రెడ్ల ఓట్ల కోసమేనా ఈ వ్యూహం?

ప్రకాశం జిల్లాలో రెడ్ల ఓట్లు చీలకుండా ఉంటాయా? వైఎస్‌ జగన్‌ వ్యూహం ఫలిస్తుందా? ప్రధానంగా మార్కాపురంలో గెలుపు ఎలా ఉంటుంది?

Update: 2024-02-20 10:51 GMT
ఏపీఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎంను కలిసిన జంకె వెంకటరెడ్డి, ఆయనతోపాటు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అన్నా రాంబాబు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో రెడ్ల సామాజిక వర్గం నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతకు సీఎం జగన్‌ చెక్‌ పెడుతున్నారా? ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు అవుననే సమాధానం చెబుతున్నాయి. రాజకీయ పరిశీలకులు కూడా ఈ అంశాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నారు.

పట్టించుకోని బాలినేని షరతులు..
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిల నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఈ వ్యతిరేకతను సద్దు మణిగించేందుకు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను రంగంలోకి దించారు. ఇటీవలే ఒంగోలు వ్యవహారం సద్దుమణిగింది. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తాను చెప్పిన వాళ్లకు జిల్లాలో పార్టీ సీట్లు ఇవ్వాలని పట్టుబట్టారు. అందులో మార్కాపురం సీటు ఒకటి. మార్కాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డికి సీటు తప్పకుండా ఇవ్వాలని సీఎం వద్ద ప్రతిపాదన పెట్టారు. జంకె వెంకటరెడ్డి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కావడం, సౌమ్యుడుగా పేరు ఉండటం, గెలుపుకు అవకాశాలు కూడా ఉండటంతో టిక్కెట్‌ కోసం బాలినేని పట్టుపట్టాడు. సీఎం సీటును వేరే వారికి ఇచ్చారు.
మాగుంట విషయంలో పట్టు వీడిన బాలినేని
ఎంపీ మాగుంటకు కూడా తిరిగి ఒంగోలు ఎంపీ సీటు ఇవ్వాలని సుమారు రెండు నెలలు పట్టుదలతో సీఎం క్యాంపు కార్యాలయానికి బాలినేని తిరిగారు. అయినా సీఎం జగన్‌ బాలినేనికి నచ్చజెప్పి ఎంపీ మాగుంటను పక్కనబెట్టారు. ఒక దశలో బాలినేని కూడా పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చారు. అయితే పార్టీలోని ముఖ్యులంతా పట్టుబట్టి ఆయనను ఒంగోలు నుంచి పోటీ చేసేలా ఒప్పించారు. ఒంగోలు ఎంపీ విషయం కానీ, మార్కాపురం ఎమ్మెల్యే టిక్కెట్‌ విషయం కానీ సీఎం జగన్‌కు వదిలేయాలని సూచించడంతో ఆయన అంగీకరించక తప్పలేదు. తాను ఎంతగానో చెప్పి చూశాను. మాగుంట విషయంలో సీఎం సీటు లేదని చెప్పారు. మార్కాపురం పరిస్థితి కూడా అదేనంటూ.. నానియోజకవర్గం వ్యవహారం మాత్రమే నేను చూసుకుంటానని చెప్పారు. నిజానికి బాలినేనికి కొన్ని నియోజకవర్గాలు అప్పగించి ఆ నియోజకవర్గాల్లో గెలుపు వ్యవహారం మీరే చూడాలని సీఎం చెప్పారు. అందుకు బాలినేని అంగీకరించలేదు. నేను చెప్పిన వారిని కాకుండా మీరు అనుకున్న వారిని అభ్యర్థులుగా పెట్టినందున నా నియోజకవర్గం వరకే తాను పరిమితమవుతానని సీఎంకు చెప్పి తప్పించుకున్నారు.
రెడ్ల ఓట్లు పక్కకు పోకుండా వ్యూహం
మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయ కర్తగా అన్నా రాంబాబును సీఎం జగన్‌ నియమించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ దారుడు అవుతాడు. ప్రస్తుతం మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న కె నాగార్జునరెడ్డిని గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పంపించి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురానికి మార్చారు. మార్పు వెనుక వారి ఆలోచనలు ఎలా ఉన్నా అన్నా రాంబాబు వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వల్ల వైఎస్సార్‌సీపీ రెడ్డి ఓట్లు చీలకుండా ఒక ప్లాన్‌ తీసుకున్నారు. పైగా జంకె వెంకటరెడ్డికి మార్కాపురం రూరల్, టౌన్, తర్లుపాడు మండలాల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు వెనుదన్నుగా ఉంటారు. ప్రస్తుత ఎమ్మెల్యే నాగార్జునరెడ్డికి మార్కాపురం చుట్టుపక్కల రెడ్ల ఓట్లతో పాటు కొనకనమిట్ల, పొదిలి మండలాల్లో కూడా పట్టు ఉంది. నాగార్జునరెడ్డి మామ మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి కొనకనమిట్ల మండలానికి చెందిన వారు కావడం వల్ల ఆ ప్రాంతంలోని ఓటర్లపై పట్టు ఉంది. అందువల్ల అన్నా రాంబాబు గెలుపుకు జంకె వెంకటరెడ్డి, నాగార్జున రెడ్డి మద్దతు తప్పకుండా కావాలి. అలాగే నాగార్జునరెడ్డి గెలుపుకు గిద్దలూరులో అన్నా రాంబాబు మద్దతు కావాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి వైఎస్సార్‌సీపీ వారు జంకెను బుజ్జగించి ఏపీఐఐసీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు.
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే సరే... లేకుంటే మూన్నాళ్ల ముచ్చటే..
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే జంకె వెంకటరెడ్డి పూర్తి కాలం ఏపీఐఐసీ అధ్యక్ష పదవిలో ఉంటారు. లేదంటే వదులుకోవాల్సిందే. పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. జంకె వెంకటరెడ్డి తండ్రి రాజకీయాల్లో రాణించారు. ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా కూడా సక్సెస్‌ఫుల్‌ లీడర్‌ అనిపించుకున్నారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చిన జంకె కూడా మంచి పేరు సంపాదించారు. అవినీతిని చాలా వరకు దగ్గరకు రానివ్వలేదు. రాజకీయాల వల్ల ఆస్తులు కూడా కొన్ని ఆయన పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయినా తొనకక బెనకక రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని వైఎస్సార్‌సీపీ నాయకుల్లో ఉన్న అసంతృప్తిని కొంత మేరకు తగ్గించడంలో జగన్‌ సక్సెస్‌ అయ్యారని చెప్పొచ్చు.
Tags:    

Similar News