JAGAN Challenge|కావాలంటే నన్ను అరెస్ట్ చేస్కో: చంద్రబాబుకు జగన్ సవాల్
బడ్జెట్ పై నేను మాట్లాడాలంటే గంటా 40 నిమిషాల టైం కావాలి. మీరు ఇవ్వరు గనుకనే నేను మీడియా సమావేశం పెట్టి మాట్లాడుతున్నా అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
By : The Federal
Update: 2024-11-13 13:10 GMT
'చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చి మోసం చేసినందుకు ఆయన్ను నేను 420 అంటున్నా, అబద్ధాలు చెప్పారంటున్నా. ఆ మేరకు ట్వీట్ చేస్తున్నా. కావాలంటే నన్ను అరెస్ట్ చేస్కో' అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. బడ్జెట్ పై మాట్లాడేందుకు తనకు గంటా 40 నిమిషాల సమయం పడుతుందని, అందుకు అధికార పక్షం అంగీకరించదని, కనుకనే మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడుతున్నానని నవంబర్ 13న తాడేపల్లిలో మీడియా సమావేశంలో చెప్పారు. ఆయన ఏమన్నారంటే..
"ఇదిగో నీ మోసం..ఎన్నికల వేళ చెప్పిన సూపర్ సిక్స్ పథకాలకు రూ.74 వేల కోట్లు అవసరం. చంద్రబాబు ..నీవు చేసింది మోసం కాదా? నీవు చెప్పింది అబద్ధం కాదా? నీవు చేసింది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? నీ మీద 420 కేసు ఎందుకు పెట్టకూడదని నేను ట్వీట్ చేస్తున్నాను.
నాతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ట్వీట్ చేయాలని పిలుపునిస్తున్నా. అరెస్టు చేయాల్సి వస్తే మొదట నన్ను అరెస్టు చేయండి. ఎందుకు బడ్జెట్లో ఈ పథకాలకు కేటాయింపులు చేయలేదని ప్రశ్నిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ట్వీట్ చేయాలి" అని జగన్ వైసీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
"ఆర్‌బీఐ వద్దకు వెళ్లి చంద్రబాబు ప్రతి మంగళవారం కాలింగ్ బెల్ నొక్కుతున్నారు. మా హయాంలో సగటున రూ. 47 వేల కోట్లు రుణాలు తీసుకుంటే..చంద్రబాబు వచ్చి రాగానే రూ.68 వేల కోట్లు తీసుకుంటున్నానని చెప్పారు. ఎవరి హయాంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందో ఆలోచన చేయాలి. చంద్రబాబు హయాంలో అన్ని రకాలుగా రాష్ట్రం కుదేలు అవుతోంది. ప్రతి సెక్షన్‌ను మోసం చేశారు" అన్నారు జగన్.
"మహిళలు, చిన్నారుల పరిస్థితి ఏంటంటే.. ఏకంగా 110 మంది మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరిగాయి. ఇందులో 11 మంది చనిపోయారు. నిన్న కూడా మూడు ఘటనలు జరిగాయి. ఈ ఐదు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 170 హత్యలు జరిగాయి. 500పైగా హత్యాయత్నాలు జరిగాయి. ఇంత మందిపై దాడులు జరుగుతున్నాయి" అని జగన్ ఆరోపించారు.
"బడ్జెట్ అంతా మోసమే. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వడం లేదు. 104, 108 సిబ్బంది ధర్నాలు చేస్తున్నారు. అతలాకుతలం అవుతున్న పరిస్థితిలో చంద్రబాబును ప్రశ్నిస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా 680 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులకు నోటీసులు. 140 మందిపై కేసులు, 49 మందిని అరెస్టు చేశారు" అన్నారు వైఎస్ జగన్.
"ప్రతిపక్ష నాయకుడిగా ఇవన్నీ చెబుతూ మాట్లాడితే గంట 40 నిమిషాల సమయం పడుతుంది. మా పార్టీకి ప్రతిపక్షం గుర్తింపు ఇవ్వకపోతే ఇవన్నీ ఎవరు మాట్లాడుతారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే ఒక హక్కుగా సభలో మైక్ ఇవ్వాల్సి వస్తుంది. అసెంబ్లీలో ఇంత సమయంలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే చంద్రబాబు వద్ద చెప్పేందుకు సమాధానం ఉండదు. అందుకోసమే కావాలని, ప్రజల గొంతు వినబడకూడదని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అందుకోసమే ప్రజల కోసం, ప్రజల తరఫున మీడియా ద్వారా నేను, మా పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు ప్రతి రోజు మాట్లాడుతాం. మీడియా ద్వారా కచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తునే ఉంటాం" అన్నారు వైఎస్ జగన్.