షర్మిల వైపే విజయ సాయి రెడ్డి? జగన్ ఇక ఒంటరి!
జగన్ ను ఒంటరి చేసేలా వ్యూహం ఖరారైందా? వైఎస్ షర్మిలను విజయసాయి రెడ్డి అందుకే కలిశారా? షర్మిల, విజయసాయి భేటీ వార్త వైసీపీలో మంటలు రేపుతోంది..;
By : The Federal
Update: 2025-02-02 03:57 GMT
రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. శాశ్వత మితృత్వాలు, శత్రుత్వాలు అంటూ ఏమి ఉండవు. నిన్నటి దాకా శత్రువులైన వారు ఆ మర్నాడే మిత్రులవుతారు, అప్పటిదాకా 'నువ్వెంతంటే నువ్వెంతనుకునే వారు' ఆ వెంటనే 'ఆయన/ ఆమె మా కుటుంబ సన్నిహితులు, రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు' అని నొక్కివక్కాణిస్తుంటారు. ఇప్పుడదే జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. నిన్నటి వరకు ఉప్పూ నిప్పూగా ఉన్న ఓ ఇద్దరు వేర్వేరు రాజకీయ పార్టీల వారు ఆకస్మాత్తుగా భేటీ కావడం ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశమైంది. రాజకీయ వర్గాలలో కలకలం సృష్టించింది. ఆ ఇద్దరెవరో కాదు ఒకరు వైఎస్ షర్మిల. మరొకరు విజయసాయిరెడ్డి. ఒకప్పుడైతే వీరిద్దరి భేటీకి పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు గాని ఇప్పుడైతే నిజంగా విశేషమే.
మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలతో భేటీ కావడం వైసీపీలోనే కాకుండా ఇతర రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేపింది. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి, రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన ఆయన మూడు రోజుల కిందట హైదరాబాద్‌లో షర్మిల ఇంటికి వెళ్లారని తెలిసింది. దాదాపు 3 గంటలపాటు రాజకీయ అంశాలపై చర్చించారని తెలుస్తోంది. షర్మిలతో కలిసి అక్కడే మధ్యాహ్నం భోజనం చేశారు. పరస్పరం కుశలాలు కనుక్కున్నారని సమాచారం. షర్మిల కుమారుడి పెళ్లికి కూడా వెళ్లని విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి తప్పుకున్న తర్వాత నేరుగా ఆమె ఇంటికే వెళ్లడం అనేక ఊహాగానాలకు తావిచ్చింది. మాజీ సీఎం జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య కుటుంబ, రాజకీయ సంబంధాలు ఇటీవలి కాలంలో బాగా దెబ్బతిన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ముందైతే ఒకర్నొకరు వ్యక్తిగతంగానూ విమర్శించుకున్నారు. దెప్పిపొడుచుకున్నారు. ఆ సమయంలో వైసీపీలో ఉన్న విజయసాయిరెడ్డి షర్మిలను కూడా ఏకవచనంతో సంబోధించడం గమనార్హం. వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డ అని, షర్మిలమ్మ అని పిలిచే విజయసాయి రెడ్డి ఎన్నికల సమయంలో చాల కటువుగానే వ్యవహరించారు. అలాంటి వ్యక్తి ఇటీవల జగన్ పార్టీకి సలాం కొట్టి వ్యవసాయం చేసుకుంటానంటూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు షర్మిలను కలవడం రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలకు తావిస్తోంది.
విజయసాయిరెడ్డిపై అనేక సందర్భాల్లో షర్మిల ఘాటైన విమర్శలు చేశారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారని విజయసాయి ప్రకటించడంపైనా ఆమె అభ్యంతరం తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసినప్పుడు.. వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికైనా నిజాలు బయటపెట్టాలని షర్మిల సలహా ఇచ్చారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో షర్మిలను ఆయన కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
నెల్లూరు జిల్లా, తాళ్ళపూడి గ్రామంలో జన్మించిన విజయసాయిరెడ్డి చార్టెట్ అకౌంటెన్సీలో దిట్ట. చెన్నై, హైదరాబాదు, బెంగళూరు నగరాలలో సొంత వ్యాపార సంస్థను ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగారు. వైఎస్ కుటుంబానికి తాను అత్యంత సన్నిహితుడినని చెప్పుకునే విజయసాయి వైఎస్ రాజశేఖరరెడ్డి సిఫార్సుతో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ సహా పలు జాతీయ బ్యాంకులకు డైరెక్టరుగా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్ సాక్షి దినపత్రికను ప్రారంభించినపుడు ఆయన ఫైనాన్షియల్ డైరెక్టర్ గా పని చేశారు. వైఎస్సార్ మరణం తర్వాత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైఎస్ జగన్ అరెస్ట్ అయ్యారు. ఆ కేసులో విజయసాయి రెడ్డి కూడా ఏ 2గా ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్ పెట్టిన వైసీపీలో చేరి రాజ్యసభ సభ్యునిగా 8 ఏళ్ల పాటు పని చేశారు.
2016 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యాడు. రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీకి చెందిన కీలక నేతగా మారాడు. కష్టాల్లో జగన్ కు తోడుగా నిలిచారు. అటువంటి వ్యక్తి వైసీపీ నుంచి తప్పుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ షర్మిలతో మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడు గంటల పాటు వీరిరువురి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయని సమాచారం.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య దూరం పెరిగింది. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ క్రమంలో గతేడాది మే, జూన్ మాసంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ షర్మిల బరిలోకి దిగి.. తన సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత చాలామంది నేతలు బయటకు వెళ్లిపోతున్నట్టే విజయసాయిరెడ్డి కూడా వెళ్లిపోయారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ విశ్వసనీయత కోల్పోయినందునే విజయసాయిరెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారని వైఎస్ షర్మిల కూడా ఆవేళ ధ్వజమెత్తారు. వైఎస్ వివేకా హత్య విషయంలో ఇప్పటికైనా విజయసాయి నిజం చెప్పాలని డిమాండ్ కూడా చేశారు.
తన సోదరుడు వైఎస్ జగన్‌కు విజయసాయి రెడ్డి అత్యంత సన్నిహితుడని గుర్తు చేసుకున్నారు. జగన్ ఏ పని చేయమని ఆదేశిస్తే ఆ పని చేసే వారని చెప్పారు. ఆ క్రమంలో ఎవరిని తిట్టమంటే వాళ్లను తిట్టడమే విజయసాయి రెడ్డి పని అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. అలాగే నా అనుకున్న వాళ్లను వైఎస్ జగన్ కాపాడుకోలేక పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ సన్నిహితుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేశారంటే చిన్న విషయం కాదన్నారు.
ఎన్నో అనుమానాలు, మరెన్నో ఊహాగానాలు...
15 రోజుల పాటు ఇంగ్లాండ్, ప్రాన్స్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ కోర్లులో విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10వ తేదీ మధ్య విజయసాయి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సరిగ్గా ఈ దశలో ఆయన వైఎస్ షర్మిలను కలవడం గమనార్హం.
కుటుంబ కలహాలను ఓ కొలిక్కి తేవడానికి కలిశారని కొందరంటున్నారు. అయితే షర్మిల, జగన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినందున వారి మధ్య రాజీకి విజయసాయిరెడ్డి సరిపోడని కూడా కొందరంటున్నారు.
వైఎస్ విజయమ్మ సలహా మేరకే విజయసాయి రెడ్డి షర్మిలతో భేటీ అయ్యారని మరో ఊహాగానం కూడా ఉంది. మున్ముందు వైఎస్ షర్మిల వైపు విజయసాయి రెడ్డి ఉంటారని, జగన్ ను ఒంటరి చేసే కుట్రలో భాగమనే వారూ లేకపోలేదు. ఏది ఏమైనా మరో రెండు మూడ్రోజుల్లో అసలు విషయం బయటకు వస్తుందని ఓ సీనియర్ జర్నలిస్టు అన్నారు.