ఎన్టీఆర్ జిల్లాలో పోలింగ్ పెరగడానికి అదే కారణమా?
గత రెండు ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం.
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో గతంలో ఎన్నడు లేని విధంగా ప్రజలు ముందుకు వచ్చి తమ ఓటును వినియోగించుకున్నారు. గత రెండేళ్లతో పోల్చితే ఈ సారి ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగానే పెరిగింది. జిల్లాలోని విజయవాడ వంటి పలు ప్రాంతాల్లో అర్థ రాత్రి వరకు క్యూలో ఉండి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఏడు నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో 78.94 శాతం పోలింగ్ కాగా అంతకు ముందు జరిగిన 2014 ఎన్నికల్లో 77.28 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఈ రెండు ఎన్నికల కంటే ఎక్కువ శాతం పోలింగ్ 2024 ఎన్నికల్లో నమోదు కావడం గమనార్హం. సాయంత్రం ఆరు గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం దాదాపు 78.76 శాతం వరకు పోలింగ్ నమోదైంది. జిల్లాలో కొన్ని చోట్ల అర్థ రాత్రి వరకు పోలింగ్ కొన సాగింది. దీంతో పోలింగ్ శాతం ఇంకా పెరిగే చాన్స్ ఉంది. దాదాపు 83 శాతం వరకు నమోదయ్యే అవకాశాలు ఉంటాయని రాజీయ వర్గాలు అంచనా వస్తున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు తిరువూరు అసెంబ్లీ నియోజక వర్గంలో 79.28 శాతం, విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజక వర్గంలో 68.30, విజయవాడ సెంట్రల్‌లో 68.15, విజయవాడ తూర్పులో 69.11, మైలవరంలో 78, నందిగామలో 72.72 శాతం, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజక వర్గంలో 78.28 శాతం చొప్పున పోలింగ్ శాతం నమోదైంది.