PULIVENDULA - YS | పోలీసుల అదుపులో కడప ఎంపీ పీఏ

పులివెందుల పోలీసులు రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీంతోపెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-01-07 14:57 GMT
పులివెందుల పోలీస్ స్టేషన్ (ఇన్ సెట్ )కడప ఎంపీ పీఏ రాఘవరెడ్డి

వైసీపీ నాయకులను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా వర్కర్లను ఊరూర నమోదైన కేసుల్లో పీటీ వారెంట్లపై తిప్పుతున్నారు. కడప జిల్లా పులివెందులకు చెందిన వర్రా రవీంద్రారెడ్డి మొదటి వరుసలో ఉన్నారు. ఈపాటికే ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఆ తరువాత కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా..

పులివెందులలో మంగళవారం రాత్రి ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సమాచారం బయటికి ప్రచారం కావడంతో వైసీపీ కార్యకర్తలు, వైఎస్ అవినాష్ రెడ్డి మద్దతుదారులు భారీగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నట్లు సమాచారం అందింది.
పులివెందులకే చెందిన వర్రా రాఘవరెడ్డి ద్వారా టీడీపీ, జనసేన అధ్యక్షులు ఎన్. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తోపాటు, వారి కుటుంబ సభ్యులు, చివరాఖరికి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలనపూడి అనితపై కూడా సోషల్ మీడియా పోస్టులు పెట్టారనే అభియోగాలు ఉన్న విషయం తెలిసిందే. ఇదంతా ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి చేయించారనే అభియోగాలు ఉన్నాయి. గత ఏడాది నవంబర్ ఎనిమిదో తేదీ నమోదు చేసిన ఎస్సీ,ఎస్టీ కేసులో కూడా రాఘవరెడ్డి 20వ నిందితుడిగా ఉన్నారు. అంతేకాకుండా, వైఎస్. షర్మిల, మాజీ మంత్రి వైఎస్. వివేకానందరెడ్డి కూతురు వైఎస్. సునీతారెడ్డిపై కూడా వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి.
బెయిల్ తిరస్కరణతో...
అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి కేసుల నుంచి రక్షణ కోసం హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆ పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో పులివెందుల పట్టణంలో ఆయన నివాసంలోనే రాఘవరెడ్డిని ఈ రోజు సాయంత్రం అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. సోషల్ మీడియాలో పోస్టింగులతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసులను డీఎస్పీ మురళీనాయక్ విచారణ చేస్తున్నారు.
అరెస్టు ప్రచారంతో..
కడప ఎంపీ పీఏ రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అరెస్టు చేస్తారని పులివెందులో ప్రచారం జరిగింది. దీంతో వైసీపీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలోనే పులివెందుల పోలీస్ స్టేషన్ దగ్దరికి చేరుకున్నారని సమాచారం. గ్రామాల నుంచి కూడా పార్టీ నాయకులు, ప్రధానంగా ఎంపీ అవినాష్ మద్దతుదారులు వస్తున్నట్లు చెబుతున్నారు. "పులివెందులలో నాయకులే కాదు. వారి అనుచరులను అదుపులోకి తీసుకున్నప్పుడు జనం రావడం మామాలే" అని ఓ సీనియర్ జర్నలిస్టు తేలిగ్గా తీసిపారేశారు.
Tags:    

Similar News