జగన్ చేసిన దోపిడీ ఎంతో చెప్పిన బీజేపీ ఎమ్మెల్యే

వైసీపీ హయాంలో ఏపీ అంతా గుల్లగుల్లయింది.. ఇది కూటమి నేతలు ఎన్నికల ముందు నుంచి చెప్తున్న మాటే. అందులో జగన్ వాటా ఎంత అనేది బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ చెప్పారు.

Update: 2024-08-04 09:20 GMT

వైసీపీ హయాంలో ఏపీ అంతా గుల్ల గుల్ల అయింది.. ఇది కూటమి నేతలు ఎన్నికల ముందు నుంచి చెప్తున్న మాటే. వారు విడుదల చేసిన శ్వేతపత్రాల్లో కూడా ఇదే అంశం తేటతెల్లం అవుతోంది. రాష్ట్రాన్ని పరిపాలించిన ఐదేళ్ల కాలంలోనే వైసీపీ నేతలంతా దొరికినంత దోచుకున్నారని, ఏ మాత్రం అవకాశం దొరికినా వదలకుండా దోచేశారంటూ కూటమి నేతలంతా అన్నవారే. తాజాగా వైసీపీ దోపిడీపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని, ఏ ఒక్క రంగాన్ని వదిలి పెట్టకుండా దోచుకోవడమే పరమావధిగా వైసీపీ నేతలు వ్యవహరించారని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సహజ వనరులు, అధిక పన్నులతో ప్రజల ఆదాయం, కల్తీ మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని కూడా వైసీపీ దోచేసిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2019-2014 మధ్య జరిగిన విచ్చలవిడి దోపిడీలో జగన్ వాటా గురించి ఆయన మరింత ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందరికన్నా బెద్ద వాటా జగన్‌దేనంటూ వ్యాఖ్యానించారు.

మళ్ళీ గప్పాలు కొడుతున్నారు..

‘‘వాళ్లు చేసిన నీచ పనులు, మోసాలను ప్రజలు గుర్తించారు. అందుకే 2019 ఎన్నికల్లో 151 స్థానాలు కట్టబెట్టిన ప్రజలు ఈసారి 140 కుర్చీలు మడతపెట్టేశారు. వైసీపీని 11 స్థానాలకే పరిమితం చేస్తూ వారిని తాము పూర్తిగా తిరస్కరించామని చెప్పారు. అయినా వైసీపీ వాళ్లకు బుద్ది రాలేదు. అధికారంలోకి వచ్చి 50 రోజులు కూడా పూర్తికాకుండానే కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పథకాల అమలెక్కడా అంటూ నిలదీస్తున్నారు. వాళ్లు ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదో అబద్దాలు చెప్తున్నట్లు మాట్లాడుతున్నారు. వీటికి తోడుగా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటున్నారు. తమ నేతను మించిన తోపు లేరంటూ వైసీపీ నేతలు గప్పాలు కొడుతున్నారు. వారికి ప్రజలు అతిత్వరలోనే మరోసారి వాతపెడతారు’’ అని చురకలంటించారు.

జగన్ వాటా రూ.2 లక్షల కోట్లు.. మొత్తం ఎంతంటే..

‘‘ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలంతా రూ.5 లక్షల కోట్ల వరకు దోచేశారు. ఎక్కడ దొరికితే అక్కడ కొట్టేసి జేబులు నింపేసుకున్నారు. ఇందులో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ ఒక్కరి వాటానే రూ.2 లక్షల కోట్లు. అంటే ఈ మొత్తాన్ని ఆయనే స్వయంగా దోచేశారన్నమాట. మిగిలిన వారంతా కలిసి రూ.3 లక్షల కోట్లు లాగేశారు. అవకాశం దొరకడం ఆలస్యం అక్రమాలకు పాల్పడ్డారు. వారంతా కూడా జైలుకు వెళ్లడం ఖాయం. ఇప్పటికే రాష్ట్ర ప్రక్షాళన జరుగుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడిన, పాల్పడుతున్న అధికారులందరినీ కటకటాల వెనక్కి పంపే ప్రక్రియ మొదలైపోయింది’’ అని వివరించారు.

బాబుతోనే ఏపీ అభివృద్ధి

‘‘ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రంతో పాటు దేశానికి కూడా విజన్ ఉన్న నేత అధినాయకత్వం వహించాలి. అలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్‌కు అనుభవం, విజన్ రెండూ ఉన్న నేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే విధంగా దేశ ప్రధానిగా కూడా విజన్ ఉన్న నేత మోదీ ఉన్నారు. వీరిద్దరి ప్రోత్సాహంతో రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అవధులు లేని అభివృద్ధిని సాధిస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉంది. ఇప్పటికే ఆ దిశగా చర్యలు షురూ అయిపోయాయి. అతి త్వరలోనే రాష్ట్రానికి పరిశ్రమలు రాబోతున్నాయి. సంక్షేమ పథకాలు వంద శాతం అమలు చేస్తాం. పోలవరం బాధ్యతను కేంద్రం స్వీకరించింది. అమరావతి నిర్మాణానికి కూడా సహకారం అందిస్తామని కేంద్రం వెల్లడించింది. ఎన్‌డీఏ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం’’ అని వ్యాఖ్యానించారు. అదే విధంగా జగన్ తన 60 నెలల పాలనలో ఏనాడూ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు వేయలేదని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం సీఎంగా పగ్గాలు అందుకున్న తొలి నెల నుంచే ఒకటో తేదీనే జీతాలు పడేలా చర్యలు తీసుకున్నారు అని ఆదినారాయణ వివరించారు.

Tags:    

Similar News