నాగబాబుకు రాజ్యసభ యోగం లేనట్లే..

ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో రెండు టీడీపీ, ఒకటి బీజేపీకి దక్కే అవకాశం ఉంది. నాగబాబుకు సీటు దక్కే అవకాశం లేనట్లేనని జనసేన భావిస్తోంది.

Update: 2024-12-02 02:52 GMT

ఏపీ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వానికి పూర్తి బలం ఉండటంతో మూడు రాజ్యసభ స్థానాలు కూటమి పార్టీలకే దక్కనున్నాయి. తొలుత మూడు పార్టీలు ఒక్కో స్థానం పంచుకునేలా ప్రతిపాదన వచ్చింది. దీంతో, జనసేన నుంచి నాగబాబు కు ఖాయమని భావించారు. కానీ, ఇప్పుడు లెక్కలు మారాయి. ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే ముగ్గురి పేర్లు దాదాపు ఫైనల్ అయ్యాయి. అందులో నాగబాబు పేరు లేదని స్పష్టమైంది. నాగబాబుకు ఎంపీ స్థానం వస్తుందని అందరూ భావించారు. అది సాధ్యం కాకపోవడంతో రాజ్యసభకైనా అవకాశం ఉంటుందని భావించారు. అయితే అదికూడా దక్కదని తేలిపోయింది.

కూటమి పార్టీలకే మూడు సీట్లు దక్కనుండటంతో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ముందుగా మూడు పార్టీలు ఒక్కో సీటు దక్కించుకునేలా ప్రతిపాదనల పైన చర్చ జరిగింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాలకు రాజీనామా చేసిన ముగ్గురూ బీసీ నేతలే కావటంతో నిర్ణయం మారింది. బీసీల స్థానాల్లో ఇతర వర్గాలకు అవకాశం ఇవ్వటం ద్వారా విమర్శలు వచ్చే అవకాశం ఉందనే చర్చ తెర మీదకు వచ్చింది. అదే సమయంలో వైఎస్సార్సీపీకి రాజీనామా చేసే సమయంలో వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సి వస్తోంది. దీంతో ఇప్పుడు అభ్యర్ధుల ఖరారులో లెక్కలు మారాయి.

పవన్ తాజా ఢిల్లీ పర్యటనలో నాగబాబుకు పెద్దల సభకు ఎంపిక చేసే అంశం పైన చర్చలు చేసారనే కథనాలు వచ్చాయి. కానీ తాజాగా బీజేపీ నాయకత్వం ఏపీ నుంచి ఎంపిక చేసే మూడు స్థానాల్లో ఒక స్థానం తమ పార్టీ అభ్యర్దిగా ఆర్ క్రిష్ణయ్యకు తిరిగి నామినేట్ చేయాలని నిర్ణయించింది. అదే విధంగా బీద మస్తాన్ రావుకు ఇచ్చిన హామీ మేరకు టీడీపీ తిరిగి ఆయనను ఒక స్థానం నుంచి రాజ్యసభకు పంపనుంది. మిగిలిన ఒక్క స్థానం పైన ప్రస్తుతం తర్జన భర్జనలు సాగుతున్నాయి. తెలంగాణలో ఆర్ క్రిష్ణయ్య సేవలు రాజకీయంగా పార్టీకి వినియోగించుకోవాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కృష్ణయ్య వైఎస్సార్సీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. తిరిగి ఇప్పుడు బీజేపీ అభ్యర్దిగా రాజ్యసభకు వెళ్లనున్నారు.

మూడో స్థానం టీడీపీకే దక్కేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సీటు కోసం టీడీపీ నుంచి పలువురు రేసులో ఉన్నారు. వీరిలో కంభంపాటి రామ్మోహన్‌రావు, భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, వర్ల రామయ్య, సానా సతీశ్ పేర్లు ఉన్నాయి. పవన్ తన సోదరుడు నాగబాబుకు సీటు కోసం పట్టుబడితే లెక్కలు మారే అవకాశం ఉంది. కానీ, తాజాగా నాగబాబు చేసిన ట్వీట్ తో ఆయన ఈ పోటీకి దూరంగా ఉన్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో రెండు స్థానాలు టీడీపీ, ఒకటి బీజేపీ దక్కించుకోవటం దాదాపు ఖాయమైంది. కాగా ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాల పదవీ కాలం విషయానికి వస్తే మోపిదేవి 2026 జనవరి వరకు, మస్తాన్‌, కృష్ణయ్య పదవీకాలం 2026 జూన్‌ వరకు ఉన్నాయి. ముగ్గురు అభ్యర్ధుల ఎవరనే విషయంలో నేడు అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News