గూడూరు పేరుకే ఎస్సీ నియోజకవర్గం.. పెత్తనం మాత్రం రెడ్లకేనా?

గూడూరు ఎస్సీ నియోజకవర్గంలో రెడ్ల హవా కొనసాగుతుందా? ఈ నియోజకవర్గం నుండి ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన నాయకులు ఉన్నప్పటికీ అభివృద్ధి శూన్యమా?;

Update: 2024-04-17 11:03 GMT

గూడూరులో ఖనిజ సంపద, ఇసుక, గ్రావెల్ ఇలా సహజ సంపదలను నాయకులతో పాటు అధికారులు కలిసి ఇతర రాష్ట్రాలకు అమ్మకాలు కొనసాగిస్తున్నారా? మొదటినుండి గ్రూప్ రాజకీయాలు ఉండడంతో అభివృద్ధికి నోచుకోలేదంటున్నారా? నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలు అభివృద్ధిలో వెనక పడడానికి కారణాలు ఇవేనా? గూడూరు అంటే పూర్వ కాలంలో తిరుపతి వెళ్లాలంటే ఎడ్లబండ్లు, గుర్రపు బండ్లపై వచ్చేవారు. అలా వచ్చి గూడూరులో గుడారాలు వేసి కొన్ని రోజులు ఉండి సేదతీరేవారంట. అందుకనే కాలక్రమంలో గుడారాలు కాస్తా గూడూరుగా మారిందని అంటారు.

గూడూరు నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఉంది, గనుల నుంచి లభించే ఖనిజాలు ఒకవైపు...రైతులు ఎంతో శ్రమించి పండించే నిమ్మకాయల పంట మరోవైపు.. ఈ రెండు అంశాలు ఈ ప్రాంతానికి ప్రధాన ఆర్థిక వనరులు ఇక గూడూరు రైల్వే జంక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాష్ట్రంలోనే ప్రధానమైన రైల్వే జంక్షన్‌లలో ఇది ఒకటి,,, చెన్నై వెళ్లే దారిలో ఒక ప్రధాన రైల్వే జంక్షన్ కూడా ఖనిజమానులు పుష్కలం గ్రామీణ వ్యవసాయ ఆధారిత ప్రాంతం కూడా నిమ్మకాయలు తదితర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి ఈ జంక్షన్ పోషిస్తుంది. ఇక్కడ నుండి పలు రాష్ట్రాలకు ఎగుమతులు జరుగుతున్నాయి.

1952లో గూడూరు నియోజకవర్గం ఏర్పడింది. ఇది ఎస్సీ రిజర్వుడుగా ఉంది. ఇప్పటివరకు 15 సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 6 సార్లు, తెలుగుదేశం 4 సార్లు, వైసీపీ 2 సార్లు, స్వతంత్రులు 3 సార్లు విజయం సాధించారు. తెలుగుదేశం ఇక్కడ 4 సార్లు గెలిచింది. అన్ని సార్లు కూడా బల్లి దుర్గా ప్రసాద్ విజయం సాధించడం విశేషం. 1994లో చంద్రబాబు మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. తర్వాత క్రమంలో 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి తిరుపతి నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు.

నియోజకవర్గంలో కోట, గూడూరు, చిట్టమూరు, చిల్లకూరు, వాకాడు మండలాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 40 వేల 425 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1 లక్షా 17 వేల 018 మంది ఉంటే, మహిళా ఓటర్లు 1 లక్షా 23 వేల 372 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో వెలగపల్లి వర ప్రసాదరావుకి 1 లక్షా 09 వేల 759 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థికి 64 వేల 301 ఓట్లు వచ్చాయి. 45 వేల 459 ఓట్ల మెజార్టీతో వెలగపల్లి విజయం సాధించారు. అంతకుముందు ఆయన ఐఏఎస్ అధికారిగా పని చేశారు.

తన పదవీ కాలానికి ముందే రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీలో చేరారు. ఎంపీగా తిరుపతి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వైసీపీ నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు. తర్వాత 2019లో గూడూరు నుంచి పోటీ చేసి వైసీపీ ఎమ్మెల్యే అయ్యారు. 2024కి వచ్చేసరికి సీఎం జగన్ సీటు ఇవ్వలేదు. దీంతో ఆయన ముందు జనసేనలో చేరారు. అక్కడ అవకాశం లేకపోవడంతో బీజేపీలోకి చేరారు. మళ్లీ తిరుపతి ఎంపీ సీటుని సంపాదించారు. ఇప్పుడు బరిలో నిలిచారు.

2024లో వైసీపీ నుంచి బరిలో మేరుగ మురళీ నిలుచున్నారు. అతనికి పోటీగా తెలుగుదేశం నుంచి పాత అభ్యర్థి పాసం సునీల్ కుమార్ బరిలో ఉన్నారు. ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ కి సీటు ఇవ్వలేదు. కారణం ఏమిటంటే ఆయన ఒంటెద్దు పోకడలే కారణమని తేలింది. సీనియర్లను పక్కనపెట్టడం. కొత్త ముఖాలను తెరపైకి తీసుకురావడం, వేదికలు ఎక్కించడం, వారితో మాట్లాడించడం చేశారనే విమర్శలున్నాయి. నేను ఎంపీగా గెలిచాను, ఎమ్మెల్యే అయ్యాను...నాకేంటి? అనేరీతిలో ఆయన రేంజ్ ఉండేసరికి నెమ్మదిగా సెగ తాడేపల్లి వరకు వెళ్లింది. సైలంట్ గా ఆయన్ని తీసి పక్కనపెట్టి మేరుగ మురళీకి సీటు ఇచ్చారు.

2014 ఎన్నికల్లో వైసీపీకి షాప్ తగిలింది. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కి ఆశపడి అటు వెళ్లిపోయారు. 2019లో తెలుగుదేశం టికెట్టుతో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు 2024లో కూడా సీటు దక్కింది. అయితే ఆయన ఓడిపోయినప్పటికి మూలన కూర్చోకుండా, ఎప్పుడో ఐదేళ్ల తర్వాత ప్రజల వద్దకు వెళ్లడం లాంటివి చేయకుండా ఈ కాలమంతా ప్రజల మధ్యలోనే గడిపారు. ఒకరకంగా చెప్పాలంటే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికి ప్రజలు తెలుగుదేశం నుంచి ఓడిపోయినా తన దగ్గరకే వచ్చేలా చేసుకున్నారు. అంతేకాదు లోకల్ అభ్యర్థి కావడం తనకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. అందువల్ల ఈసారి గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు.

గూడూరు నుంచి గెలుపొందిన రాజకీయ నేతలు పలుకీలక పదవుల్లో పనిచేశారు. రాజకీయాలను మలుపు తిప్పడం, నెల్లూరు పెద్దారెడ్డి గా పేరు తెచ్చుకొని గూడూరు నియజకవర్గం రాజకీయాల నుండి సీఎం వరకు వెళ్లిన నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ఒకరు. 1955లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపాలకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఈ నియోజకవర్గంలో ఎస్సీలకు కేటాయించడంతో 1967, 1972లో మాత్రం ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచారు, ఆ తర్వాత 1978ఈ నియజకవరం ఎస్సీ కేటాయించారు.

గూడూరు నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో అక్రమ సిలికా తవ్వకాలను పరిశీలించారు. . ఇది గూడూరు నియోజకవర్గం బల్లవోలు సమీపంలో వైసీపీ దొంగల అక్రమ సిలికా శాండ్ తవ్వకాలు అని తెలిపారు. సోన కాల్వలు నాశనం చేసి అక్రమ మైనింగ్ చేస్తూ జగన్ అండ్ కో రూ.5 వేల కోట్ల దోపిడీకి తెరలేపిందని ఆరోపించారు. "గూడూరు నియోజకవర్గం బల్లవోలు సమీపాన సముద్ర తీర ప్రాంత భూములకు ఎటువంటి సాగునీటి సౌకర్యం అందుబాటులో లేదు. తెలుగుదేశం హయాంలో ఇక్కడి రైతులు డ్రిప్ స్ప్రింకర్లు ఏర్పాటుచేసి వేరుశనగ పంట పండించడం విశేషం.

గూడూరులో నిమ్మకాయల వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద నిమ్మ మార్కెట్‌లలో గూడూరు కూడా ఒకటిగా ఉంది. చెన్నూరు మార్గంలో గూడూరు పట్టణంలో నిమ్మ మార్కెట్ ఉంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల రైతులు ఎక్కువగా నిమ్మచెట్లను సాగు చేసేందుకు ఇష్టపడతారు. వారు దేశవ్యాప్తంగా, ఇతర దేశాలకు కూడా నిమ్మకాయలను ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తారు.

గూడూరులో విజయవంతమైన వ్యాపారంలో ఆక్వాకల్చర్ కూడా ఒకటిగా చెప్పాలి. చుట్టుపక్కల అనేక రొయ్యల చెరువులు ఉన్నాయి. సాధారణంగా రెండు ప్రధాన రకాల రొయ్యలు ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. అవి స్కాంపి, టైగర్ రొయ్యలు. ఈ ప్రాంతంలో నీరు, వాతావరణం ప్రధానంగా ఈ రెండు రకాలకు అనుకూలంగా ఉంటాయి. గూడూరు నుండి భారతదేశం, కొన్ని ఇతర దేశాలకు రొయ్యలు ఎగుమతి అవుతుంటాయి.

భారతదేశంలోనే రెండో అతిపెద్ద మైకా గనులు గూడూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. బీహార్ మైకాకు క్వాలిటీ మంచిదై విలువ వస్తే, గూడురు మైకా పరిమాణంలో పెద్దదిగా ఉండటం వల్ల విలువ వచ్చింది. స్వాతంత్రం నాటికి 71 గనులను గుర్తించారు. మైకా వల్ల ఉపయోగాలేమిటంటే ఎల‌క్ట్రానిక్/విద్యుత్‌ పరిశ్రమలకు ఆభ్రకం తప్పనిసరిగా కావాలి. స్టౌవులు, గ్యాస్ బర్నర్లు, లాంతర్లు, అంతరిక్ష నౌకల్లో దీనిని వాడతారు. గూడూరు ప్రాంతంలో లభించే గ్రీన్, రూబీ రకాల మైకాకు 800 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడిని తట్టుకోగల శక్తి ఉంది. మైకాను ప్రధానంగా విద్యుత్ పరిశ్రమల్లో వినియోగించే పరికరాల తయారీలోను, అణుపరీక్షలు, రియాక్టర్లలోను వినియోగిస్తుంటారు. మైకా ఖనిజాన్ని 1885లో నెల్లూరు జిల్లా సైదాపురం ప్రాంతంలో జర్మనీ దేశస్తులు గుర్తించి అప్పుడే షామైన్ అనే పేరుతో గనుల తవ్వకాన్ని ప్రారంభించారు. సైదాపురం ప్రాంతాలలో 143కి పైగా గనుల్లో మైనింగ్ జరుగుతూ 30 వేల మందికి ఉపాధి లభిస్తుండేది. కాలక్రమంలో మైకా గనుల ప్రభావం తగ్గి ఉపాధి పొందే వారి సంఖ్య తగ్గి 10వేల మందికి పరిమితమైంది.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండో అతిపెద్ద పట్టణం గూడూరు. ఇక్కడ అతిపెద్ద రైల్వే జంక్షన్ ఉంది. చెన్నయ్ కి వెళ్లే రైళ్లన్నీ ఇటు నుంచి వేరే మార్గం ద్వారా వెళతాయి. తిరుపతి, బెంగళూరు వెళ్లేవి ఒక మార్గంలో వెళతాయి. నిమ్మ, మిర్చి రైతులకు ఇది వరప్రసాదం అని చెప్పవచ్చు. దేశంలోని ఏ ప్రాంతానికైనా ఇక్కడి నుంచి సులువుగా సరఫరా చేయవచ్చు. మైకా పరిశ్రమకు గూడూరు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. గూడూరులో ప్రాచీన వెంకటేశ్వర స్వామి ఆలయాలున్నాయి.

గూడూరు నియోజక వర్గం పేరుకు మాత్రమే ఎస్సీ నియోజకవర్గమైనప్పటికీ దశాబ్దాలుగా ఎస్సీలు పేదరికంలోనే మగ్గుతున్నారు. విద్య ఉపాధి సౌకర్యాలు లేక పేదరికంలో అలమటిస్తున్నారు. రహదారులు అధ్వానంగా ఉన్నాయి. గ్రామాల్లోకి వెళ్లే దారులైతే మరీ దారుణంగా ఉన్నాయి. ఇక మంచినీటి సమస్యలు ఉన్నాయి. వేసవి వస్తే, నీటి కష్టాలు మరింత పెరుగుతాయి. మౌలిక సౌకర్యల కల్పనలో ఒక్క వైసీపీ ప్రభుత్వమనే కాదు, అంతకు ముందు తెలుగుదేశం, అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు అందరూ గూడురు ప్రజలకు అన్యాయమే చేశారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News