అమరావతిలో పనుల కంటే ప్రచారం ఎక్కువైందా?
ఏపీ ప్రభుత్వం ఆరు నెలలుగా రాజధాని అమరావతి నిర్మాణాలపై కసరత్తు చేస్తోంది. అయితే పనులు మొదలు కాకుండానే ప్రచారం ఎక్కువైందనే విమర్శ వచ్చింది.
ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ఇంకా మొదలు కాలేదు. ప్రచారం మాత్రం కొండంతలుగా ఉందని చర్చ జరుగుతోంది. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రచార బాధ్యతలు చంద్రబాబు తీసుకుంటే ఇప్పుడు నారాయణ తీసుకున్నారనే చర్చ మొదలైంది. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే అమరావతిలో రాజధాని నిర్మాణ పనులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మూడు నెలల కాలం గత టీడీపీ ప్రభుత్వంలో రూపొందించిన ప్రతిపాదనలపై చర్చలు జరిగాయి. అవే ప్రతిపాదనలు అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన మూడు నెలల కాలం ప్లానింగ్, నిధుల సమీకరణపై చర్చించారు.
నిత్యం ఏదో ఒక సమయంలో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ మంత్రి పి నారాయణ సీఆర్డీఏ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదట ఒక నెల పూర్తిగా రాజధాని ప్రాంతంలో తిరగటానికి సమయం పట్టింది. అప్పట్లో వర్షాకాలం కావడంతో జంగిల్ క్లియరెన్స్ సరిగా జరగలేదని, ప్రత్యేకించి సుమారు 25 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి రోడ్లు, భవనాలు నిర్మించాలనుకునే ప్రాంతాలు, సచివాలయం, హైకోర్టు వంటి భవన నిర్మాణాల స్థలాల్లో ఉన్న సర్కారు తుమ్మ చెట్లను తొలగించారు. ఇంకా చాలా చోట్ల పిచ్చి చెట్లు ఉన్నాయి.
ప్రభుత్వం అధికారం చేపట్టగానే వర్షాలు పడటంతో కొండవీటి వాగు నుంచి వచ్చే వరద నీరు అమరావతి ప్రాంతంపైకి రాకుండా చర్యలు తీసుకునేందుకు మంత్రి నారాయణ పలు ప్రాంతాల్లో పర్యటించారు. వరదనీటిని నిలువ చేసేందుకు ఆరు ప్రాంతాల్లో ఆరు చెరువులు నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేయించారు. ఎన్ని వరదలు వచ్చినా వరద నీరు చెరువుల్లో నిల్వ ఉంటుందని, మిగిలిన నీరు కొండవీటి వాగు ద్వారా కృష్టానదికి చేరుతుందని చెప్పారు. సింగపూర్ కన్సార్టియం వాళ్లను పిలిపించి సచివాలయ నిర్మాణంపై పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఇందుకోసం వారికి ప్రత్యేకించి కొంత మొత్తం చెల్లిస్తారు.
అమరావతి రాజధానికి సంబంధించి ట్రంక్ రోడ్లు, లేఅవుట్‌లు, ఐకానిక్ భవనాల నిర్మాణాలకు రూ.24,276 కోట్లకు ఆమోదం లభించింది. ఇప్పటి వరకు జరిగిన 4 సీఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో మొత్తంగా రూ.45,249.24 కోట్లకు ఆమోదం లభించింది. అసెంబ్లీని 103 ఎకరాల్లో.. 250 మీటర్ల ఎత్తులో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు లేని మిగతా రోజుల్లో ప్రజలు అసెంబ్లీ భవనంపై నుంచి రాజధానిని తిలకించే సౌకర్యం కూడా కల్పిస్తారు.
హైకోర్టు భవనాన్ని 20.32 లక్షల చదరపు అడుగులు, 42 ఎకరాల్లో 55 మీటర్ల ఎత్తున 8 అంతస్తుల్లో రూ.1048 కోట్లతో నిర్మించనున్నారు. జీఏడీ (పరిపాలన) భవనాన్ని 17.03 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 47 అంతస్తులతో సిద్ధం చేస్తారు. దీంతోపాటు మొత్తం 5 టవర్లతో కూడిన వివిధ భవనాలు 68.88 లక్షల చదరపు అడుగులలో రూ.4,688 కోట్లతో నిర్మిస్తారు. మౌలిక సదుపాయాల్లో భాగంగా 4 ప్రధాన రహదారులు, ఇతర సౌకర్యాల కోసం 579.5 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధికి రూ.9,699 కోట్లు మంజూరు అయింది. ట్రంకు రోడ్లకు రూ.7,794 కోట్లకు, ఎస్టీపీ (సెకండరీ ట్రీట్‌మెంట్ ప్లాంట్) పనులకు రూ.318 కోట్లు మొత్తంగా రూ.24,276 కోట్లకు ఆమోదం లభించినట్లు మంత్రి నారాయణ చెప్పారు.
ఇప్పటి వరకు చెప్పినవి బాగానే ఉన్నా ఇంకా ఎటువంటి పనులు రాజధానిలో మొదలు కాలేదు. గతంలో నిర్మించిన భవనాల మరమ్మతులు, వాటికి పెయింట్ వేసే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. డిసెంబరు నెలాఖరు లోపు టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుందని మంత్రి నారాయణ చెప్పారు. ఇటీవల విద్యుత్ స్తంభాల ఏర్పాటు, విద్యత్ తీగలు లాగే పనులు మొదలు పెట్టారు.
రోడ్ల పనులు మొదలైతే కాని రాజధాని ప్రాంతానికి రూపు రేఖలు రావు. ఇప్పటికే రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 15వేల కోట్లు అప్పు ఇప్పిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం హడ్కో నుంచి రూ. 11వేల కోట్లు అప్పు తీసుకోనుంది. అలాగే జర్మనీకి చెందిన కెఎఫ్ డబ్ల్యు బ్యాంక్ నుంచి రూ. 5వేల కోట్లు అప్పుగా తీసుకోనున్నారు. మొత్తం 45 పనులు చేపట్టేందుకు రూ. 33 వేల కోట్లకు రాష్ట్ర క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. మొత్తంగా రూ. 48వేల కోట్లకు టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రధానంగా సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ఐదు ఐకానిక్ భవనాల నిర్మాణాలు చేపడితే కాని పనులు మొదలైనట్లగా భావించొచ్చు. టెండర్ల ప్రక్రియలోనే ఉన్నప్పుడు రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతోందనే ప్రచారం మొదలైంది. రాజధాని కోసం పూలింగ్ కు తీసుకున్న భూములు కాకుండా పూలింగ్ కు బయట ఉన్న భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గజం భూమి రూ. 70 నుంచి 90వేల వరకు పలుకుతోంది. రాజధాని కట్టడాలపై నిత్యం జరుగుతున్న ప్రచారం వల్ల చుట్టుపక్కల భూముల ధరలు అమాంతం పెరగటం, ఇళ్ల స్థలాల కోసం భూములు కొనుగోలు చేసుకునే వారు ఇబ్బందులు పడటం పరిపాటిగా మారింది. ప్రచారం తగ్గించి పనుల్లో వేగం పెంచితే బాగుంటుందనే అభిప్రాయం పలువురి నుంచి వ్యక్తమవుతోంది.