జగనన్నా, నువ్వూ నీ భార్య భారతి బైబిల్ ముందు కూర్చుని ఆలోచన చేయండన్నా!
సొంత చెల్లిని, ఆమె బిడ్డల్నే వెన్నుపోటు పొడవాలని చూస్తారా.. ఇదేనా మీరు చేయాల్సిన పని.. మున్ముందు మీరిద్దరూ నా బిడ్డల ముఖం చూడగలుగుతారా అని ప్రశ్నించారు షర్మిల;
By : The Federal
Update: 2025-02-08 17:02 GMT
తల్లి తర్వాత తల్లి అంతటి వాడు మేనమామ అంటారే.. అలాంటి నానుడీకే మచ్చ తెచ్చావు కదన్నా అని వాపోయారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత చెల్లి వైఎస్ షర్మిల. "నువ్వు, నీ భార్య YS Bharathi బైబిల్ ముందు కూర్చుని ఓసారి ఆలోచన చేయండన్నా! మీరు ఎవరికి అన్యాయం చేయతలపెట్టారో? రేపు ఎప్పుడైనా మీరిద్దరూ నా బిడ్డలైన నీ మేనల్లుడు, నీ మేనకోడలు ముఖం చూడగలుగుతారా? మీరింత దుర్మార్గంగా వ్యవహరిస్తారా?" అని ఆమె ఆవేదన చెందారు. విజయసాయి రెడ్డి చెప్పిన విషయాలు విన్నప్పుడు మీ నైజం తెలిసి కళ్లనీళ్లు ఆపుకోలేక పోయానని ఆమె అన్నారు.
వైసీపీ నుంచి బయటకి వచ్చిన విజయసాయి రెడ్డి ఇటీవల హైదరాబాద్ లో వైఎస్ షర్మిలను ఆమె ఇంట్లో కలిశారు. ఆ వార్త మీడియాలో వచ్చినప్పటికీ ఆ ఇరువురూ ఇంతకాలం స్పందించలేదు. ఫిబ్రవరి 8న వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. విజయసాయిరెడ్డి తనను కలిసిన మాట వాస్తవమేనని చెబుతూ వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను బయటపెట్టారు. ఈ సందర్భంగా జగన్(Jagan)పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి, రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన ఆయన ఇటీవల హైదరాబాద్‌లో షర్మిల ఇంటికి వెళ్లారు. దాదాపు 3 గంటలపాటు రాజకీయ అంశాలపై చర్చించారు. వైఎస్ షర్మిల ఆ భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
వైఎస్ షర్మిల ఏమన్నారంటే...
‘‘విజయసాయిరెడ్డితో చాలా అంశాలు మాట్లాడాం. జగన్ వల్ల పడిన ఇబ్బందులను సాయిరెడ్డి చెప్పారు. నా పిల్లలకు సంబంధించిన విషయమే నేను చెబుతా. షేర్లు తనకే చెందాలంటూ నాపై, నా తల్లిపై జగన్ కేసు వేశారు. నా మాటలు అబద్ధాలని విజయసాయిరెడ్డితో జగనే చెప్పించారు. సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మాటలు అసత్యమని విజయమ్మే చెప్పారు. ఆ తర్వాత కూడా విజయసాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారట. ఆయన అంగీకరించకుంటే సుబ్బారెడ్డితో మాట్లాడించారు. ఆ తర్వాత మళ్లీ విజయసాయిరెడ్డిని జగన్ పిలిపించి 40 నిమిషాల పాటు స్వయంగా డిక్టేట్ చేశారట! ఎలా చెప్పాలి, నాపై ఏం మాట్లాడాలో జగనే మొత్తం వివరించారట. తర్వాత ప్రెస్‌మీట్ పెట్టకపోవడంతో జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ విషయాలన్నీ విజయసాయిరెడ్డి నాకు స్వయంగా చెప్పారు. ఆయన చెప్పినవి విన్నాక నాకు కన్నీళ్లు వచ్చాయి’’ అని ఆమె అన్నారు.
విజయసాయిపై వత్తిడి ఎలాగంటే...
‘‘జగన్ ఇటీవల క్యారెక్టర్ గురించి పెద్ద పెద్ద డైలాగులు చెబుతున్నారు. అసలు క్యారెక్టర్ అంటే ఏమిటో జగన్ మరిచిపోయారు. వైఎస్ కోరికకు భిన్నంగా అబద్ధం చెప్పాలని విజయసాయిపై ఒత్తిడి చేశారు. నా పరువు పోతుంది.. వదిలేయండి అన్నా.. అని విజయసాయిరెడ్డి చెప్పినా జగన్ ఊరుకోలేదు. ఏ అబద్ధం ఎలా చెప్పాలో జగన్ చెబితే.. విజయసాయిరెడ్డి రాసుకున్నారట. ఇదీ మా అన్న జగన్‌రెడ్డి మహోన్నతమైన క్యారెక్టర్. సొంత మేనకోడలు, మేనల్లుడు ఆస్తులు కాజేయాలని జగన్ ఇన్ని కుట్రలు చేశారు. జగన్, అతని భార్య ఎంత దిగజారిపోయారో బైబిల్ ముందు కూర్చుని ఆలోచన చేయాలి. నా పిల్లలకు మీ ముఖం చూపించే ధైర్యం ఉందా? సొంత చెల్లి, ఆమె బిడ్డలకే వెన్నుపోటు పొడిచారు. మీరా.. ఇంకొకరి గురించి మాట్లాడేది? దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో.. జగన్ చెబితే అలా ఉంది. జగన్‌కు విశ్వసనీయత, విలువలు ఏ మాత్రం లేవు’’అని షర్మిల చెప్పారు.
జగన్ చెప్పేవన్నీ నీతులే...
‘‘నీతులు చెప్పే జగన్.. వాటిని ఆయన మాత్రం పాటించరు. వైఎస్ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన జగన్.. ఆయన ఆశయాలను కాలరాశారు. మద్య నిషేధం అన్న వ్యక్తి.. మద్యం ఏరులై పారించారు. నీకు ఏ మాత్రం విలువలు, విశ్వసనీయత లేదు. సొంత చిన్నాన్నను చంపారని సీబీఐ అవినాష్‌రెడ్డి పేరు చెప్పింది. అలాంటి వ్యక్తికి ఎంపీ సీటు ఇచ్చి పక్కన పెట్టుకున్నారు. ప్రాణం తీసే వరకు చిన్నాన్న నీతోనే ఉన్నారు కదా. సొంత చెల్లెలు క్యారెక్టర్ పై బురద చల్లారు. నా బిడ్డల ఆస్తుల కోసం ఇన్ని డ్రామాలా? కుట్రలా? విజయసాయి రెడ్డి ఈ విషయాలన్నీ నాకు చెప్పారు. జగన్ ఇంత నీచంగా వ్యవహరిస్తారని తెలిసి బాధ కలిగింది. విజయసాయి రెడ్డి ప్రయాణం ఏమిటో నాకు తెలియదు’’ అని షర్మిల అన్నారు.
వైఎస్ షర్మిల చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపాయి. వైసీపీ శ్రేణులకు వైఎస్ షర్మిల చేసిన వినతి వైఎస్ జగన్ ను ఆత్మరక్షణలో పడేశాయి. షర్మిల ఆరోపణలపై వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.