సొంత ఇమేజ్‌తోనే జనం మధ్యకు జగన్
వైఎస్‌ఆర్ లెగస్సీతో 2019లో గెలుపొందిన జగన్ తన సొంత ఇమేజ్‌తో వెళ్తున్న జగన్ 2024 ఎన్నికల్లో విజయం సాధిస్తారా? లేదా వైఎస్‌ఆర్ లెగస్సీని ఉపయోగించుకోక తప్పదా?;
జి విజయ కుమార్
సొంత ఇమేజ్‌ను ఉపయోగించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు. 2014, 2019 లో జరిగిన ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ అజెండానే తన అజెండాగా భుజంపై వేసుకొని జగన్ ప్రచారం నిర్వహించారు. 2014లో ఓటమి పాలైనా 2019లో అఖండ విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఎక్కువుగా జగనన్న పేరునే వినియోగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైఎస్‌ఆర్ రాజీవ్‌గాంధీ, ఇందిరా గాంధీ పేర్లకు ఎక్కువ ప్రాధాన్యతిచ్చారు. వైఎస్‌ఆర్ చనిపోయి దశాబ్దం దాటినా ఇంకా వైఎస్‌ఆర్ పేరుతోనే ఎన్నికల్లో పోవడం వైఎస్ జగన్ మనసుకు కాస్త కష్టమనిపించినట్లుంది. వైఎస్‌ఆర్ ఫొటోను ఎలాగైతే ప్రతి ఇంట్లో అభిమానులు పెట్టుకున్నారో అలాగే తన ఫొటోను కూడా అభిమానుల ఇళ్లల్లో కనిపించాలని వైఎస్ జగన్ అప్పుడు అప్పడు అంటుండేవారు. ఆ భావనతోనే వైఎస్‌ఆర్ పేరుకు బదులుగా వైఎస్ జగన్ పేరునే ఎక్కువుగా ప్రజలు తలచుకునేలా చేస్తున్నారు.