జగనన్నా.. నీదంత మంచి హృదయం కాదే: వాసిరెడ్డి పద్మ
జగన్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.
Byline : Vijaykumar Garika
Update: 2024-10-23 06:32 GMT
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఓటమి పాలుకావడం, దీంతో అధికారం మారడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో కీలక మహిళా నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్‌ఆర్‌సీపీలో కీలక మహిళా నేతగా చెలామణి అయిన, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీకు గుడ్ బై పేరుతో తన రాజీనామా లేఖను విడుదల చేశారు. వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేస్తూ మీడియా ద్వారా తెలియజేస్తున్నానని తెలిపారు.
ఆ లేఖలో ఏముందంటే.. పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ ‘గుడ్ బుక్’, ప్రమోషన్లు అంటున్నారు. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది గుడ్ బుక్ కాదు గుండె బుక్. వారికి ప్రమోషన్ పదం వాడటానికి రాజకీయపార్టీ వ్యాపార కంపెనీ కాదు. జీవితాలు, ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదు అనుకునే జగన్ గుడ్ బుక్ పేరుతో మరో సారి మోసం చేయడానికి సిద్ధపడుతున్నారు. పార్టీని నడిపించడంలో జగన్‌కు బాధ్యత లేదు. పరిపాలన చేయడంలో బాధ్యత లేదు. సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదు. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడుని ప్రజలు మెచ్చుకోరని ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా, విధానాల పరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పని చేశాను. ప్రజాతీర్పు తర్వాత అనేక విషయాలు సమీక్షించుకుని అంతర్మథనం చెంది వైసీపీను వీడాలని నిర్ణయం తీసుకున్నానని తెలియజేస్తున్నాను. అని వాసిరెడ్డి పద్మ తన రాజీనామా లేఖలో తెలిపారు.