కాణిపాకం:సత్యప్రమాణంగా ప్రధానార్చకుడిపై వేటుతో కలకలం
అక్కడ అబద్దాలు చెప్పాలంటే భయం. సత్యమే పలకాలి. ప్రమాణం చేయడానికీ జంకుతారు. అలాంటి కాణిపాకం ఆలయ ప్రధానార్చకుడు ఏమి చేశారు? ఆయనపై ఎందుకు వేటు పడింది?
Byline : The Federal
Update: 2024-10-29 12:21 GMT
సత్యప్రమాణాలకు నిలయం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయం. ఇక్కడ బావిలో నుంచి నినాయకుడు ఉద్భవించారనేది చరిత్ర. విగ్రహం ఉన్న బావి నుంచి నిత్యం నీరు ఉబివస్తుండడం అర్చకులు భక్తులకు చూపిస్తారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉన్న సోమశేఖర్ గురుకుల్ పై దేవాదాయ శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఆలయవర్గాల్లో ఇదే అంశం కలకలం చెలరేగింది.
ఆధ్యాత్మకతకు నెలవు
రాయలసీమ ప్రధానంగా చిత్తూరు జిల్లా లో చారిత్రక ఆలయాలకు నిలయం. అందులో తిరుమల శ్రీవారి ఆలయం తర్వాత శైవక్షేత్రాలైన శ్రీకాళహస్తి తర్వాత కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయాన్ని సందర్శించే యాత్రికుల సంఖ్య రోజు వేలల్లో ఉంటుంది. వీటిలో.. స్వయంభుగా వెలసిన కాణిపాక వరసిద్ధి ఆలయం "సత్య ప్రమాణాలకు కూడా నిలయం" ఈ ఆలయ ప్రధానార్చకుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో హిందూ దేవాదాయ శాఖ అధికారులు సస్పన్షన్ వేటు వేశారు. ఆర్చక అర్హత పత్రాలపై అందిన ఫిర్యాదుల నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్లు కాణిపాకం (Kanipaakam) ఆలయ కార్యనిర్వహణాధికారి (Executive Officer-Eo) 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి తెలిపారు. తాజా సంఘటన వివరాల్లోకి వెళితే..
వేటు ఎందుకు వేశారంటే..
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం ప్రధాన అర్చకుడిగా ఉన్న సోమశేకర గురుకుల్ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఆయన సమర్పించిన "పత్రాల్లో తేడాలు ఉండడం, పరీక్ష పాస్ కాకుండానే పదోన్నతి" తీసుకున్నారని న్యాయవాది రవికుమార్ ఆరు నెలల కిందట దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సోమశేఖర్ సమర్పించిన పత్రాలు పరిశీలించి, నివేదిక ఇవ్వాలని గతంలో కాణిపాకం ఆలయ ఈఓగా ఉన్న వెంకటేశును దేవాదాయ శాఖ అధికారులు ఆదేశించారు. దీంతో సోమశేఖర్ పత్రాలను పరిశీలించారు. కాగా సోమశేఖర్ కు వైసీపీ పాలనలోని పాలక మండలి అండ వల్ల తాత్కాలికంగా చర్యలు తీసుకోలేదని తెలిసింది. అయితే,
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని విభాగాల్లో అధికారులను బదిలీ చేశారు. ఆ కోవలోనే కాణిపాకం ఆలయ ఈఓగా ఉన్న వెంకటేశు స్థానంలో వచ్చిన గురుప్రసాద్ కూడా పాలనా వ్యవహారాలపై దృష్టిసారించారు. పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులను పరిశీలించి, ప్రధాన అర్చకుడు సోమశేఖర్ పై ఉన్న ఫిర్యాదును కూడా అధ్యయనం చేశారు. ప్రధానార్చకుడు డిపార్టమెంట్ ((Department) పరీక్ష పాస్ కాకుండానే పదోన్నతి కల్పించారని దేవాదాయ శాఖాధికారులకు నివేదిక సమర్పించారు. దీంతో ప్రధానార్చకుడు సోమశేఖర్ గురుకుల్ ను సస్పెండ్ చేస్తూ, ఆదేశాలు జారీ అయ్యాయి.
కాణిపాకం ఆలయ ఈఓ గురుప్రసాద్ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి వివరించారు. అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. దీనిపై విచారణ జరుగుతుందని తెలిపారు. సస్పన్షన్ కు గురైన సోమశేఖర్ గురుకుల్ స్థానంలో ప్రధాన అర్చకుడిగా ఎస్.ఎస్. గణేశ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అనువంశికంగా అవకాశం...
సస్పెన్షన్ కు గురైన మాజీ ప్రధానార్చకుడు సోమశేఖర్ గురుకుల్ ను మంగళవారం 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధి పలకరించారు. "కాణిపాకం ఆలయంలో అర్చకుడిగా 1997లో చేరాను. ఇది కూడా తనకు అనువంశికంగా లభించిన అవకాశం" అని సోమశేఖర్ తెలిపారు. "మా తాతకు కొడుకు లేకపోవడం వల్ల నాకు ఈ భాగ్యం దక్కింది. నా సర్టిఫకెట్లు అన్నీ సక్రమంగానే ఉన్నాయి" అని ఆయన వివరించారు. "దేవాదాయ శాఖ అధికారులు జారీ చేసిన షో కాజ్ నోటీసుకు సమాధానం ఇస్తా" అని స్పష్టం చేశారు.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే పదోన్నతి కోసం పరీక్ష పాస్ కాకుండానే సోమశేఖర్ కు పదోన్నతి ఎలా ఇచ్చారు? అనేది సమాధానం లేని ప్రశ్న. ఆ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చర్చకు వచ్చింది. కాగా, ఇంకొందరు ఉద్యోగులు కూడా గత వైసీపీ ప్రభుత్వ కాలంలో నియమించిన పాలక మండలి కాలంలో దొడ్డిదారిన ఉద్యోగాల్లో తిష్ట వేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. వీటిని ప్రస్తుత ఈఓ గురుప్రసాద్ ఎలా నిగ్గు తేలుస్తారనేది వేచిచూడాలి.