రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చిన చంద్రబాబుపై ఐటీ కేసు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై 2020లో నమోదైన ఇన్ కం ట్యాక్స్ కేసు రాజ్యసభలో చర్చకు వచ్చింది. ఈ కేసు ఏమైందని రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.;
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఇన్ కం ట్యాక్స్ 2020 ఫిబ్రవరిలో నమోదు చేసిన కేసు ప్రస్తుతం ఏపీలో చర్చకు దారి తీసింది. అందరూ ఈ కేసును మరిచి పోయారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా 2020 ఫిబ్రవరిలో ఐటీ శాఖ చంద్రబాబు నాయుడు మాజీ పీఏ పెండ్యాల శ్రీనివాస్ ఇంటిపై, అలాగే టీడీపీకి సన్నిహితమైన కొన్ని ఇన్ఫ్రా కంపెనీలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ. 2,000 కోట్లకు పైగా నిధులు సిఫాన్ (నిధులను తప్పుదారి పట్టించారు) చేసినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు వార్తలు వచ్చాయి. బోగస్ సబ్ కాంట్రాక్టర్ల ద్వారా ఓవర్ ఇన్వాయిసింగ్ (Over Invoicing) అంటే ఒక వస్తువు లేదా సేవ వాస్తవ విలువ కంటే ఎక్కువ మొత్తాన్ని ఇన్వాయిస్‌లో (బిల్లులో) చూపించడం. దీన్ని సాధారణంగా ఆర్థిక లాభం పొందడానికి లేదా నిధులను తప్పుదారి పట్టించడానికి ఉపయోగిస్తారు. అందుకే నకిలీ బిల్లుల ద్వారా నగదు సృష్టించినట్లు ఐటీ శాఖ ఆరోపించింది.
ఈ నేపధ్యంలో 2023 ఆగస్టు 4న ఐటీ శాఖ సెంట్రల్ సర్కిల్ హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడుకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసులో రూ. 118 కోట్లు అప్రకటిత ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించారు. ఈ నిధులు శ్రీనివాస్ ద్వారా చంద్రబాబుకు చేరినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసులో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ గతంలో చంద్రబాబు నాయుడు, ఆయన సన్నిహితులపై దర్యాప్తు చేసింది. ఈ విషయంలో బోగస్ సబ్ కాంట్రాక్ట్ ఇన్వాయిస్‌ల ద్వారా నిధులు సిఫాన్ చేసినట్లు, ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణంలో షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ వంటి సంస్థల నుంచి కిక్‌బ్యాక్‌లు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ (ఎకనామికలీ వీకర్ సెక్షన్) స్కీం కింద కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ ఆరోపణలపై 2023 సెప్టెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెండ్యాల శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసింది. ఆయన షో కాజ్ నోటీసులకు స్పందించకపోవడం, ఆరోపణలపై వివరణ ఇవ్వకపోవడం ఈ చర్యకు కారణంగా ప్రభుత్వం అప్పట్లో చెప్పింది. ఆ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అమెరికా వెళ్లిన ఆయన ఇటీవల తిరిగి ఏపీకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
2023లో జారీ చేసిన నోటీసుల తర్వాత ఈ కేసులో ఐటీ శాఖ తదుపరి చర్యల గురించి బహిరంగ ప్రకటనలు చేయలేదు. ఐటీ కేసులు సాధారణంగా దీర్ఘకాలికంగా కొనసాగుతాయి. ఈ ఐటీ కేసును స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతో అనుసంధానించి ఏపీ సీఐడీ కూడా దర్యాప్తు చేస్తోందని 2023లో వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో విజయం సాధించి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో, ఈ కేసులపై రాజకీయ ప్రభావం ఉండే అవకాశం ఉంది.
చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నందున, ఈ కేసు రాజకీయంగా సున్నితమైన అంశంగా మారి దర్యాప్తు వేగం తగ్గిందనే ఆరోపణలు ఐటీ శాఖపై వచ్చాయి. ఐటీ శాఖ నుంచి తాజా నోటీసులు లేదా కోర్టు తీర్పుల గురించి ఇప్పటి వరకు స్పష్టమైన అప్‌డేట్ లేనందున ఇది ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పొచ్చు.
రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇచ్చిన విషయం ప్రస్తావించడంతో మరోసారి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఐటీ శాఖ సోదాలు చేస్తున్న సమయంలో మనోజ్ శ్రీవాస్తవ అనే వ్యక్తి ఐటీ కట్టకుండా దోచుకున్న డబ్బు విషయం పెండ్యాల శ్రీనివాస్ కు తెలుసునంటూ చెప్పారని, ఈ విషయంలో ఆర్థిక శాఖ ఎటువంటి చర్యలు తీసుకుందో వెల్లడించాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. అయితే ఆర్థిక శాఖ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.