జనసేన ఎమ్మెల్యే నానాజీపై పవన్ ఆగ్రహం, డాక్టర్ కి సారీ చెప్పిన పంతం!

ఆదర్శప్రాయంగా అందరికీ తల్లో నాలుకలా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఇక సామాన్యులకు దిక్కెవరు? ఏమైందీ ఎమ్మెల్యేలకి?

Update: 2024-09-22 05:49 GMT

ఆదర్శప్రాయంగా అందరికీ తల్లో నాలుకలా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఇక సామాన్యులకు దిక్కెవరు? న్యాయాన్ని కాపాడాల్సిన వారే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ప్రభుత్వ వ్యవస్థలు ఏమి కావాలి? ఏమైందీ ఎమ్మెల్యేలకి? ఆ మధ్య ఓ ఎమ్మెల్యే చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని తన ప్రత్యర్థి పార్టీ నాయకుడి ఇంటిని కూల్చివేయించారు. ఇటీవల ఓ ఎమ్మెల్యే ఓ మహిళను తన గదికి రప్పించుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనను ఓ డాక్టరు దూషించారన్న సాకుతో ఏకంగా దాడికి పాల్పడ్డారు. ఇప్పుడా వీడియో బయటపడి వైరల్ కావడంతో క్షమాపలు చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నారు. అడుసు తొక్కడమేలా కాలు కడగనేల సామెత వీరికి బాగా నప్పేలా ఉంది.

అసలేం జరిగిందంటే...
కాకినాడ ఆర్‌ఎంసీ గ్రౌండ్ లో ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు ఎటువంటి అనుమతులు లేకుండానే కొన్ని రోజులుగా వాలీబాల్‌ ఆడుతున్నారు. ఇందుకు ఆర్ఎంసీ కళాశాల అధికారులు అభ్యంతరం తెలిపారు. అనుచరులు ఆ విషయాన్ని ఎమ్మెల్యేకి చెప్పడంతో ఆయన అధికారులకు ఫోన్‌ చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు. అధికారుల నిర్ణయమేమిటో చెప్పకముందే ఎమ్మెల్యే అనుచరులు శనివారం ఉదయం మళ్లీ గ్రౌండ్ లో వాలీబాల్ ఆడడానికి వెళ్లారు. వాలీబాల్‌ నెట్‌ కడుతుండగా డాక్టర్‌ ఉమామహేశ్వరరావు అడ్డుకున్నారు. అనుమతులు వచ్చే వరకు ఆగాలన్నారు. దీంతో ఆ యువకులు నేరుగా ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు.
ఆ డాక్టరు తిట్టాడని ఫిర్యాదు...
ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన ఆయన అనుచరులు జరిగిన విషయాన్ని చెప్పకుండా ‘మిమ్మల్ డాక్టర్ ఉమామహేశ్వరరావు తిట్టారు’ అంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే పంతం హుటాహుటిన ఆర్‌ఎంసీ మైదానానికి వచ్చారు. ప్రొఫెసర్‌ ఉమామహేశ్వరరావుపై తిట్ల దండకాన్ని అందుకున్నారు. చంపేస్తానంటూ దూసుకెళ్లారు. ఆయన మూతికున్న ఫేస్‌ మాస్క్‌ను లాగేశాడు. చెయ్యెత్తి కొట్టబోయారు. ఈలోగా వెనుక నుంచి ఎమ్మెల్యే మేనల్లుడు బన్నీ ప్రొఫెసర్‌ ఉమామహేశ్వరరావుపై చేయి చేసుకున్నారు. ‘సార్‌ మిమ్మల్ని నేను తిట్టలేదు. వారు చెపుతున్న దానిలో వాస్తవం లేదు’ అంటూ ప్రొఫెసర్ చెబుతున్నా ఎమ్మెల్యే వినలేదు. అంతా కలసి డాక్టర్‌ను నెట్టేసి వెళ్లిపోయారు.
ఈ వీడియో వైరల్...
డాక్టర్ ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే పంతం నానాజీకి మధ్య జరిగిన గొడవ, ఆ డాక్టర్ పై చేయి చేసుకున్న తీరుపై బయటకి వచ్చిన వీడియో వైరల్ అయింది. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల(ఆర్‌ఎంసీ) ఫొరెన్సిక్‌ విభాగాధిపతి, కాలేజీ స్పోర్ట్స్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఉమామహేశ్వరరావుపై దౌర్జన్యానికి దిగారంటూ కాకినాడ అంతా ప్రచారం జరిగింది. అందరూ ఎమ్మెల్యే తీరును తప్పుబట్టారు. ఈ వ్యవహారం అటు ఇటూ తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దృష్టికి చేరింది. దీంతో వాళ్లిద్దరూ ఎమ్మెల్యేను మందలించారని తెలిసింది.
క్షమాపణ చెప్పిన ఎమ్యెల్యే...
ఆ వెంటనే కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దిగివచ్చారు. క్షమాపణలు చెప్పారు. ‘‘కేసు ఫైల్ చేయొద్దని కూడా నేను అడగడం లేదు. నేను వైద్య వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడలేదు. అలా ఎవరీతోనూ, ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఉద్రేకపూర్వకంగా జరిగింది. తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. వైద్య వృత్తికి క్షమాపణలు చెబుతున్నాను’’ అని నానాజీ ప్రకటించారు.
దాడికి గురైన డాక్టర్‌ ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ.. కేసు పెడుతున్నామన్నారు. రోగుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి సమ్మెలు చేయవద్దని విద్యార్థులకు సూచించారు. ‘‘రెండు మూడు రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ముందుగా నేరస్థులను గుర్తించాలి. నేను ఫిర్యాదు చేస్తాను. నాతో పాటు దెబ్బలు తిన్న విద్యార్థులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే మీద నాకు కోపం, కసి లేవు. కానీ పది మంది మధ్య చేసిన పని సరికాదు’’ అని విచారం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ ఆగ్రహం...
ఎమ్మెల్యే నానాజీ ఆ డాక్టర్ ను నానా తిట్లు తిట్టడాన్ని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఖండించారు. ఆ ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్‌ షన్‌ మోహన్‌, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ రాజీ ప్రయత్నాలు చేశారు. క్షణికావేశంలో దురదృష్టవశాత్తు అలా జరిగిపోయిందని ఎమ్మెల్యే చెప్పడంతో... ప్రొఫెసర్‌ ఒకింత తగ్గారు. కానీ, వైద్య విద్యార్థులు మాత్రం తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యుల సంఘం ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఎమ్మెల్యే, ఆయన అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని అసోసియేసన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పిడకాల శ్యాంసుందర్‌ కోరారు. చివరికి ఏమలుపు తిరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News