింది. వేపగుంట క్రాస్ వద్ద ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించి వైద్యం అందించారు. బాధితులంతా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారుగా సమాచారం. సంస్థ హెచ్ ఆర్ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకోవడం వల్ల అనేక సందేహాలకు ఆస్కారం కల్పంచారు.
"ఎన్నిసార్లు సంప్రదించాలని ప్రయత్నించినా హెచ్ఆర్ సెల్ ఫోన్ స్విచాఫ్ వచ్చింది" అని ఆ ప్రాంత జర్నలిస్టు శ్రీధర్ చెప్పారు. "పరిశ్రమ లోనికి కూడా అనుమతించలేదని, అస్వస్థతకు గురైన వారిలో నారాయణవనం ప్రాంతానికి చెందిన ముగ్గురు కార్మికులు కూడా ఉన్నారు" అని శ్రీధర్ చెప్పారు. ఇదిలా ఉండగా,
ఇదే తరహా పరిశ్రమలు, హైదరాబాద్, చెన్నైలో కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. యాజమాన్య ప్రతినిధులు స్థానికంగా పొరుగు రాష్ట్రాల్లోనే ఉంటారని తెలిసింది.
"చివరాఖరికి అస్వస్థతకు గురైన కార్మికులు కోలుకున్న తరువాత, డిశ్చార్జి చేయడానికి కూడా ఆ పరిశ్రమ సిబ్బంది ఇబ్బందికి గురయ్యారు" అని శ్రీధర్ చెబుతున్నారు. కాగా, పరిస్థితులు చక్కబడే వరకు పరిశ్రమలో తాత్కాలికంగా పనులు నిలుపుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.